అసెంబ్లీలో కానరాని ‘కరోనా’ స్క్రీనింగ్..

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణ కోసం అవసరమైతే ఐదు వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాం… రాష్ట్రంలో కరోనా ప్రబలితే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా రోడ్డుమీదకొస్తారు… తెలంగాణ భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతకడం అసాధ్యం… ఆ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది థెర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.. ఎవరికైనా మొబైల్ ఫోన్ కాల్ చేస్తే వచ్చే కరోనా కాలర్ ట్యూన్‌లో అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్‌.. ఇలా అనేక […]

Update: 2020-03-14 06:23 GMT

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా నివారణ కోసం అవసరమైతే ఐదు వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాం… రాష్ట్రంలో కరోనా ప్రబలితే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా రోడ్డుమీదకొస్తారు… తెలంగాణ భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో కరోనా వైరస్ బతకడం అసాధ్యం… ఆ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది థెర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.. ఎవరికైనా మొబైల్ ఫోన్ కాల్ చేస్తే వచ్చే కరోనా కాలర్ ట్యూన్‌లో అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్‌.. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ వివిధ శాఖల కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి తాజా పరిస్థితిని, ఇకపైన తీసుకోబోయే చర్యలను సమీక్షించారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీ ఆవరణలో మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు లేవు.

బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 160 మంది హాజరవుతారు. వారి వెంట వ్యక్తిగత కార్యదర్శులు, గన్‌మెన్, డ్రైవర్, అనుచరులు తదితరులంతా వస్తారు. ఇక మంత్రుల వెంట ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, వారి సిబ్బంది, డ్రైవర్లు… ఇలా మరికొంత మంది అసెంబ్లీకి వస్తారు. ఇక అసెంబ్లీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా వందల సంఖ్యలోనే సమావేశాలు ముగిసేదాకా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. వీరికి తోడు మీడియా సంస్థల తరఫున రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులు, లైవ్ టెలికాస్ట్ అవసరాలను చూసే టెక్నీషియన్లు కూడా ఉంటారు. వీరందరితో పాటు భద్రత కోసం పోలీసులు, మార్షల్స్, ట్రాఫిక్ పోలీసులు… సరేసరి. ప్రతీరోజూ వందల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 1500 నుంచి 2000 మంది ఉండే అసెంబ్లీ ఆవరణలో కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం ఏమీ లేవు.

థర్మల్ స్క్రీనింగ్ సౌకర్యం లేదు. డాక్టర్లు లేరు. వైద్య సిబ్బంది లేరు. ఆంబులెన్స్‌లు లేవు. మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసే పోలీసు సిబ్బందికి చేతులకు గ్లవుజులు లేవు. మాస్క్‌లు అసలే లేవు. అసెంబ్లీకి వస్తున్నవారిలో జలుబు, దగ్గు లేదా కరోనా లక్షణాలున్నాయేమో తనిఖీ చేసే యంత్రాంగమూ లేదు. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని కాలర్ ట్యూన్‌లో చెప్పడమే తప్ప అసెంబ్లీ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లలో ఎక్కడా ఒక్క సబ్బు ముక్క లేదా హాండ్ వాష్ లాంటివి లేవు. శానిటైజర్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మంత్రుల ఛాంబర్లలో ఉండే టాయ్‌లెట్ల సంగతేమోగానీ అసెంబ్లీ సిబ్బంది, విజిటర్లు, మీడియా ప్రతినిధులు, ఎమ్మెల్యేల, మంత్రుల వ్యక్తిగత సిబ్బంది వాడే టాయ్‌లెట్లలో ఎక్కడా సబ్బులు కనపడవు. ఎంతమంది ఉన్నా అక్కడ కనిపించే ఐదారు టాయ్‌లెట్లే వాడుకోవాలి. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యమే.

కరోనా అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు సూచించింది. రాష్ట్రపతి మొదలు గవర్నర్ వరకు హోలీ పండుగలే జరుపుకోలేదు. వివిధ రకాల కార్యక్రమాలకు హాజరుకావడం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు. రాష్ట్ర గవర్నర్ సైతం రాజ్‌భవన్‌కే పరిమితమవుతున్నారు. 200 మందికంటే ఎక్కువ జనం వచ్చే కార్యక్రమాలకు హాజరుకాకుండా స్వీయ నియంత్రణ విధించుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో సైతం జనం గుమికూడే విద్యాసంస్థలు, సినిమాహాళ్ళు లాంటివాటికి సెలవులు ప్రకటించాయి ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు సైతం రద్దవుతున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నా అది ప్రభుత్వాసుపత్రులు, విమానాశ్రయం లాంటివాటికే పరిమితమైంది. అసెంబ్లీలో భారీ సంఖ్యలో హాజరవుతున్నా ఇక్కడ కనీస చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.

మారణాయుధాలు తీసుకెళ్ళకుండా మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేస్తున్న పోలీసులకు గ్లవుజులు, మాస్కులు లాంటి స్వీయ రక్షణ ఉపకరణాలు కరువయ్యాయి. ఇక కెనడా దేశంలో సైతం కరోనా వ్యాప్తి ఉందనే సంగతి తెలిసిందే. ఆ దేశానికి చెందిన పోలార్ జెనెటిక్స్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడ్ వాల్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో భేటీ అయిన తర్వాత అసెంబ్లీకి వచ్చి చాలా మందిని కలిసి ఆ ప్రాంతంలో కలియదిరిగారు. ఆ దేశ ప్రధాని భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలుసుకున్న కొద్దిమంది మంత్రులు, అధికారులు వెంటనే ఆయనతో కరచాలనం చేసిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కున్నారు. కానీ ఆయన కలియదిరిగిన ప్రాంతంలో మాత్రం శానిటైజేషన్ చర్యలు చేపట్టలేదు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో తెలియకున్నా విదేశాల నుంచి వచ్చినవారికి తగిన పరీక్షలు చేసి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్న ప్రభుత్వం అసెంబ్లీ దగ్గర మాత్రం ఆ తర్వాత జాగ్రత్తలను పాటించకపోవడం గమనార్హం.

Tags: Telangana, Assembly, Corona, Preventive Measure, Canada, Thermal Screening

Tags:    

Similar News