డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇక లేనట్టేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : అప్పుడో, ఇప్పుడో అని గంపెడాశతో ఎదురుచూస్తున్న గూడు లేని నిరుపేదలకు మళ్లీ నిరాశే మిగిలింది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు బ్రేక్ పడింది. సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లను పనులు నిలిపివేశారు. బిల్లులు చెల్లించేదాకా పనులు చేయమంటూ తేల్చి చెప్పారు. ఓవైపు రైతుబంధు నిధుల కోసం అక్కడా, ఇక్కడా సర్దుబాటు చేసేందుకు సర్కారు తంటాలు పడుతోంది. అటు దళిత బంధు కోసం కూడా అదే పరిస్థితి. ఇలాంటి సమయంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : అప్పుడో, ఇప్పుడో అని గంపెడాశతో ఎదురుచూస్తున్న గూడు లేని నిరుపేదలకు మళ్లీ నిరాశే మిగిలింది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు బ్రేక్ పడింది. సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లను పనులు నిలిపివేశారు. బిల్లులు చెల్లించేదాకా పనులు చేయమంటూ తేల్చి చెప్పారు. ఓవైపు రైతుబంధు నిధుల కోసం అక్కడా, ఇక్కడా సర్దుబాటు చేసేందుకు సర్కారు తంటాలు పడుతోంది. అటు దళిత బంధు కోసం కూడా అదే పరిస్థితి. ఇలాంటి సమయంలో డబుల్బెడ్రూం ఇండ్ల బిల్లులు ఇవ్వలేమంటూ ప్రభుత్వం నుంచి తిరుగు సమాధానం వస్తుండటంతో పనులన్నీ ఎక్కడికక్కడే ఆపేస్తున్నామని నోటీసు ఇచ్చిన కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. కొన్ని ఇండ్లు 90 శాతం వరకు పూర్తి అయ్యాయి. ఫినిషింగ్స్టేజ్లో ఉన్న వాటిని పూర్తి చేస్తే ఎంతో కొంత వరకు లబ్ధిదారులకు అందించవచ్చనుకుంటున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు షాక్ ఇచ్చారు.
సామాన్యుల సొంతింటి కలలు క్రమంగా కరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ ఆరేండ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్బెడ్రూం ఇండ్లు నత్తకే నడక నేర్పుతున్నాయి. కొన్నిచోట్ల ఇండ్ల పనులు పునాది దాటడం లేదు. దాటినా.. ముందుకు సాగడం లేదు. గ్రేటర్‌హైదరాబాద్‌తో కలుపుకొని తెలంగాణలోని గూడు లేని పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ దశల్లో 2,86,057 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు కిందా మీదా పడి కేవలం 54 వేల గృహాలనే నిర్మించగలిగింది. అంటే లక్ష్యంలో 21 శాతం వద్దే సర్కారు చతికిలపడింది.
నాలుగైదు జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తికాకపోగా.. మరో ఆరు జిల్లాల్లో కనీసం 100 ఇండ్లు కూడా కట్టలేదు. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన రేట్లు తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడం, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం, సరిపడా నిధులు లేకపోవడం, స్థలాల కొరత తదితర కారణాలతో పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం స్టీలు, సిమెంట్ధరలను తగ్గించి ఇచ్చేందుకు కొంత వెసలుబాటు కల్పించిన నేపథ్యంలో కాంట్రాక్టర్లు పనులు చేపట్టినా.. బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు మొత్తానికే ఆపేశారు.
ముందు నుంచీ వెనకడుగే
ఒక్కో డబుల్ బెడ్‍రూం ఇంటి నిర్మాణానికి రూరల్ఏరియాలో రూ. 5.04 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ. 5.30 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఇంకా మౌలిక వసతుల కోసం పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా 25వేలు అందజేస్తామని చెప్పింది. చాలా పట్టణాల్లో స్థల సేకరణ ప్రధాన సమస్యగా మారడంతో వ్యక్తిగత ఇళ్లకు బదులు జీ ప్లస్, జీ ప్లస్ప్లస్మోడల్ నిర్మాణాలు చేపట్టవచ్చని స్పష్టత ఇచ్చింది. కానీ చాలా జిల్లాల్లో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన కనిపించలేదు.
ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్ల ప్రకారం ఇళ్ల నిర్మాణం తమకు గిట్టుబాటు కాదని వాదించారు. కొన్ని జిల్లాల్లో ధైర్యం చేసి ముందుకు వచ్చిన కొందరు కాంట్రాక్టర్లు ఆ తర్వాత మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోయారు. నిజామాబాద్‌లాంటి జిల్లాల్లో మహారాష్ట్ర కు చెందిన ఒకటి, రెండు కంపెనీలు టెండర్ దక్కించుకున్నా అవి కూడా మధ్యలోనే జారుకున్నాయి. మొత్తంగా డబుల్ఇండ్ల పథకంపై ప్రభుత్వం రూ. 10,400 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రకటించింది.
రుణం ఇవ్వలేం
ఇప్పటి వరకూ రుణాలపై ఆధారపడే ఈ ఇండ్లను నిర్మిస్తుండగా… హడ్కో రుణం ఇవ్వలేమంటూ ఇటీవల ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్రం కూడా పాత నిధుల వసూళ్లకు దిగుతోంది. దీంతో డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకం పద్మవ్యూహంలో చిక్కింది. పీఎంఏవై కింద 2014 నుంచి 2018 వరకు విడుదల చేసిన సుమారు రూ. 800 కోట్లను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం నుంచి గతంలోనే లేఖలు వచ్చాయి. ఇందులో 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 190.78 కోట్లను వెంటనే వాపస్ చేయాలని, ప్రధానమంత్రి ఆవాస్‌యోజనా గ్రామీణ పథకం కింద విడుదల చేసిన నిధులు వాడుకోవడం లేదని, దానికి యూసీలు రాలేదంటూ కేంద్రం రాష్ట్రానికి తాఖీదులు జారీ చేసింది.
ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లను హడ్కో నుంచి అప్పుగా తీసుకున్న సర్కారు.. ఇంకా ఇండ్లను పూర్తి చేయలేదు. మరోవైపు ఈ అప్పులకు సంబంధించి వాయిదాల చెల్లింపులు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి నుంచే తిరుగు చెల్లింపులు మొదలైనా.. కరోనా పరిస్థితులను చూపిస్తూ వాయిదా వేస్తున్నారు. ఈ అప్పుపై ఇప్పటికూ రూ.900 వడ్డీ కూడా పెరిగింది. ఇప్పుడు డబుల్ ఇండ్లను కంప్లీట్చేసేందుకు హడ్కో, ఇతర సంస్థలు అప్పు ఇచ్చేందుకు వెనకాడుతున్నాయి. కొత్తగా అప్పు ఇవ్వలేమని దరఖాస్తులను తిరస్కరించడంతో పాటుగా వాయిదాలు చెల్లించాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది.
రూ. 800 కోట్లు చెల్లించండి.. నిర్మాణాలు చేయలేం
ప్రస్తుతం డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు మొత్తంగా ఆగిపోయాయి. రేపో, మాపో ఇండ్లను కంప్లీట్‌చేసి అందిస్తారనుకుంటున్న లబ్ధిదారులకు ఇది నిరాశే. ఎందుకంటే కొన్నిచోట్ల ఇండ్లు 90 శాతం నిర్మాణాలు పూర్తి అయినట్లు ప్రభుత్వం చెప్పుతోంది. వాటిని పూర్తి చేసే పనులను సైతం ఆపేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు రూ. 800 కోట్లు బాకీ పడింది. ఈ బిల్లులు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా నిర్మాణాలను ఆపేశారు. బిల్లులు చెల్లించే వరకూ నిర్మాణాలు చేయలేమంటూ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఇండ్ల పనులన్నీ ఆగిపోయాయి.
ఇదీ సర్కారు చెప్పుతున్న ప్రగతి
2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించినట్లు సర్కారు లెక్కలు చెప్పుతున్నాయి. ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయ్యాయని, ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,400.94 కోట్లు ఖర్చు చేసిందని, మిగిలిన ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు నివేదికల్లో వెల్లడించారు. 54 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. వీటిలో 38,740 ఇండ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసినట్లు పేర్కొన్నారు.