తెలంగాణలో వరుసగా మూడవ రోజు వ్యాక్సిన్ బంద్..
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో వరుసగా మూడవ రోజు కోవిడ్ వ్యాక్సిన్ వేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర మానసిక ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు ? అసలు వేస్తారా ? లేదా అనే విషయాల్లో ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ సరఫరా ఎప్పుడు ఉంటుందనే విషయంలో స్పష్టత నిచ్చే అధికారులు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ అవసరం ఉన్న వారికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాక్సిన్ కొరత […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణలో వరుసగా మూడవ రోజు కోవిడ్ వ్యాక్సిన్ వేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర మానసిక ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు ? అసలు వేస్తారా ? లేదా అనే విషయాల్లో ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్
సరఫరా ఎప్పుడు ఉంటుందనే విషయంలో స్పష్టత నిచ్చే అధికారులు అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ అవసరం ఉన్న వారికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యాక్సిన్ కొరత కారణంగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు వ్యాక్సిన్ కేంద్రాలు మూసి ఉంటాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జీ. శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. దీంతో సోమవారం యథావిధిగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రజలు భావించారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల వద్దకు తెల్లవారుజామునుండే పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. గంటలు గడిచినా వ్యాక్సిన్ కేంద్రాలు తెరువక పోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
ప్రైవేట్‌లో కూడా నో వ్యాక్సిన్..
హైదరాబాద్‌లోని ప్రైవేట్ వ్యాక్సిన్ సెంటర్‌లలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోయింది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండడం, మరో వైపు వ్యాక్సిన్ దొరక్క పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మొదటి విడత వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండవ డోస్ వేసే గడువు సమీపించినా వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోవడంతో వారు కూడా ఆందోళన చెందుతున్నారు. మొదటి విడత వేసుకున్న వారిలో కొంత మందికి రెండవ విడత సోమవారం ఇవ్వడం జరుగుతుందని అధికారులు వారికి మెసేజ్‌లు పెట్టారు. దీంతో మెసేజ్ వచ్చిన వారు తమకు నిర్ధేశించిన సెంటర్లకు వెళ్లి నిరాశగా వెనుదిరిగారు. ఇక,18 నుండి 44 యేండ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికేనా..
తెలంగాణలో రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకా వేయాలని అధికారులు నిర్ణయించారు. సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు లేకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాక్సిన్ సెంటర్ల వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమికూడుతున్నారు. ఇలా వస్తున్న వారిలో పాజిటివ్
ఉన్న వారు ఎవరో, లేని వారు ఎవరో కూడా గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో పాజిటివ్ ఉన్న వారి నుండి లేని వారికి కరోనా సోకుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకుగాను ఇకముందు ఆన్‌లైన్ కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వారికి నిర్ధేశించిన సమయంలో వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇక వ్యాక్సిన్ సెంటర్ల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు .
మంత్రి తొలగింపు ప్రభావం పడిందా..?
ఇటీవల వరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ఆ శాఖ నుండి తొలగించిన ప్రభావం వైద్య ఆరోగ్యశాఖపై పడిందనే ప్రచారం ప్రజల్లో జోరుగా సాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ప్రతిరోజూ వేల్లలో కేసులు, అధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్న సమయంలో సంబంధిత శాఖ మంత్రిని తొలగించడం అనాలోచిత చర్య అని ప్రజలు మండిపడుతున్నారు.
దీనికితోడు వైద్య ఆరోగ్యశాఖను ఎవరికి కేటాయించకుండా సీఎం కేసీఆర్ తన దగ్గరే ఉంచుకోవడం, శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఇబ్బందుల వంటివి ఆయనతో అధికారులు సమీక్షించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శాఖలో నెలకొన్న సమస్యలతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు సరైన మార్గనిర్దేశం చేసే మంత్రి లేకపోవడంతో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక రానున్న రోజులలో కోవిడ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్.. డీహెచ్ శ్రీనివాసరావు
తెలంగాణలో రాబోయే రోజుల్లో కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకాలు వేయడం జరుగుతుంది. 18-44 సంవత్సరాలలోపు వారు కూడా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే వారికి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తామనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్రానికి
7.69 లక్షల కోవీషీల్డ్, 3.43 లక్షల కోవాక్జిన్ టీకాలు కేంద్రం నుండి రావలసి ఉంది. సోమవారం రాత్రి వరకు 4 లక్షల వ్యాక్సిన్ చేరుకోనుంది. ఇవి తెలంగాణకు చేరుకుంటే మంగళవారం నుండి వ్యాక్సిన్ సెంటర్లలో టీకాలు అందుబాటులోకి రానుండగా ముందుగా రెండవ విడత వేసుకునే వారికి వేయడం జరుగుతుంది. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకున్న 45 సంవత్సరాల లోపు వారికి వ్యాక్సిన్ వేస్తాం.