గజగజ వణుకుతున్న దైవదూతలు
దిశ, న్యూస్ బ్యూరో: నర్సులు దైవదూతలు అంటారు కొందరు. మానవతామూర్తులంటారు మరికొందరు. కానీ, ఇప్పుడు ఏ నర్సును కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ వీరిని కరోనా వారియర్లుగా అభివర్ణించారు. గగనతలం నుంచి పూల వర్షం కురిపించారు. ఇవేవీ వారి బతుకులను మాత్రం మార్చలేకపోయాయి. దశాబ్దాల సర్వీసు చేసిన ప్రభుత్వ నర్సులు సైతం తమ పిల్లల్ని ఇకపైన ఈ వృత్తిలోకి రానివ్వం అనేంత నరకాన్ని చూశారు. సేవా దృక్పథంతో నాణ్యమైన సేవ అందించాలన్న వీరి ఆశయం […]
దిశ, న్యూస్ బ్యూరో: నర్సులు దైవదూతలు అంటారు కొందరు. మానవతామూర్తులంటారు మరికొందరు. కానీ, ఇప్పుడు ఏ నర్సును కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ వీరిని కరోనా వారియర్లుగా అభివర్ణించారు. గగనతలం నుంచి పూల వర్షం కురిపించారు. ఇవేవీ వారి బతుకులను మాత్రం మార్చలేకపోయాయి. దశాబ్దాల సర్వీసు చేసిన ప్రభుత్వ నర్సులు సైతం తమ పిల్లల్ని ఇకపైన ఈ వృత్తిలోకి రానివ్వం అనేంత నరకాన్ని చూశారు. సేవా దృక్పథంతో నాణ్యమైన సేవ అందించాలన్న వీరి ఆశయం కరోనా కాలంలో ప్రభుత్వాల అసమర్థ విధానాలతో, నిత్యం ఎదురవుతున్న వివక్షతో నీరుగారిపోతోంది. డ్యూటీ ఎక్కిన ప్రతిసారీ ఒక ‘స్కేరీ హోమ్’లోకి వెళ్లిపోతున్నామన్న భయానికి గురవుతున్నారు. ఇబ్బందుల గురించి మీడియాతో మాట్లాడితే ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు, వేధింపులు ఎదురవుతున్నాయి. నర్సుల కొరతతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ”డాక్టర్లు రౌండ్లకు రావడానికి ముందే పేషెంట్ల వైటల్ రీడింగ్స్ తీసుకోవాలి. కేస్ షీట్ రాయాలి. రికార్డులు అప్‌డేట్ చేసుకోవాలి. పేషెంట్ కేర్ తీసుకోవాలి. ఏ పేషెంట్‌కైనా ఆక్సిజన్ లాంటి అవసరంవస్తే పరుగెత్తాలి. సుమారు 30 మంది పేషెంట్లు ఉండే వార్డులో ఒక నర్సు, మరో హెడ్ నర్సు మాత్రమే ఇన్ని పనులు చూసుకోవడం ఎలా సాధ్యం” అని ప్రశ్నించిన ఓ నర్సును అధికారులు ముప్పు తిప్పలు పెట్టారు.
ఏడు నోటిఫికేషన్లు ఇచ్చినా
కరోనా ఆసుపత్రుల్లో నర్సుల్ని ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏడు నోటిఫికేషన్లు ఇచ్చినా ఫలితం లేకపోయింది. చేరడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడంలేదు. ఆరు నెలలు లేదా ఏడాది కాలం వరకు మాత్రమే ఉద్యోగం అని ప్రభుత్వం నిబంధన విధించడమే ఇందుకు కారణం. ”కరోనా అవసరాల కోసం మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. 25 వేల జీతం అని చెప్తారు. ఆ జీతం వస్తుందో రాదో తెలియదు. రిస్కు తీసుకుని చేరినా, మధ్యలో పాజిటివ్ వచ్చినా, క్వారంటైన్‌కు వెళ్లినా జీతం ఇవ్వరు. గాంధీ ఆసుపత్రిలో, వరంగల్ ఎంజీఎంలో నర్సులు పడుతున్న ఇబ్బందుల్ని చూస్తూనే ఉన్నాం. ఉస్మానియాలో నాలుగు నెలలైనా జీతాలు ఇవ్వడంలేదనేది కనిపిస్తూనే ఉంది. ఏడాది తర్వాత మా బతుకు కూడా అదే అవుతుంది. గతంలో ప్రభుత్వ నోటి ఫికేషన్ అంటే పోటీ ఎక్కువ ఉండేది. రెగ్యులర్ అవుతుందనో, వెయిటేజీ మార్కులు వస్తాయనో ఆశలు ఉండేవి. ఇప్పుడు ఆ నమ్మకాలేమీ లేవు. కరోనా తర్వాత మళ్ళీ రోడ్డుమీద పడక తప్ప దు. భరోసా లేకుండా చేరదల్చుకోలేదు” అన్నారు ఒక నర్సు. ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో రూ.45 వేల జీతానికి చేరారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
కరోనా కష్టకాలంలో అరకొర సౌకర్యాలతో పేషెంట్లకు సేవలందిస్తున్న నర్సుల ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. ‘‘జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే ఏకంగా మంత్రే అక్కడకు వచ్చి చర్చలు జరుపుతారు. అదే డిమాండ్లతో మేం నిరసన వ్యక్తం చేస్తే మాత్రం మాది అరణ్య రోదనే అవుతుంది. డాక్టర్లు ఒక రౌండ్ వేసి ఏమేం చేయాలో నిర్దేశించి పోతారు. మేం మాత్రం రౌండ్ ది క్లాక్ సేవలందిస్తూనే ఉండాలి. మాకు కనీసం డ్రెస్ ఛేంజ్ చేసుకోడానికి రూమ్ ఉండదు. టాయ్‌లెట్లు ఉండవు. రెస్ట్ రూమ్‌లు అసలే ఉండవు. నాణ్యమైన పీపీఈ కిట్లు ఉండవు. పీపీఈ కిట్ వేసుకుంటే దాదాపు పది, పన్నెండు గంటల తర్వాత తీసేది. మధ్యలో చుక్క నీరు తాగలేం. తినలేం. టాయ్‌లెట్‌కు వెళ్లలేం. ఐదు నెలలుగా ఇదే. డీహైడ్రేట్ అయిపోతున్నాం. కనీసం ఒక్క అధికారికైనా మా బాధ అర్థమైందా? డ్యూటీ మొత్తానికి ఒకటే కిట్ అని రేషను విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇంత కష్టపడ్డా మా సేవకు గుర్తింపు ఉండదు. మా వృత్తి పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉండదు. మా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన ఉండదు. కేరళలో నర్సు చనిపోతే ప్రభుత్వం తరఫున మంత్రి, అధికారులు వచ్చి చూశారు. ఛెస్ట్ ఆసుపత్రిలో మరో రెండు వారాల్లో రిటైర్ కావాల్సిన నర్సు చనిపోతే అధికారులు కూడా రాలేదు’’ అంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల్ని ఈ వృత్తిలోకి రానివ్వం: కె. సుజాత, స్టాఫ్ నర్స్
నర్సుల కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిదేళ్ళుగా రిక్రూట్‌మెంట్ లేదు. మూడేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చినా, కోర్టు కేసు కారణంగా భర్తీ కాలేదు. తక్కువ సిబ్బందితోనే పని చేయాల్సి వస్తోంది. ఒక మంచి ఆశయంతో ఈ వృత్తిలోకి వచ్చాను. 20 ఏళ్లకు పైగా సర్వీసులో ఎన్నో కేసుల్ని చూశా. కరోనా వైరస్‌కు భయపడడంలేదుకానీ, రక్షణ పరికరాలు సంతృప్తికరంగా లేకపోవడం, సిబ్బంది కొరత, పని భారం బాధిస్తున్నాయి. సేవ చేయడానికి సిద్ధమే. నా పిల్లల్ని ఇకపైన ఈ వృత్తిలోకి రానివ్వాలనుకోవడం లేదు. నాలాగే చాలా మంది నర్సులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
రెస్ట్ రూమ్స్ కూడా లేవాయె: కె. పుష్ప, హెడ్ నర్సు
ప్రస్తుతం నర్సులకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలి. వార్డుల్లో పనిచేసే నర్సులకు సిక్ రూమ్‌లు లేవు, రెస్టు రూములు లేవు, డ్రెస్ ఛేంజ్ రూములు లేవు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో ఇదే సమస్య. సౌకర్యాలు ఎంత మెరుగ్గా ఉంటే సేవలు అంత తృప్తికరంగా ఉంటాయి. నర్సుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సరైన మెకానిజం కూడా లేదు. వార్డు బాయ్‌లు లేరు. పేషెంట్ కేర్ సిబ్బంది లేరు. వార్డుల్ని శుభ్రం చేయించడానికి కూడా స్వీపర్లు తక్కువగా ఉండడంతో బతిమాలుకోవాల్సి వస్తోంది.
నాలుగు నెలలుగా జీతాలు లేవు: స్నేహ, ఔట్‌సోర్సింగ్ నర్సు
ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగంలో చేరాం. ఏప్రిల్ నుంచి జీతాలే లేవు. ఏజెన్సీ ప్రతినిధిని అడిగితే ప్రభుత్వం నుంచి బడ్జెట్ రిలీజ్ కాలేదని అన్నారు. డీఎంఈని అడిగితే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీతో ఇంకా ఒప్పందం కాలేదని అన్నారు. ఈ నాలుగు నెలల్లో మాతోపాటు పనిచేసే కొంతమందికి పాజిటివ్ వచ్చింది. నిత్యం పేషెంట్ల మధ్యలోనే ఉంటున్నాం. ఇప్పటికిప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే నెలకు రూ. 45 వేల జీతం వస్తుంది. కానీ, ఎప్పటికైనా వెయిటేజీ మార్కులు రాకపోతాయా అనే నమ్మకంతో పనిచేస్తున్నాం. నాలుగైదు రోజులు చూస్తాం. జీతాలివ్వకుంటే విధులు బహిష్కరిస్తాం.