CM Chandrababu: అన్నీ చిక్కుముడులే ఒక్కొక్కటి విప్పుతున్నాం.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం కళ తప్పిందని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం కళ తప్పిందని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ముందు అనే నినాదంతో కూటమి ప్రభత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపానలను సమన్వయం చేస్తున్నామని కామెంట్ చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం కళ తప్పిందని అన్నారు. వైసీపీ సర్కార్ సృష్టించిన సమస్యలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. అన్నీ చిక్కుముడులే.. ఒక్కో ముడిని విప్పుతున్నామని అన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హార్ట్‌వర్స్ కాదు.. స్మార్ట్ వర్క్ అవసరమని పేర్కొన్నారు. తాను ఒకప్పుడు ఐటీ, సెల్‌ఫోన్లను ప్రోత్సహించానని.. సెలఫోన్ తిండి పెండుతుందా అంటూ కొందరు తనపై కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ.. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. ఏ సర్టిఫికేట్ కావాలన్నా సెల్‌ఫోన్‌తో సందేశమిస్తే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్షణాల్లో అందజేస్తున్నామని అన్నారు. వ్యవసాయం, ప్రపంచ జ్ఞానం AI ద్వారా అందుతోందని కామెంట్ చేశారు. మార్గదర్శి-బంగారు కుటుంబం, P4 కార్యక్రమాలు ప్రారంభించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనుకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. ఈ ఏడాది రూ. 3 లక్షల 22 వేల కోట్లు బడ్జెట్ పెట్టామని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో అందరికీ అవమానాలే ఉండేవని.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌తో అన్ని సుసాధ్యాలేనని అన్నారు. నెల్లూరు-చెన్నై మధ్య ప్రైవేటు రంగంలో రోడ్డు వేశామని, ఫలితంగా దేశంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో పేదవారు లేకుండా కృషి చేస్తామని.. ఒకవేళ అదే జరిగితే తన జన్మ చరితార్థం అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.