RBI: ప్రైవేట్ బ్యాంకుల్లో అధిక అట్రిషన్ రేటుపై ఆర్‌బీఐ ఆందోళన
గత మూడేళ్లలోనే అట్రిషన్ రేటు వేగంగా పెరిగి, 25 శాతానికి మించి నమోదైంది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగుల అట్రిషన్ రేటు సగటున 25 శాతానికి పెరిగింది. ఇది బ్యాంకుల కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్యాంకింగ్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్‌పై ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈ రేటు గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలోనే అట్రిషన్ రేటు వేగంగా పెరిగి, 25 శాతానికి మించి నమోదైంది. దీనివల్ల కార్యకలాపాల నిర్వహణలో సమస్యలు తలెత్తడమే కాకుండా కస్టమర్ సర్వీసుల్లో ఇబ్బందులు, నియామక ఖర్చులు పెరిగేందుకు కారణమవుతుంది. అట్రిషన్ రేటును తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆర్‌బీఐ సూచించింది. మెరుగైన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ, ట్రైనింగ్, కెరీర్ అవకాశాలు, మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లు, పని వాతావారణంలో సహకారం, ఇతర ప్రయోజనాల ద్వారా దీన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో టాప్-అప్ లోన్‌లతో సహా బంగారు రుణాలు, బంగారంపై రుణాలివ్వడం వంటి వాటిలో అవకతవకలు సమీక్షించాలని, ఆర్‌బీఐ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు గోల్డ్‌లోన్ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించాలని, ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాలు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై తగిన నియంత్రణ ఉండాలని వెల్లడించింది.