గజ..గజ.. వణుకుతున్న ఉమ్మడి నల్లగొండ
దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం నమోదైన కేసులతో కలుపుకుని కొవిడ్ బాధితుల సంఖ్య 500 దాటింది. ఇందులో హైదరాబాద్ కు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. కేసులు ఇలాగే కొనసాగితే త్వరలోనే జిల్లా ప్రమదకర స్థితికి చేరుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి […]
దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం నమోదైన కేసులతో కలుపుకుని కొవిడ్ బాధితుల సంఖ్య 500 దాటింది. ఇందులో హైదరాబాద్ కు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. కేసులు ఇలాగే కొనసాగితే త్వరలోనే జిల్లా ప్రమదకర స్థితికి చేరుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ర్ట రాజధానికి సమీపంలో ఉండటం వల్ల ఏ అవసరమున్నా జిల్లా వాసులు హైదరాబాద్‌కు వెళ్లి రావల్సిన పరిస్థితి. దీని కారణంగానే నెల రోజుల నుంచి నమోదవుతున్న కేసుల్లో హైదరాబాద్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉంది. సోమవారం వరకు 480 వరకు ఉన్న బాధితుల సంఖ్య మంగళవారం నమోదైన 38 కేసులతో 518కి చేరుకుంది. రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసులు రెండంకెల నుంచి మూడంకెలకు చేరుకోవడం గమనార్హం. ఇలాగే కేసులు నమోదు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే జిల్లా ప్రమాదకర స్థాయికి చేరుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అంతకంతకూ పెరుగుతూ..
ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గమూ కరోనా బారిన పడింది. ఏప్రిల్ 19 నాటికి నల్గొండ జిల్లాలో, అదే నెల 22 వరకు సూర్యాపేట జిల్లాలో.. పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లా కేంద్రాలను పూర్తిస్థాయిలో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ తర్వాత రెండు నెలల వరకు యాదాద్రి భువనగిరి మినహా.. నల్లగొండ, సూర్యపేట జిల్లాల్లో పెద్దగా కేసులు నమోదు కాలేదు. అనంతరం వాటిని కొవిడ్ రహిత ప్రాంతాలుగా భావించారు. కానీ జూన్ చివరి వారం నుంచి కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 248 మందికి పాజిటివ్ రాగా, సూర్యాపేటలో 197, యాదాద్రిలో 73 మందికి వైరస్ సోకింది. గతంలో వైరస్ తీవ్రత జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మండలం, గ్రామస్థాయిలోనూ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. దేవరకొండ, చింతపల్లి, హాలియా, నేరేడుచర్ల, కోదాడ, ఆలేరు, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి.
అవగాహన లేమితో..
జూన్ చివరి వారం వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన వైరస్.. ఆ తర్వాత పల్లెల్లోకి పాకింది. ఇందులో పలు గ్రామాల్లో చాలా మందికి అవగాహన లేకపోవడమే వైరస్ తీవ్రతకు కారణమని పలువురి అభిప్రాయం. కరోనా వైరస్ వచ్చిన ఇంటిలో గానీ ఆ ఇంటి చుట్టుపక్కలా గానీ ఎలాంటి చర్యలు చేపడట్టక పోవడం, శానిటైజేషన్ పాటించకపోవడం లాంటివి కేసుల తీవ్రతను పెంచాయని చెబుతున్నారు. కానీ గ్రామస్థాయిలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య సిబ్బందే.. పాజిటివ్ వచ్చిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేషంట్లకు నిత్యావసర సరుకులు ఇచ్చే దిక్కు ఉండట్లేదు. ఫలితంగా వైరస్ బారిన పడిన వారే ఇంటి నుంచి బయటకు వచ్చి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.
పట్టించుకునే వారే కరువు
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. ఆమె ఇద్దరు కుమారులు సైన్యంలో ఉన్నారు. ఆమె, ఆమె భర్త ఇద్దరూ ఇంటి వద్దే ఉంటున్నారు. ఆ మహిళకు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రికి తరలించగా, భర్తను ఇంట్లోనే హోంక్వారంటైన్ చేశారు. భార్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా, భర్తను ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇంటిలో నుంచి బయటకు రావొద్దంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది.. అటు ఆరోగ్య సిబ్బంది హుకుం జారీ చేశారు. కానీ అతడికి కావాల్సిన నిత్యావసర సరుకుల సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. కరోనా వచ్చిందనే సరికి పక్కింటి వారు సైతం పలకరించడం మానేశారు. సర్పంచ్‌కు, ఆరోగ్య సిబ్బందికి ఫోన్ చేసినా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.