చేతులెత్తేయక తప్పడం లేదు
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం డబుల్ బెడ్‌రూం పథకంపై మరో పిడుగు పడింది. కరోనా రాకతో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. పది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. బల్దియా పరిధిలో చెప్పుకునేందుకు ఈ పథకంలో సగం కూడా పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో ప్రచారానికి ఎలా వెళ్లాలో అధికార పార్టీ తర్జనభర్జన పడుతోన్నది. నాలుగేండ్లుగా సాగుతున్న […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం డబుల్ బెడ్‌రూం పథకంపై మరో పిడుగు పడింది. కరోనా రాకతో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. పది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. బల్దియా పరిధిలో చెప్పుకునేందుకు ఈ పథకంలో సగం కూడా పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో ప్రచారానికి ఎలా వెళ్లాలో అధికార పార్టీ తర్జనభర్జన పడుతోన్నది.
నాలుగేండ్లుగా సాగుతున్న నిర్మాణాలు
గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తామని 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రకటించింది. అనుకున్నట్టుగానే రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ గెలుపొందింది. 117 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించేందుకు టెండర్లను పిలిచారు. ఇండ్ల నిర్మాణాల కోసం 47 బస్తీల్లోని సుమారు 9, 454 గుడిసెలను అధికారులు ఖాళీ చేయించారు. అధికారిక లెక్కల ప్రకారం 11 ప్రాంతాల్లో 7,848 ఇండ్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచించింది. ఈ ప్రకారం దశల వారీగా 2019 జూన్ నాటికి 2,280 ఇండ్లు, సెప్టెంబర్ నాటికి 26,898 ఇండ్లు, డిసెంబర్ నాటికి 25,996 ఇండ్లు, 2020 మార్చి నాటికి 24,301 ఇండ్లు, 2020 జూన్ నాటికి 10,622 ఇండ్లు, 2020 సెప్టెంబర్ నాటికి 2,055 ఇండ్లతో మొత్తం ఇండ్లను పూర్తి చేయాలని భావించింది. ఈ లెక్కన ఇప్పటి వరకూ దాదాపు 90 వేల ఇండ్లు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సుమారు 9,874 ఇండ్లు (10 శాతం లోపు) మాత్రమే పూర్తి చేయగలిగారు.
ఏడాదిగా పెండింగ్ బిల్లులు
గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూం ప్రాజెక్టును రూ.8,600 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. సుమారు రూ.6 వేల కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. గతేడాది మే నుంచి ఇప్పటి వరకూ 68 మంది కాంట్రాక్టర్లకు సంబంధించిన రూ. వెయ్యి కోట్ల బకాయి బిల్లులను దశలవారీగా చెల్లిస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ టర్మ్ లోన్లు, ఇతర పద్ధతుల్లో సేకరించిన నిధుల నుంచి ఈ పథకం కోసం సర్దుబాటు చేస్తున్నారు. బకాయిల చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాల్లో జాప్యం చేస్తూ వస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల బకాయిల్లో రూ.800 కోట్లకు మంజూరు రాగా.. చెల్లింపులు జరుగుతుండగా.. మరో రూ.200 కోట్ల బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ ఎలాగోలా పనిచేయించేందుకు ఒప్పించేందుకు బల్దియా అధికారులు తంటాలు పడుతుండగానే.. లాక్‌డౌన్ పిడుగు పడింది.
సొంతూళ్లకు కార్మికులు.. నిర్మాణాలు మరింత ఆలస్యం
గ్రేటర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణంలో బల్దియా గణంకాల ప్రకారం తొమ్మిది వేల మంది వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులేకపోవడంతో కూలీలకు చెల్లింపులు లేకపోవడంతో ఏడాదిగా పదుల సంఖ్యలో సొంతూళ్లకు వెళ్తున్నారు. లాక్‌డౌన్ విధించిన తర్వాత వీరి సంఖ్య ఒక్కసారిగా వేలల్లో పెరిగిపోయింది. కర్నాటక, చత్తీస్‌గడ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు తమకు రావాల్సిన కూలి డబ్బులు వదులుకొని వీరి సొంతూళ్లకు వెళ్తున్నారు. కార్మికుల్లో విశ్వాసం కల్పించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితమివ్వడం లేదు. గత రెండు నెలల కాలంలో సుమారు 4 -5 వేల మంది వరకూ ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్నవారి సంఖ్య కూడా నాలుగు వేల లోపు మాత్రమే.. తొమ్మిది వేల మంది కార్మికులతో నాలుగేండ్లలో 10 వేల ఇండ్లు మాత్రమే పూర్తిచేయగలిగారు. కూలి డబ్బులు రాకపోవడంతో పాటు లాక్‌డౌన్ ఇబ్బందులు, భయాలు వారి మనసుల్లో ఉండటంతో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా వలస కార్మికులు ఏడాది వరకూ తిరిగి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. కార్మికులు, నిధులు అవసరమైనంత స్థాయిలో లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం లేదు.
ఎన్నికలకు ఎలా వెళ్లేది..?
2021 ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ పాలక వర్గం పదవీకాలం ముగిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం పథకంలో నాలుగేండ్లుగా పదిశాతం పురోభివృద్ధి కూడా కనబడటం లేదు. డబుల్ ఇండ్ల కోసం ఖాళీ చేయించిన జనాలు అద్దెలు చెల్లిస్తూ అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని అధికార పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. లాక్‌డౌన్ కలిసొచ్చిందని రాత్రి, పగలూ తేడా లేకుండా కార్మికులతో పనిచేయించుకుని ఈ ఏడాది చివరికల్లా ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావించారు. పురపాలక శాఖ మంత్రి చొరవతో ఎస్‌ఆర్‌డీపీ, అంతర్గత సీసీ రోడ్ల పనుల్లో కొంత వేగం కనిపిస్తోన్నది. కానీ, పేదలకు ఇండ్లు ఇచ్చే డబుల్ బెడ్ రూం పథకంలో మరింత జాప్యం జరుగుతోన్నది. పనులు చేద్దామనుకున్న కార్మికులు లేకపోవడంతో బల్దియా కూడా చేతులెత్తేయక తప్పడం లేదు. ఎలక్షన్లకు రోజులు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ, బల్దియా నేతల్లో ఆందోళన నెలకొన్నది.