లోటస్‌ పాండ్‌కు తాళం.. ట్విట్టర్‌కే పరిమితమైన షర్మిల

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల పార్టీపై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన నాటి నుంచి దూకుడు పెంచిన షర్మిలకు కరోనా రూపంలో చుక్కెదురైంది. దీంతో లోటస్ పాండ్ కు తాళం పడింది. అప్పటివరకు ఆయా జిల్లాల నేతలు, అభిమానులు, నాయకులతో వరుస ఆత్మీయ సమ్మేళనాలతో కళకళలాడిన లోటస్ పాండ్ నేడు వెలవెలబోయింది. కార్యాలయం నుంచి ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో నాయకులంతా అయోమయంలో పడ్డారు. […]

Update: 2021-05-15 13:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల పార్టీపై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన నాటి నుంచి దూకుడు పెంచిన షర్మిలకు కరోనా రూపంలో చుక్కెదురైంది. దీంతో లోటస్ పాండ్ కు తాళం పడింది. అప్పటివరకు ఆయా జిల్లాల నేతలు, అభిమానులు, నాయకులతో వరుస ఆత్మీయ సమ్మేళనాలతో కళకళలాడిన లోటస్ పాండ్ నేడు వెలవెలబోయింది. కార్యాలయం నుంచి ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో నాయకులంతా అయోమయంలో పడ్డారు. ఇదిలాఉండగా కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఆమె చేపడుతున్న పోరు ట్విట్టర్‌కే పరిమితమైంది.

లోటస్ పాండ్‌కు తాళం..

రాష్ట్రంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో లోటస్ పాండ్‌కు తాళం వేశారు. అయితే అంతకుముందు వరకు ఆమెను కలిసేందుకు లోటస్ పాండ్‌కు వచ్చిన నాయకులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం, కనీసం మాస్క్ కూడా వేసుకోకపోవడంతో షర్మిల టీంలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందులో ప్రతిరోజూ ఆమె వెన్నంటి ఉండే ముఖ్య అనుచరులకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చేసేదేం లేక లోటస్ పాండ్‌కు తాళం వేయాలని షర్మిల నిర్ణయించారు. ఇదిలాఉండగా ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభ, ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఉద్యోగ దీక్షలోనూ షర్మిల మాస్క్ వేసుకోకపోవడంతో విమర్శలపాలైన విషయం తెలిసిందే.

అంతా సైలెన్స్..

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఏప్రిల్ 15న షర్మిల మూడు రోజుల పాటు ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం జిల్లాల వారీగా నిర్వహించాల్సిన ర్యాలీలు కూడా దీక్షలకు కూడా బ్రేక్ పడింది. అయితే, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో అందరూ అయోమయంలో పడ్డారు. ఎలాంటి కార్యకలాపాలు కొనసాగకపోవడంతో జూలై 8న పార్టీ ఏర్పాటు జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో నాయకులు ఉన్నారు. తదుపరి కార్యాచరణపై ఏ నాయకుడిని అడిగినా తమకు కూడా ఎలాంటి సమాచారం లేదనే సమాధానం లభిస్తోంది.

ప్రభుత్వంపై పోరు ట్విట్టర్‌కే పరిమితం..

రాష్ట్రంలో కరోనా విపత్కర సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు షర్మిల చేపడుతున్న పోరు ట్విట్టర్‌కే పరిమితమైంది. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని ట్విట్టర్ వేదికగా ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ విషయంలోనూ షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న తన అన్న జగన్ రాజ్యంలోనూ పరిస్థితి అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఏపీలో కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చినా అక్కడి నుంచి జనం వైద్యం కోసం హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నట్లో సమాధానం చెప్పాలంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

నేతల్లో అసంతృప్తి..

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు షర్మిలకు ఇదే సరైన సమయమని షర్మిల టీమ్ కు చెందిన పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి వచ్చి అండగా నిలిచి భరోసా కల్పించాల్సిన సమయంలో ఇలా ట్విట్టర్ కే పరిమితం కావడంపై వారు కొంత అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. జాగ్రత్తలు పాటిస్తూ ఆస్పత్రుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, ఇంకా ఎలాంటి వసతులు కల్పించాల్సి ఉందనే విషయాలను తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా పట్టించుకోకపోవడం తమకు కలిసొచ్చే అంశమని వారు చెబుతున్నారు.

‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ నుంచి నో రెస్సాన్స్..

కొవిడ్ కారణంగా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు షర్మిల ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు ఒక టోల్ ఫ్రీ నంబర్ 040-48213268 ను కూడా ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు కాల్ చేస్తే తమ టీం మెంబర్ నుంచి తిరిగి కాల్ వస్తుందనే వాయిస్ మినహా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News