కరోనా వల్ల సీన్ రివర్స్.. ఇప్పుడేం చేయాలి ?
దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: చవితి అంటేనే నెల ముందు నుంచి విగ్రహాల అమ్మకాలు, మండపాల ఏర్పాట్లతో సందడి ఉంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచే తయారీ దారులు విగ్రహాల ఏర్పాట్లలో తలమునకలై ఉంటారు. కరోనా పుణ్యమా అని ఏడాది సీన్ రివర్స్ అయింది. విగ్రహాలకు ఎవరూ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో తయారీదారులు దిక్కతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది విగ్రహాల అమ్మకాలపై నిబంధనలు విధించడంతో ఆర్ఢర్లు పూర్తిగా సన్నగిల్లాయి. కరోనా వైరస్ అందరి జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నది. లాక్‌డౌన్ […]
దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: చవితి అంటేనే నెల ముందు నుంచి విగ్రహాల అమ్మకాలు, మండపాల ఏర్పాట్లతో సందడి ఉంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచే తయారీ దారులు విగ్రహాల ఏర్పాట్లలో తలమునకలై ఉంటారు. కరోనా పుణ్యమా అని ఏడాది సీన్ రివర్స్ అయింది. విగ్రహాలకు ఎవరూ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో తయారీదారులు దిక్కతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది విగ్రహాల అమ్మకాలపై నిబంధనలు విధించడంతో ఆర్ఢర్లు పూర్తిగా సన్నగిల్లాయి.
కరోనా వైరస్ అందరి జీవితాల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నది. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక ఆధారాలు కుంగిపోతున్నాయి. సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు అందరూ ఏదో రకంగా ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏటా గణేశ్ పండుగకు విగ్రహాలను తయారు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకునే తయారీదారులు ఈ సారి ఆర్డర్లు లేకపోవడంతో పూట గడవడం ఇబ్బంది పడుతున్నారు. పండుగ నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో విగ్రహాల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని కళాకారులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదరణ అంతంతే..
జిల్లాలో చాలా తక్కువ చోట్ల విగ్రహాలను విక్రయాలకు ఉంచుతున్నారు. ఐనా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న కుమ్మరి కళాకారులు ముందుగానే విక్రయాలకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కరోనా ఎఫెక్ట్‌తో ఎవరూ ముందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. కరోనా వైరస్, చైనా-భారత్ ఉద్రిక్తత ఆధారంగా కొందరు కళాకారులు వినూత్నంగా విగ్రహాలను రూపొందించారు. అందంగా ముస్తాబు చేసిన మట్టి ప్రతిమలు, దీపాలు, దేవతా విగ్రహాలను చేసినా తయారీదారులకు ఈఏడాది నిరాశే ఎదురయ్యే చాన్స్ ఉంది.
ఆర్డర్లు లేక వెలవెల..
శ్రావణ మాసం విగ్రహ తయారీదారులు ఏమాత్రం తీరక లేకుండా గడుపుతారు. వరమహాలక్ష్మి పూజ, గౌరి గణేశ్, దీపావళి పండుగకు అవసరమైన దేవతా విగ్రహాలు, అలంకార దీపాలను సిద్ధం చేస్తూ బిజీగా ఉంటారు. ఈ సమయంలో వేలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ సీజన్ కోసమే కళాకారులు ఏడాదంతా వేచి చూస్తారు. ఏడాది ప్రారంభం నుంచే గౌరీ గణేశ్ పండుగ కోసం వినాయకుడు, పార్వతీదేవీల విగ్రహాలను సిద్ధం చేస్తుంటారు. స్థానికంగా కొందరు లక్షల పెట్టుబడులు పెట్టి ఫిబ్రవరి నుంచే పనులు మొదలుపెడతారు. కానీ ఈ ఏడాది కరోనా కాటు వల్ల విగ్రహాల వ్యాపారానికి గండి పడింది.ఆర్డర్లు లేక జిల్లా వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. విగ్రహాలు కొనే వారు లేక తయారీదారులకు పూడగడవని పరిస్థితి నెలకొంది.
పోలీసుల ఆంక్షలు..
విగ్రహ తయారీదారులకు పోలీసుల ఆంక్షల రూపంలోనూ నష్టం ఎదురవుతున్నది. కరోనా నేపథ్యంలో వినాయక విగ్రహాలు ఇష్టా రీతిగా ఎక్కడబడితే అక్కడ అమ్మడానికి వీలులేదనే నిబంధన విధించారు. అనుమతి లేకుండా గణపతి విగ్రహాల మండపాలను ఏర్పాటు చేయరాదని జిల్లా పోలీసు అధికారులు ఆంక్షలు పెట్టారు. అమ్మకాలపై అనుమతి ఇవ్వకపోవడంతో తయారీదారులు నష్టం ఎదురయ్యే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి.
చవితి ఉత్సవాలకు అనుమతి లేదు: శ్రీనివాస్ రెడ్డి డీసీపీ, జనగామ.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి అనుమతి లేదు. భక్తులు ఎవరి ఇంట్లో వారు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసుకొని పూజించాలి. మట్టి వినాయక పూజే శ్రేష్ఠమైనది.
ఆర్డర్లు వస్తలేవు: సత్యనారాయణ, తయారీదారుడు, జనగామ
ప్రతి ఏడు విగ్రహాల తయారీ, విక్రయాలు చేస్తూ మళ్లీ చవితి వరకు కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. ప్రతి ఏడాది చేసే విగ్రహాలలో సగం తయారు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్ రావడం లేదు. కరోనా కారణంగా ప్రతి వస్తువు ధర పెరిగింది. అప్పులు తెచ్చి మరీ విగ్రహాలు తయారు చేస్తున్నాం. ఆర్డర్లు లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి.