తొలి కేసు ఇక్కడే బయటపడింది.. మళ్లీ ఇప్పుడక్కడ కలవరం

దిశ, కంటోన్మెంట్: కరోనా.. రక్షణ శాఖ స్థావరాలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణ పౌరులతోపాటు సైనికులను సైతం కలవరానికి గురిచేస్తోంది. దేశంలోనే అత్యంత కీలకమైన సైనిక ప్రదేశంగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో భారత సైనికులతో పాటు సాధారణ పౌరులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్‌లో దాదాపు 20 పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇటు మిలటరీ, అటు బోర్డు […]

Update: 2020-06-10 21:12 GMT

దిశ, కంటోన్మెంట్: కరోనా.. రక్షణ శాఖ స్థావరాలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణ పౌరులతోపాటు సైనికులను సైతం కలవరానికి గురిచేస్తోంది. దేశంలోనే అత్యంత కీలకమైన సైనిక ప్రదేశంగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో భారత సైనికులతో పాటు సాధారణ పౌరులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్‌లో దాదాపు 20 పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇటు మిలటరీ, అటు బోర్డు అధికార యంత్రాంగం విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది.

కట్టడికి చర్యలు..

సైనిక స్థావరాల్లోకి సాధారణ పౌరుల రాకపోకలను నియంత్రించేందుకు లోకల్ మిలటరీ అధికారులు రోడ్లను మూసి వేస్తుండగా, కంటోన్మెంట్ బోర్డులోకి అత్యవసరమైతేనే ప్రవేశం కల్పిస్తున్నారు. బోర్డు కార్యాలయం వద్ద పౌరులు ఏ పనిమీద వస్తున్నారో ముందుగా ఆరా తీస్తున్నారు. అత్యవసరమైతేనే లోనికి ప్రవేశం కల్పిస్తున్నారు. స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి టెంపరేచర్ తక్కువగా నమోదైతేనే అనుమతిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెనక్కి పంపుతున్నారు.

తొలి కరోనా కేసు ఇక్కడే..

తెలంగాణ రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు కంటోన్మెంట్ లోనే బయట పడింది. మహేంద్రహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దుబాయి నుంచి బెంగుళూరుకు అక్కడి నుంచి బస్సులో నగరానికి చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న సదరు వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మహేంద్రహిల్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బోర్డు యంత్రాంగం వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టింది. ఆ పేషెంట్ కోలుకోగా.. దాదాపు రెండున్నర నెలలపాటు మరో పాజిటివ్ కేసు నమోదు కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ రెండు, మూడు రోజులుగా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో మళ్లీ కంటోన్మెంట్‌లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు ఒక్క కేసు కూడా నమోదు కానీ కంటోన్మెంట్‌లో ప్రభుత్వం నిబంధనలను సడలించడం వల్ల ఆదివారం ఒక్కరోజే 5 కేసులు నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది.

అంతర్గత రోడ్లు బంద్..

కరోనాను కట్టడి చేసేందుకు లోకల్ మిలటరీ అధికారులు అంతర్గత రోడ్లను మూసివేస్తున్నారు. బోర్డు పరిధిలోని అలహాబాద్ గేటు సమీపంలోని మహేంద్రహిల్స్, వెల్లింగ్టన్ రోడ్, మల్కాజిగిరిలోని సఫిల్ గూడ, అల్వాల్, బొల్లారం, యాప్రాల్, ఏఓసీ సెంటర్, స్విమ్మింగ్ పూల్ తదితర ప్రాంతాల్లో దాదాపు 10కి పైగా రోడ్లపైకి ప్రజలను అనుమతించడంలేదు. ఈ రోడ్లు సుమారుగా 200 పైగా కాలనీలకు డైరెక్ట్ గా లింకై ఉన్నాయి. దాదాపు ప్రతీ రోజు 20 నుంచి 30 లక్షల మంది ఈ రోడ్ల గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే మిలటరీ అధికారులు కరోనా ప్రభావం వల్ల రోడ్లను మూసి వేయడంతో ఆయా రోడ్ల గుండా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సాధారణ పౌరులను రోడ్లపైకి రాకుండా కట్టడి చేయాల్సిన అసవరం లేదంటున్నారు. సైనికుల గృహ సముదాయాలతో పాటు కార్యాలయాలు రోడ్లకు దూరంలో ఉన్నందున, సాధారణ పౌరుల వల్ల వైరస్ సోకే అవకాశంలేదంటున్నారు. రోడ్లను మూసి వేయడం వల్ల పౌరుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.

బోయిన్ పల్లి మార్కెట్ బంద్..

రాష్ట్రంలోనే అతి పెద్ద కూరగాయల మార్కెట్‌గా పేరొందిన బోయిన్ పల్లి మార్కెట్ యార్డు కరోనా దెబ్బకు మూత పడింది. నగరంలో ఇతర మార్కెట్లన్నీ గతంలోనే కరోనా వల్ల మూతపడ్డా ఈ మార్కెట్ మాత్రం ఇంతకాలం నగరానికి కూరగాయలను అందిస్తూ వస్తోంది. అయితే లాక్‌డౌన్‌లో సడలింపుల నేపథ్యంలో మార్కెట్ లో గత వారం రోజులుగా ఒకరి తర్వాత మరొకరికి ఇలా ఐదుగురికి కరోనా సోకింది. వీరిలో గాస్ మండి ప్రాంతానికి చెందిన ఓ గుమస్తా ఇటివలే మృతి చెందాడు. దీంతో రెండు రోజులుగా మార్కెట్ ను తాత్కలికంగా బంద్ చేశారు.

Tags:    

Similar News