ఆస్పత్రుల్లో కిటకిట.. కానీ, అక్కడెవరూ లేరు

పేరుకు ప్రభుత్వాస్పత్రులు. కానీ ఎక్కడా వైద్య సేవలు అందడం లేదు. అసలే కరోనా కాలం.. పైగా సీజనల్ వ్యాధుల సమయం. ఇంకేముంది.. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కానీ అందుకు తగిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు లేవు. దాదాపుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రధానంగా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికితోడు నర్సుల పోస్టులు 75 శాతం మేర ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఉన్న సిబ్బందినే తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఒక్కోసారి రాత్రిపగలు […]

Update: 2020-07-28 20:39 GMT

పేరుకు ప్రభుత్వాస్పత్రులు. కానీ ఎక్కడా వైద్య సేవలు అందడం లేదు. అసలే కరోనా కాలం.. పైగా సీజనల్ వ్యాధుల సమయం. ఇంకేముంది.. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కానీ అందుకు తగిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు లేవు. దాదాపుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రధానంగా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికితోడు నర్సుల పోస్టులు 75 శాతం మేర ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఉన్న సిబ్బందినే తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఒక్కోసారి రాత్రిపగలు డ్యూటీలు చేస్తున్నారు. దీంతో వారిలోనూ ఓపిక లేకుండాపోతోంది. కరోనా పరిస్థితుల వల్ల ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఫలితంగా రోగులను సక్రమంగా సేవలు అందడం లేదు. అసలే ఆస్పత్రిలో సాధారణ రోగులకు సిబ్బంది కొరత వేధిస్తుంటే.. వీరిని కాస్త ఐసోలేషన్ వార్డుల్లో డ్యూటీలు వేస్తున్నారు. దీంతో సాధారణ రోగులకు సేవలు అందడం గగనంగా మారింది. ప్రభుత్వం పైకి ఎన్ని మాటలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. చివరకు స్వీపర్లు, వార్డు బాయ్‌లు సైతం లేకపోవడంతో వార్డుల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఖాళీల కొరతపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

దిశ ప్రతినిధి, నల్లగొండ: గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలు, పట్టణ ప్రాంతాల్లో ఏరియా ఆస్పత్రులను వైద్యవిధాన పరిషత్ నిర్వహిస్తోంది. అయితే ఈ ఏరియా ఆస్పత్రుల్లో ఏండ్ల తరబడిగా ఖాళీలను భర్తీ చేయడంలేదు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో 46 మంది డాక్టర్లు కావాల్సి ఉండగా, కేవలం 15 మంది విధుల్లో ఉన్నారు. ఇక్కడ 31 మంది వైద్యుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇక నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రిలో 44 మంది వైద్యులు అవసరం కాగా, ప్రస్తుతం 14మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంకా 30 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. నకిరేకల్ ఏరియా ఆస్పత్రి విషయానికొస్తే.. 16 మంది వైద్యులకు 7 మంది అందుబాటులో ఉన్నారు. మరో 9 మంది వైద్యులను భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భువనగిరి ఆస్పత్రిలో 26 మంది డాక్టర్లకు కేవలం 14 మంది ఉన్నారు. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో 21 మంది వైద్యులకు 8 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చౌటుప్పల్ ఆస్పత్రిలో 17 మంది వైద్యులకు 9 మంది మాత్రమే వైద్యులు ఉన్నారు.

నర్సుల పరిస్థితి ఇదీ..

మిర్యాలగూడ ఆస్పత్రిలో 33 మంది నర్సులకు 24 మంది ఉన్నారు. మరో 9 ఖాళీలను భర్తీ చేయాలి. కిందిస్థాయి సిబ్బంది 36 మందికి 14 మంది ఉండగా, 22 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో 33 మంది నర్సులకు 24 మంది మాత్రమే ఉన్నారు. మరో 9 ఖాళీలు ఉన్నాయి. ఇతర సిబ్బంది 56 మందికి 19 మంది ఉండగా, 37 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నకిరేకల్ ఆస్పత్రికి 14 నర్సుల పోస్టులు ఉండగా, 10 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర సిబ్బంది 18 మందికి 7 మంది పనిచేస్తున్నారు. నర్సు పోస్టులు 4, ఇతర సిబ్బంది పోస్టులు 11 భర్తీ చేయాల్సి ఉంది. దేవరకొండ ఆస్పత్రిలో 34 మంది నర్సులకు 9 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 25 పోస్టులు ఖాళీలగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర సిబ్బంది 41 మందికి కేవలం ఏడు మాత్రమే భర్తీ అయ్యాయి. 34 పోస్టులు ఖాళీలే కన్పిస్తున్నాయి. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో 19 నర్సులకు 6 మంది మాత్రమే ఉన్నారు. ఐదుగురు వార్డు బాయ్స్‌కు ముగ్గరు మాత్రమే పనిచేస్తున్నారు. చౌటుప్పల్ ఆస్పత్రిలో 12 మంది నర్సులకు 5 మంది మాత్రమే ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అవస్థలే..

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు మండలానికో ప్రాథమిక వైద్యశాల ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 71 మంది వైద్యులు అవసరం ఉంది. కాగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎన్ఎంలు 223 మందికి 103 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 120 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏఎన్ఎంలే కీలకం. స్టాఫ్ నర్సులు 51 మందికి 15 ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 43 మందికి 16 ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల కాలంలో ప్రజలకు కనీస ఆరోగ్య సేవలు అందండం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఏంతైనా ఉంది.

Tags:    

Similar News