విజృంభిస్తున్న కరోనా.. కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్
దేశంలో మరోసారి కరోనా కోరలు చాచుతోంది. ఒక్కసారిగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మరోసారి కరోనా కోరలు చాచుతోంది. ఒక్కసారిగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మహ్మారిని అరికట్టేందుకు చర్యలకు పూనుకుంది. గడిచిన 24 గంటలలో 1,590 మందికి వైరస్ సోకగా ఆరుగురు ప్రాణాలు విడిచారు. గడిచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే తొలిసారి కావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కేసుల నమోదు భారీగా ఉంది. దీంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది.
ఇప్పటికే కరోనా వైరస్ పై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించగా తాజాగా ఎల్లుండి రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. కోవిడ్-19, సీజనల్ ఇన్ ఫ్లూఎంజా కేసుల నేఫథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధత పై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 11 తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని భావిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్ లో మాక్ డ్రిల్ తేదీలపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.