WW2 తర్వాత పెద్ద పరీక్ష.. కరోనా : యూఎన్
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి విజృంభనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనం ఎదుర్కొంటున్న పెద్ద పరీక్ష కోవిడ్ 19 అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. దీని పర్యవసానంగా సమీప గతంలో మనం చూడనంత తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని హెచ్చరించారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. కరోనా మహమ్మారి […]
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి విజృంభనపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనం ఎదుర్కొంటున్న పెద్ద పరీక్ష కోవిడ్ 19 అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. దీని పర్యవసానంగా సమీప గతంలో మనం చూడనంత తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని హెచ్చరించారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు.
కరోనా మహమ్మారి వైపరీత్యాలపై రూపొందించిన ఓ రిపోర్టును న్యూయార్క్ లోని యూఎన్ హెడ్ క్వార్టర్స్ లో విడుదల చేస్తూ సెక్రటరీ జనరల్ గుటెరస్ మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించినప్పటి నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద పరీక్ష ఈ కరోనా మహమ్మారి అని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత (75 ఏళ్ల క్రితం) ఐక్యరాజ్యసమితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ వైరస్ రూపుమాపేందుకు ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు.. వెనుకబడిన దేశాలకు సహకరించాలని సూచించారు. విస్తృత కరోనా పరీక్షలు, ట్రీట్మెంట్, క్వారంటైన్ లాంటి చర్యలు సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) సూచించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కోవిడ్ 19పై పోరాటంలో ప్రపంచ దేశాలు చాలా వెనుకబడి ఉన్నాయని అన్నారు. ప్రపంచ జీడీపీలో 10% ఈ మహమ్మారి పై పోరాటానికి కేటాయించాలని సూచించారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని యూఎన్ రిపోర్టు వెల్లడించింది. అలాగే, 40 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంపై దీని ఒత్తిడి ఉంటుందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది కరోనా బారిన పడ్డారు. కనీసం 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీ, స్పెయిన్, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలూ వైరస్ దాటికి గజగజ వణికిపోతున్నాయి. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య చైనాను దాటిపోయింది. ఆ దేశంలో సుమారు 1.9 లక్షల మందికి కరోనా సోకింది. అక్కడ 24 గంటల వ్యవధిలోనే 865 మంది కన్నుమూశారు. కరోనా మహమ్మారి కట్టడిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. ఇటువంటి బీభత్స వాతావరణంలో ఐక్యరాజ్యసమితి ఈ హెచ్చరికలు చేసింది.
Tags: Coronavirus, UN, antonio guterres, contain, co ordination, WW2, biggest, test