ఈ కరోనా వార్డు నర్సు ఆత్మఘోష అరణ్యరోదనేనా..?
తాను కన్నవారికి, తనను కన్నవారికి దూరమై తనకు తెలియనివారికి దగ్గరైందామె.. తన కన్నీళ్లు దిగమింగుకుంటూ ఇతరుల కన్నీళ్లు తుడుస్తోందామె.. సమాజం చిన్నచూపు చూస్తున్నా, వారిపై చల్లనిచూపు చూపిస్తోందామె.. ఐసొలేషన్‌లో ఉన్నవారికి తాను ఇన్సులేషన్ అయి రక్షణగా నిలబడిందామె.. నిత్యం వారి చెంతనే ఉండగలుగుతోంది కానీ, తనవారికి చేరువ కాలేకపోతోంది. తన పిల్లల్ని ముట్టుకోలేదు, ముద్దుపెట్టుకోలేదు.. ఆమె ఎవరో కాదు నర్సు. వైద్యసేవకే ఆమె ఆత్మ. కరోనా పాజిటివ్ రోగులకు ఆమె అమ్మ. కనిపించని కరోనాపై కసి తీరా […]
తాను కన్నవారికి, తనను కన్నవారికి దూరమై తనకు తెలియనివారికి దగ్గరైందామె.. తన కన్నీళ్లు దిగమింగుకుంటూ ఇతరుల కన్నీళ్లు తుడుస్తోందామె.. సమాజం చిన్నచూపు చూస్తున్నా, వారిపై చల్లనిచూపు చూపిస్తోందామె.. ఐసొలేషన్‌లో ఉన్నవారికి తాను ఇన్సులేషన్ అయి రక్షణగా నిలబడిందామె.. నిత్యం వారి చెంతనే ఉండగలుగుతోంది కానీ, తనవారికి చేరువ కాలేకపోతోంది. తన పిల్లల్ని ముట్టుకోలేదు, ముద్దుపెట్టుకోలేదు.. ఆమె ఎవరో కాదు నర్సు. వైద్యసేవకే ఆమె ఆత్మ. కరోనా పాజిటివ్ రోగులకు ఆమె అమ్మ. కనిపించని కరోనాపై కసి తీరా యుద్ధం చేస్తోంది. కాకపోతే కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా! యుద్ధం చేయడానికి సదా సిద్ధమే.. కానీ సరైన మాస్కులు, గ్లౌజులు, డ్రెస్సులు తనకు అందడంలేవనేదే ఆమె దిగులు. అందుకే ఆ ఆత్మ ఘోషిస్తోంది. ఆ అమ్మ ఆవేదన అరణ్య రోదనైంది. ఆ ఆత్మఘోషను, అరణ్యరోదనను పాఠకులకు అందించే ప్రయత్నం చేసింది‘దిశ’. హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్న ఓ నర్సు అనుభవాలను మీ ముందుంచుతోంది.
– దిశ, న్యూస్ బ్యూరో
డ్యూటీ ఎలా స్టార్ట్ అవుతుందంటే..
పగటి డ్యూటీ ఆరు గంటలు. కానీ ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటుంది. నైట్ డ్యూటీ పన్నెండు గంటలు. ఇంటి గడప దాటేటప్పుడే భయంతో అడుగులు పడతాయి. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని వైరస్ దగ్గరకు పోతున్నాననే ఫీలింగ్. ఆసుపత్రి గేటు దగ్గరికి వెళ్ళగానే వెళ్ళకూడని ‘ప్రదేశానికి వెళ్తున్నాను’ అని అనుకుంటాను. వార్డు దగ్గరకు వెళ్లగానే మొదట శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటా. కరోనా కోసం మాత్రమే వాడే పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) దుస్తులు వేసుకుంటాను. ముఖానికి ఎన్-95 మాస్కు, కళ్ళకు గాగుల్స్, చేతులకు గ్లవుజులు, కాళ్ళకు ప్రత్యేక తరహా స్లిప్పర్లు వేసుకుంటాను. ఎక్కడా మన దేహం వైరస్ బారిన పడకుండా మొత్తం కవర్ చేసుకుంటా. అక్కడితో నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది.
వార్డుల్లో పేషెంట్లకు సేవలెలా..
డ్యూటీ ఎక్కగానే వార్డులో ఎంత మంది పేషెంట్లు ఉన్నారో చూస్తాను. అప్పటివరకూ ఉన్న షిప్టులోని నర్సులు ఇచ్చిన ట్రీట్‌మెంట్ గురించి కేస్ షీట్ చూసి తెలుసుకుంటా. ఇంకా ఏం ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చూస్తా. కొత్తగా వచ్చి చేరిన పేషెంట్ల ఆరోగ్యస్థితి ఎలా ఉందో కనుక్కుంటా. వారికి ఇవ్వాల్సిన మెడికేషన్ గురించి ఆలోచిస్తా. జనరల్ ఫిజీషియన్ లేదా పల్మనాలజిస్టు లేదా అనెస్థటిస్టు లాంటివారు వచ్చి పేషెంట్లను చూసి పోతూ ఉంటారు. వారు ఇచ్చే సూచనల ప్రకారం నర్సులుగా మేమే పేషెంట్ల దగ్గరకు వెళ్ళి సమయానికి అన్నీ చూసుకుంటాం. పేషెంట్ల దగ్గరకు వెళ్ళినప్పుడు కొద్దిమంది దగ్గుతారు, మరికొంత మంది తుమ్ముతారు. అప్పుడు వారి మాస్కు సరిగ్గా ఉందో లేదోననే ఆలోచన వస్తుంది. కళ్ళ గాగుల్స్ సరిగ్గా ఉన్నాయో లేవోననే అనుమానం వస్తుంది. పేషెంట్ నుంచి తుంపరలు డ్రస్ మీద పడ్డాయేమోనని చూసుకుంటాం. వణికిపోతాం. కానీ తప్పదు.
పారిపోడానికి బదులు దగ్గరగా ఉంటున్నారు గదా!
ఈ వృత్తిని నేను ఉద్యోగంగా భావించలేదు. రోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్నాను. దాదాపు పాతికేళ్ళ సర్వీసులో హెచ్ఐవీ పేషెంట్లను చూశాను. స్వైన్ ఫ్లూ పేషెంట్లకు సేవ చేశాను. ఓపీలో రకరకాల వ్యాధులున్న రోగుల్ని చూశాను. వార్డుల్లో అత్యవసర కేసుల్నీ దగ్గరుండి సేవలందించాను. కానీ ఎప్పుడూ భయపడలేదు. జీవితంలో, వృత్తిలో తొలిసారిగా భయం అంటే ఏంటో స్వయంగా అనుభవిస్తున్నాను. రోజూ నరకానికి వెళ్లివస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. నర్సింగ్ వృత్తిలోకి ఎందుకొచ్చానా అని మొట్టమొదటిసారి నాలో ఆలోచన వచ్చింది. భవిష్యత్తు ఏమవుతుందోననే భయం ఇప్పుడు ఏర్పడింది.
ఎందుకంతటి భయం?
ఇప్పటిదాకా కరోనా గురించి మనకు తెలియదు. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా అది చేస్తున్న విధ్వంసాన్ని చూస్తున్నాం, వింటున్నాం. ఈ క్షణానికి నేను ఆ వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండి వైద్యం చేయాల్సి వస్తోంది. అయితే ఇక్కడొకటి చెప్పుకోవాలి. నిజంగా యుద్ధానికి వెళ్ళే ముందు అన్నింటినీ మనం సిద్ధం చేసుకుంటాం. కరోనా వైరస్‌తో యుద్ధం ఒక నర్సుగా నేను కూడా అంతే సిద్ధంగా ఉండాలి. మానసికంగా ఓకే. కానీ, రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే నా భయానికి కారణం. డ్యూటీ ఎక్కినప్పుడు పీపీఈ డ్రెస్ వేసుకుంటే డ్యూటీ దిగే వరకూ దానితోనే ఉండాలి. ఒక్కసారి విప్పితే మళ్ళీ దాని వేసుకోడానికి కుదరదు. కొత్తది వేసుకోవాల్సిందే. కానీ, తగినంత సంఖ్యలో పీపీఈ కిట్లు లేవు కాబట్టి చాలా పొదుపుగా వాడుకోవాల్సి వస్తోంది. అందుకే నైట్ డ్యూటీ పన్నెండు గంటలైనా రాత్రి ఎనిమిది గంటలకు డ్యూటీ ఎక్కితే పొద్దునే ఎనిమిది గంటల దాకా చుక్క నీరు తాగలేం. ఆకలైనా తినలేం. ముఖానికి దురద పెడితే గోక్కోలేం. కండ్లలో ఏదైనా పడిందనిపిస్తే నలుపుకోలేం. మూత్రం వస్తే వాష్‌రూమ్‌కు వెళ్ళి ఆ అవసరం తీర్చుకోలేం. బిగపట్టుకుని సర్దుకుపోవాల్సిందే. జలుబు చేసిందనిపిస్తే కర్చీఫ్‌తో తుడుచుకోలేం. అన్నింటికీ చేతులు కట్టేసినట్లే.
పీపీఈ కిట్ల లభ్యత ఎలా ఉంది?
నిజానికి కరోనా వార్డుల్లో, ఐసొలేషన్ వార్డుల్లో పనిచేసే నర్సులకు పీపీఈలు తప్పనిసరి. కానీ, మా అవసరాలకు తగినంత సంఖ్యలో లేవు. అందుకే పొదుపుగా వాడుకుంటున్నాం. రోజూ ఎన్ని పీపీఈ కిట్ల కోసం ఇండెంట్ పెట్టారు, ఎన్ని వచ్చాయి, ఎవరెవరికి ఇచ్చారు… ఇలాంటి వాటన్నింటికీ లెక్కలుంటాయి. రోజుకు ఇండెంట్‌ను బట్టి 50 వరకూ వస్తున్నాయి. డ్యూటీ మధ్యలో పీపీఈ డ్రెస్ విప్పేసి అన్నం తిని మళ్ళీ కొత్తది వేసుకోవడం సమస్య కాదు. కానీ, చాలా పరిమిత సంఖ్యలో ఉండడంతో ఒక్క డ్యూటీలోనే రెండు వాడేస్తే తర్వాతి షిప్టునకు వచ్చే నర్సులకు ఉండవేమోననే బాధ. నిజానికి తగినంత సంఖ్యలో పీపీఈ కిట్లు ఉంటే ఈ పొదుపు అవసరం ఉండేది. కాదు. ఈ పొదుపు నాకు ఒక్కదానికే కాదు. నర్సులంతా పాటిస్తున్నారు. అందుకే వారంతా ఎన్ని గంటల డ్యూటీ అయినా ఒక్క పీపీఈ డ్రెస్‌తోనే సరిపెట్టుకుంటున్నారు.
పీపీఈ కిట్లకు కొరత లేదని ప్రభుత్వం చెప్తోంది గదా!
ప్రభుత్వం చెప్పే లెక్కలేంటో నాకు తెలియదు. కానీ, మాకు మాత్రం సరిపోయినన్ని రావడంలేదు. నేను పనిచేసే వార్డులో షిప్టునకు పదిమంది ఉంటారు. ఇందులోనే వార్డ్ స్టాఫ్, ఇంటెర్నీలు, ఆయాలు, నర్సులు.. అందరూ ఉంటారు. ఇక పల్మనాలజిస్టు, జనరల్ ఫిజీషియన్, అనెస్థటిస్టులు వస్తుంటారు, పోతుంటారు. షిప్టునకు నాలుగు పీపీఈ కిట్లు ఇస్తారు. పది మంది వేసుకోలేరు. అందుకే ఇద్దరు నర్సులు మాత్రమే వేసుకుని మిగిలినవారు ప్లాస్టిక్ డ్రెస్సులు వేసుకుంటారు. వార్డు లోపలకి వెళ్ళేవారు పీపీఈ డ్రెస్‌లతో వెళ్తే ప్లాస్టిక్ డ్రెస్ వేసుకున్న నర్సులు పేపర్ వర్క్, మెడిసిన్ లాంటి పనులు చూసుకుంటారు. షిప్టులో ఉండే నర్సులం మాలో మేము మాట్లాడుకుని మొత్తం ఎనిమిది గంటల షిప్టు డ్యూటీలో తలా మూడు గంటల డ్యూటీ వేసుకుని సర్దుబాటు చేసుకుంటున్నాం. ఇక ఆయాల సంగతి చాలా దయనీయం. కనీసం వారికి రెస్ట్ రూమ్ కూడా లేదు. డ్రెస్ ఎక్కడ మార్చుకోవాలి. మాస్కులు, పీపీఈలు, గ్లవుజులు అంతంతమాత్రమే. రెండు రోజుల క్రితం ఒక పల్మనాలిజిస్టు వార్డులోకి వెళ్ళాల్సి వస్తే ఎన్ 95 మాస్కు అడిగారు. కానీ, స్టాకు లేకపోవడంతో మామూలు మాస్కు వేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రత తెలుసు కాబట్టే మమ్మల్ని కూడా ఏమీ అనలేకపోయారు.
మరి ఉన్నతాధికారులకు తెలియదా?
ఎందుకు తెలియదు. అన్నీ తెలుసు. ఎన్ని కావాలో తెలుసు. ఎన్ని వస్తున్నాయో తెలుసు. రోజుకు ఎన్ని వాడుతున్నారో కూడా లెక్కలున్నాయి. కానీ, వాటిని ప్రభుత్వం దగ్గరి నుంచి తెప్పించుకోవడంలో నిర్లక్ష్యం. ఈ వ్యవహారాలన్నీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు చూసుకునేవారు పరిశీలించాలి. వార్డుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. కానీ, వారు వార్డుల్లోకి రారు. నర్సింగ్ సూపరింటెండెంట్ కూడా లోపలికి వచ్చి చూసుకోవడం అంతంతమాత్రమే. ఆమెకుండే బాధలు ఆమెకున్నాయి. నిజానికి కరోనా పేషెంట్లకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి తగిన పీపీఈలు, ఇతర రక్షణ ఏర్పాట్లు ఉంటే ఇన్ని బాధలు, భయాలు ఉండేవికావు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మంత్రులు, అధికారులు చెప్పే మాటల్ని టీవీల్లో చూస్తున్నప్పుడు ముక్కున వేలేసుకుంటున్నాం. కనీసం అప్పుడప్పుడు డీఎంఈ లాంటి ఉన్నతాధికారులు కూడా వస్తుంటారు. వారికే నేరుగా చెప్పుకున్నా కూడా ‘ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు కాదులే… చూస్తాం’ అంటూ వదిలేస్తున్నారు. ఇక ఎవరికి చెప్పుకోవాలి మా బాధల్ని? ఇంత రిస్కు తీసుకుని పనిచేస్తున్నా పై అధికారులకు కనీస గౌరవం లేదు. గుర్తింపు అసలే లేదు. ప్రతీ వార్డులో పీపీఈలు, మాస్కుల లెక్క బైటకు తీస్తే వాస్తవిక పరిస్థితులు, ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది.
వార్డులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
పీపీఈ కిట్ల సంగతే ఇలా ఉంటే ఇతర సౌకర్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డ్యూటీ దిగిన తర్వాత ఆ పీపీఈ డ్రెస్‌ను విప్పేయాల్సిందే. అది డిస్పోజబుల్ కాబట్టి దాన్ని డస్ట్ బిన్‌లో పడేయక తప్పదు. కానీ, ఒకేసారి పది మంది షిప్టు దిగిన తర్వాత వాటిని పడేయాలంటే కనీసం డస్ట్ బిన్‌లు కూడా లేవు. చిన్న బిన్‌లు ఉన్నాయిగానీ ఒక్కటి వేయగానే నిండిపోతుంది. కనీసం ఈ డ్రెస్‌ల కోసమైనా ఒక పెద్ద బిన్ పెట్టలేదు. దీంతో అవన్నీ బిన్‌లో పట్టక కుప్పలాగా పోగేయాల్సి వస్తోంది. వీటికి అంటుకున్న వైరస్ ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. మధ్యలో కొత్త పేషెంట్ వస్తే చూడడానికి, ఇన్‌క్యుబేషన్ అవసరాల కోసం ఒక కొత్త డ్రెస్ వాడాల్సి వస్తోంది. అది విప్పిన తర్వాత పడేయడానికి కూడా దారి లేదు. ఇక పేషెంట్ల బెడ్‌లకు ప్రతీరోజు బెడ్‌షీట్స్ మార్చాలి. వాటిని ఉతికేయడానికి దోబీఘాట్‌లో ఏ మేరకు శుభ్రత ఉందో మాకు అనుమానమే.
కొత్త నర్సుల్లో ట్రామా ఎలా ఉంది?
మా ఆసుపత్రిలో దాదాపు 350 మంది నర్సులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 200 మంది కాంట్రాక్టు నర్సులే. వారికి ఫిబ్రవరి నెల జీతం మార్చి 31న పడింది. మార్చి జీతం ఇప్పట్లో పడేలాలేదు. అడిగితే కాంట్రాక్టరు నుంచి చాలా దురుసుగా సమాధానం వస్తుంది. ‘ఉంటే ఉండు.. పోతే పో…’ అనే సమాధానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కేవలం ఉద్యోగ భద్రత కోసం నోరు మూసుకుని ఉంటున్నారు. కరోనా భయం వాళ్ళలో చాలా ఎక్కువ. రెండు రోజుల క్రితం తీవ్రంగా దగ్గు రావడంతో కారణం వైరస్ అయి ఉండొచ్చన్న అనుమానంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళాను. అక్కడ ఉండడానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో మళ్ళీ మేం పనిచేసే ఆసుపత్రికే తీసుకొచ్చాం. ఒక రోజు తర్వాత కోలుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నర్సులైతే లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులు అలా లీవ్ పెట్టే పరిస్థితులు లేవు. అందుకే చాలా భయంతోనే పనిచేస్తున్నారు.
అవగాహన కల్పించామని అధికారులు అంటున్నారు గదా!
ఆ అవగాహనే కల్పిస్తే జనతా కర్ఫ్యూ రోజున మేమంతా ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే అవసరమే వచ్చేది కాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులకు పూర్తి అవగాహన కల్పించి మానసికంగా సిద్ధం చేస్తారు. మోటివేషన్ కల్పిస్తారు. ఓరియంటేషన్ ఇస్తారు. కానీ, మాకు ఇప్పటిదాకా అలాంటిది లేదు. మాలో మానసిక స్థయిర్యాన్ని పెంచే ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. వార్డుల్లో పనిచేస్తున్న నర్సుల గురించి అధికారులకు అస్సలే పట్టదు. రోజువారీ సమస్యల గురించి ఎంతోకొంత పట్టించుకున్నా మాకు భరోసా కలిగేది. అందుకే ఎవరి కోసం డ్యూటీ చేస్తున్నామో అర్థం కావడంలేదు. ఇంత రిస్కు తీసుకుని ఎందుకోసం పనిచేస్తున్నామో అని అనుకుంటుంటాం. పీపీఈలు, మాస్కులు లేకుండా పనిచేయడం సాధ్యమేనా? సరిహద్దుల్లో యుద్ధం చేసే సైనికుల విషయంలో ఇలా ఉంటుందా? కరోనా విషయంలో ఎలా వ్యవహరించాలో ఇప్పటికీ శిక్షణ ఇవ్వలేదు. డాక్టర్లు డ్యూటీ చేస్తే నాలుగైదు రోజులు ఆఫ్ లేదా ఇతర చోట్ల పనిచేసే వెసులుబాటు ఉంది. కానీ, నర్సులుగా మేం మాత్రం కంటిన్యూగా అదే వార్డుల్లో డ్యూటీలు చేయాల్సివస్తోంది. రెస్టు లేకుండా చేస్తున్నాం. నేను 22వ తేదీ నుంచి కనీసం వీకాఫ్, రెస్టు లేకుండా పనిచేస్తున్నా.
మిగిలిన నర్సుల సంగతి?
కాంట్రాక్టు నర్సుల పరిస్థితి చాలా ఘోరం. ఒక గర్భిణీ నర్సు తొమ్మిదో నెల వచ్చింది. లీవ్ అడిగితే శాంక్షన్ కాలేదు. భర్తేమో డ్యూటీకి వద్దంటున్నాడు. ఇక్కడేమో లీవ్ దొరకట్లేదు. నర్సింగ్ సూపరింటెండెంట్‌కు చెప్తే ‘పేషెంట్ల దగ్గరికి వెళ్ళే పనికాకుండా రైటింగ్ వర్క్ చూసుకో… లీవ్ కుదరదు’ లేదా మీ కాంట్రాక్టర్‌ను అడగండి. నేనైతే లీవ్ ఇవ్వలేను’ అని ముఖం మీదనే చెప్పేసింది. వార్డు లోపలికి వెళ్ళినా, బయట ఉన్నా వైరస్ నుంచి తప్పించుకోగలుగుతుందా? ఏ ఆసుపత్రిలో కూడా నర్సులకు ఇంత స్ట్రెస్ ఉండదు. ఈ ఆసుపత్రిలో పనిచేయడమే ఒక శాపంగా ఉన్నట్లుంది. నిజానికి నర్సుల కష్టసుఖాలను అర్థం చేసుకుని నర్సింగ్ సూపరింటెండెంట్ వ్యవహరించాల్సి ఉంటుంది. మా తరఫున మాట్లాడాల్సిన ఆమె పట్టించుకోకుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? మెడికల్ ఎమర్జెన్సీలో నర్సుల పాత్ర తెలియంది కాదు. కానీ, ఇట్లా వ్యవహరిస్తే పనులు జరుగుతాయా? ఆస్తమాతో ఇబ్బంది పడే నర్సులు కూడా కరోనా డ్యూటీలు చేయాల్సి వస్తోంది. ఇలాంటివారిని డ్యూటీ నుంచి మినహాయించవచ్చుగదా! కానీ అవేవీ ఈ ఆసుపత్రిలో వర్కవుట్ కావడంలేదు. మా సమస్యల గురించి మాట్లాడడానికే భయమేస్తోంది. ఎవ్వరికీ ఏ విషయం చెప్పొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తాయి. ఏం చేయాలి?
ఎవరితో మా బాధలు చెప్పుకోవాలి? నర్సుల్ని ఇన్‌వాల్వ్ చేయకుండా పాలసీ మేకర్స్ ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు చేస్తుంటారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారులు వార్డుల వంక చూడరు. సమస్యల్ని పట్టించుకోరు, తెలుసుకోరు. మా సేవా దృక్పథం మాత్రం ఎంతకాలం ఇలా ఉంటుంది? దానికీ ఓ హద్దు ఉంటుంది గదా! ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తిగత రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ అడిగితే ఇదేనా ప్రభుత్వం నుంచి మాకు లభించేది? కనీసం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా లేకుంటే ఎట్లా?
మీకే వైరస్ సోకితే ఎట్లా? జాగ్రత్తలేం తీసుకుంటున్నారు?
దేవుడి దయ వల్ల ఇప్పటివరకూ మా ఆసుపత్రిలో నర్సులకు, డాక్టర్లకు పాజిటివ్‌గానీ, ఇన్‌ఫెక్షన్‌గానీ రాలేదు. డ్యూటీలో ఎక్కడలేని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తినం, తాగం, మూత్రానికి పోం. డ్యూటీ దిగగానే ఆ డ్రెస్ విప్పేసి సివిల్ డ్రస్ వేసుకుని ఇళ్ళకు వెళ్ళిపోతాను. ఇంటి గేటు దగ్గరే బకెట్‌లో డెట్టాల్ లేదా హైపోక్లోరైట్‌ను కలిపిన నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కుంటా. శానిటైజర్‌తో మరో రౌండ్. వెనక ద్వారం నుంచి నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్ళిపోతా. అక్కడ బట్టల్ని హైపోక్లోరైట్ నీళ్ళలో నానబెట్టేస్తా. డెట్టాల్‌తో శుభ్రంగా స్నానం చేసి దాదాపు క్వారంటైన్ లాంటి గదిలోకి వెళ్ళిపోతా. అక్కడే నాలుగు ముద్దలు తిని మళ్ళీ రేపటి డ్యూటీ కోసం ప్లాన్ వేసుకుంటా. నిజానికి ఐదు రోజులు లేదా వారం రోజుల డ్యూటీ వేసి మరో ఐదు రోజులు ఇక్కడే క్వారంటైన్‌లో ఉండేలా ప్లాన్ చేయాలని లెటర్ పెట్టాం. కానీ, అది ఎక్కడికి పోయిందో తెలియదు. రోజూ ఇంటి నుంచి వస్తున్నాం, మళ్ళీ ఇంటికే పోతున్నాం. మా స్వంత జాగ్రత్తలు తీసుకోవడమేగానీ ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ఏర్పాట్లు లేవు. పట్టుబట్టిన తర్వాత మొన్నీమధ్య బస్సు ఏర్పాటైంది. అది కూడా ఒకే బస్సులో 84 మంది ప్రయాణించాల్సివచ్చింది. సోషల్ డిస్టెన్స్ గురించి అడిగితే రెండో బస్సు ఏర్పాటైంది. మాకు ఇన్‌ఫెక్షన్ సోకిందో లేదో తెలుసుకునే పరీక్షలు లేవు. మా ఆరోగ్యం కోసం చర్యలు లేవు. లంచ్ తినడానికి పీపీఈలతో ఉన్నచిక్కుల కారణంగా చాలామంది నర్సులు లంచ్ బాక్సులు తెచ్చుకోవడమే మానేశారు. ఇళ్ళకు వెళ్ళిన తర్వాత ఒకరి బాధలు మరొకరితో పంచుకోడానికి మొబైల్ ఫోన్‌లోనే సరిపోతుంది మా జీవితం. కనీసం నాకు స్వంత ఇల్లు కాబట్టి ఇరుగుపొరుగువారితో సూటిపోటి మాటలు, కామెంట్లు లేవు. కానీ చాలా మంది నర్సులకు కరోనా పేషెంట్ల దగ్గరకు వెళ్ళి వస్తోంది.. ఎంతమందికి అంటిస్తుందో.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటోంది?
ఒక్కో నర్సుకు ఒక్కో రకంగా ఉంటుంది. నా భర్త కూడా లీవ్ పెట్టేయొచ్చుగదా అని అడుగుతుంటాడు. కానీ, నర్సు వృత్తిని ఎంచుకున్నది ఇందుకోసమేనా… ప్రభుత్వం లాగే నేను కూడా తప్పించుకుంటే ఇక అర్థమేముంది.. అంటూ పాఠాలు చెప్తూ డ్యూటీకే మొగ్గు చూపాను. ఒకప్పుడు నర్సుకు చాలా గౌరవం, గుర్తింపు ఉండేది. ఇప్పుడు పురుగుకన్నా హీనమైపోయింది బతుకు. మేం ఇన్సెంటివ్ కోరుకోవడంలేదు. అవార్డులు, రివార్డులను కోరుకోవడం లేదు. చివరకు గుర్తింపు కూడా వద్దు. మాకు పీపీఈలు, మాస్కులు ఇస్తే చాలు. మాకు యాభై లక్షల రూపాయల బీమా ఉందంటూ చాలా మంది ఏడుస్తున్నారు. బతికున్నప్పుడు రక్షణకు దిక్కులేదుగానీ చచ్చిపోయిన తర్వాత యాభై లక్షలు ఇస్తారంట! ఎందుకోసమండీ ఆ యాభై లక్షలు. అందుకే చాలామంది నర్సులకు కుటుంబసభ్యుల నుంచి పని మానేయాలని ఒత్తిడి ఉంటోంది. కానీ, నెట్టుకొస్తున్నారు.
ఈ సేవాగుణం వెలకట్టలేనిదే గదా!
ఇంతకాలం చేసిన పనికీ ఇప్పుడు కరోనా వార్డుల్లో చేస్తున్న పనికీ చాలా తేడా ఉంది. మామూలుగానైతే ఎంతోమందికి వైద్యసేవలు ఇచ్చిన తర్వాత వారు డిశ్చార్జి అయ్యేటప్పుడు వారి ఫీలింగ్స్ చూస్తుంటే మాకే చాలా సంతోషమనిపించేది. ఇప్పుడు కరోనా లాంటి కీలక సమయంలో ఇంత రిస్కుతో సేవ చేస్తున్నా అలాంటి ఫీలింగ్ రావడంలేదు. ఏదో సాధించామనే ఆత్మసంతృప్తి కూడా లేదు. అందరూ ఆమడదూరం పారిపోతున్న సమయంలో మేం పేషెంట్లకు దగ్గరగా ఉండి సేవచేస్తున్నామనే గొప్ప కూడా లేదు. మానసికంగా చాలా వెలితి మధ్యనే డ్యూటీ చేస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందా అనే సమయం కోసం ఎదురుచూస్తున్నాం. హెచ్ఐవీ ఉన్న రోజుల్లో వాడే ఆప్రాన్‌లు, గౌనులతో డ్యూటీ చేయాల్సివస్తుందని అనుకోలేదు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో మా ప్రాణాలకు రిస్కు వచ్చిపడింది. మన సీఎం కేసీఆర్ అయినా మా బాధల్ని పట్టించుకుంటే బాగుండును..!
Tags: Telangana, Corona, Positive, Nurses, PPEs, Masks, duties, hospitals,