బడికి వెళ్లమంటున్న టీచర్లు
దిశ, న్యూస్ బ్యూరో: ఉపాధ్యాయులు పాఠశాలలకు పూర్తి సామర్థ్యంతో రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూళ్లకు రావడంతోపాటు ఇండ్లకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారు. డిజిటల్ తరగతుల మీద అవగాహన కలిగిస్తున్నారు. పిల్లల కోసం డ్యూటీ చేస్తున్నా టీచర్లలో కొవిడ్ భయాలు నెలకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సగం మంది ఉపాధ్యాయులనే పాఠశాలలకు అనుమతించాలని సూచించింది. తరగతిలో విద్యాబోధన చేయడం లేదు. స్టాప్ రూంలో ఉపాధ్యాయుల భౌతిక దూరం కూడా సమస్యగా మారనుంది. డిజిటల్ పాఠాలు వినే […]
దిశ, న్యూస్ బ్యూరో: ఉపాధ్యాయులు పాఠశాలలకు పూర్తి సామర్థ్యంతో రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూళ్లకు రావడంతోపాటు ఇండ్లకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారు. డిజిటల్ తరగతుల మీద అవగాహన కలిగిస్తున్నారు. పిల్లల కోసం డ్యూటీ చేస్తున్నా టీచర్లలో కొవిడ్ భయాలు నెలకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సగం మంది ఉపాధ్యాయులనే పాఠశాలలకు అనుమతించాలని సూచించింది. తరగతిలో విద్యాబోధన చేయడం లేదు. స్టాప్ రూంలో ఉపాధ్యాయుల భౌతిక దూరం కూడా సమస్యగా మారనుంది. డిజిటల్ పాఠాలు వినే విద్యార్థులను పర్య వేక్షించడం మాత్రమే చేయాల్సి ఉండటంతో 50% ఉపాధ్యాయులు సరిపోతారని చెబుతున్నారు. వయసు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపై కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో 50 ఏండ్లు దాటినవారిని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని, దివ్యాంగులను విధుల నుంచి మినహాయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వైద్య సిబ్బందికి ఇచ్చినట్లుగానే మాస్కులు, శానిటైజర్ల వంటి కొవిడ్ రక్షణ సామాగ్రి ఉపాధ్యాయులకు అందజేయాలంటున్నారు.
పారిశుధ్య సిబ్బంది కావాలి
పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలు గ్రామపంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీపీ సిబ్బందికి ఇది అదనపు బాధ్యతగా మారుతుందని అంటున్నాయి. రోజూ వారు అందుబాటులో ఉండకపోవచ్చు, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చనీ అంటున్నాయి. కొవిడ్ పరిస్థితుల్లో ప్రత్యేకంగా పరిశుభ్రతపై దృష్టి సారించాలి. జీపీ సిబ్బంది రోజంతా పాఠశాలలోనే ఉండటం సాధ్యపడదు. గతంలో పాఠశాలల్లో తరగతి గదులు, ఆవరణ ప్రతి రోజూ శుభ్రం చేయడంతోపాటు విద్యా ర్థులకు మంచినీటి సౌకర్యం కల్పించడం, మొక్కల సంరక్షణ వంటి విధులు నిర్వర్తించేందుకు పారిశుధ్య సిబ్బందిని నియమించుకునేవారు. వారిని కొనసాగించాలని కోరుతున్నారు.
వర్క్ షీట్లను ప్రభుత్వమే అందివ్వాలి: మైస శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అన్ని పాఠశాలలకు వర్క్షీట్లను ప్రభుత్వమే అందించాలి. వర్క్షీట్లను ఆన్లైన్ ద్వారా ప్రింట్ తీసి విద్యార్థులకు అందించే బాధ్యతను విద్యా శాఖ ఉపాధ్యాయులపై ఉంచింది. ప్రతీ విద్యార్థికి వీటిని జిరాక్స్ తీసి ఇవ్వాలంటే ఒక్క రోజుకే కనీసం రూ. మూడు వేలు ఖర్చవుతోందని అంచనా వేస్తున్నాం. ఉపాధ్యాయులపై అదనంగా ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే వర్క్షీట్లను అందివ్వాలి. కొవిడ్ నియంత్రణకు పరిశుభ్రత ఎక్కువగా పాటించాల్సిన అవసరముంది. జీపీ సిబ్బందిని కాకుండా గతంలో మాదిరిగా స్కూల్ సర్వెంట్స్ను నియమించాలి.
కేంద్ర నిబంధనలు అమలు చేయాలి: కె.మహిపాల్ రెడ్డి, ఎస్జీటీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సెప్టెంబర్ 30 వరకూ పాఠశాలలు తెరవద్దని కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్-4 నిబంధనలు విడుదల చేసింది. ఆ తరువాత కూడా 50% మంది ఉపాధ్యాయులే పాఠశాలకు హాజరు కావాలని కేంద్ర ఆదేశాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇందుకు విరుద్ధంగా ఉంది. కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి కేంద్ర నిబంధనలను అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. తీవ్ర అనారోగ్య సమస్యలు, వయసు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించాలి. పిల్లలను, తల్లిదండ్రులను కలిసినపుడు వైరస్ సోకే ప్రమాదముంది. ఉపాధ్యాయులందరికీ కొవిడ్ రక్షణ సామాగ్రిని ప్రభుత్వమే అందించాలి.