లెక్కతప్పినా.. తీరు మార్చుకోని ‘హస్తం’
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది. ఎట్ ప్రజెంట్ ఫలానా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఉన్నాం, తరువాత దేశంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామన్న క్లారిటీ మాత్రం ఆ పార్టీకి లేదు. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సమావేశం జరిగినా వచ్చేది మనమే, చేసేది మనమే అంటూ నేతల ఓవర్ కాన్ఫిడెంట్ స్పీచ్. మైకు అందితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలే. జాతీయ నేతలైనా, రాష్ట్ర నేతలైనా […]
దిశ, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉంది. ఎట్ ప్రజెంట్ ఫలానా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఉన్నాం, తరువాత దేశంలో, రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామన్న క్లారిటీ మాత్రం ఆ పార్టీకి లేదు. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సమావేశం జరిగినా వచ్చేది మనమే, చేసేది మనమే అంటూ నేతల ఓవర్ కాన్ఫిడెంట్ స్పీచ్. మైకు అందితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలే. జాతీయ నేతలైనా, రాష్ట్ర నేతలైనా ఒకటే పోకడ. నిన్నటికి నిన్న తెలంగాణకు ఇన్‌చార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్‌ది సైతం అదే తరహా మాటల మంత్రమే. వచ్చేది మనమే.. రాసిపెట్టుకోండంటూ ధీమాను కల్పించే ప్రయత్నమే. ఇలా ఎవరికి వారు ఎన్ని లెక్కలేసుకున్నా ప్రస్తుత పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తున్నాయా అంటే గ్రౌండ్ లెవల్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. కానీ పవర్‌లోకి వస్తాం, కేసీఆర్‌ను గద్దె దించుతామంటున్న కాంగ్రెస్ పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే నూటొక్క ప్రశ్నలు నూరి పోసుకుంటున్నాయి.
నాటి నుంచి..
2004 నుంచి 2014 వరకు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. సోనియమ్మనే తెలంగాణ ఇచ్చింది.. రాష్ట్రంలో అధికారం సాధించి అమ్మకు గిఫ్ట్ ఇద్దామని నేతలంతా ఢిల్లీకి వినపడేలా హైలైట్ స్పీచ్‌లు ఇచ్చారు. కానీ అదే సమయంలో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందామని కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపుతో టీఆర్ఎస్ 63 సీట్లు సాధించింది. కాంగ్రెస్ మాత్రం 23 సీట్లకే పరిమితమై నాలుగేళ్లు నానా కష్టాలు పడింది. మళ్లీ 2018లో అధికారం తమదే అంటూ టీడీపీతో కూటమి కట్టి 18 సీట్లకే పరిమితమై.. చివరకు కేసీఆర్ విసిరిన ఆపరేషన్ ఆకర్ష్‌కు 12 సీట్లను పోగొట్టుకుంది. దీనికి తోడు పీసీసీ చీఫ్‌ను మారుస్తున్నారు.. అదిగో ఆయనే కొత్త బాస్ అంటూ ఏవర్గానికి ఆ వర్గం ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో పదవులకు పోటీపడి పార్టీని పాతాళానికి తొక్కేలా వ్యవహరించారు కొందరు నేతలు.
బీజేపీ దూకుడు..
2014లో ఒక్క ఎంపీ స్థానం గెలిచిన బీజేపీ.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి 4 స్థానాలు గెలిచి రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనేట్లుగా దూసుకెళ్తోంది. అందుకు ఉదాహరణే నిన్న దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక. కొందరు టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని లెక్కలు వేసి, మరికొందరు బీజేపీదే దుబ్బాక అని బయటకు చెప్పుకుంటున్నప్పటికీ 2023లో అధికారంలోకి వస్తామని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం దుబ్బాకలో మూడో ప్లేస్‌కు పరిమితమవుతోందన్న ప్రచారాన్ని గ్రహించలేకపోతోంది. ముందుగా మురిసినమ్మ పండగ ఎరగదన్నట్టుగా.. ఎన్నికల ముందు హడావుడి చేసి ఎన్నికల్లో చేతులెత్తేయడం గత ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీకే చెల్లుతోంది. వీటన్నింటికి తోడు పార్టీలో కొత్త, పాత కలయిక.. ఒలపట, దాపట మాదిరిగా మారి.. గ్రూపులు కట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారం పార్టీ అధినాయత్వంతో పాటు సామాన్య కార్యకర్తలకు సైతం అర్థమవుతోంది. పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న ఉత్తమ్ సైతం అసంతృప్తిగా ఉండటం, హైకమాండ్ డేర్ చేసి.. పీసీసీ పీఠం ఎవరికో ఒకరికి అప్పజెప్పి.. అధికారం కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్లాలని చెప్పకపోవడంతో క్యాడర్ చేయి జారి పోయి కారు, కమలం పార్టీలోకి కార్యకర్తలు ఎంట్రీ ఇస్తున్నారు.
గందరగోళం..
వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీలో దూకుడుగా మాట్లాడినప్పుడు పీసీసీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుండటంతో సొంత పార్టీ నేతలే విమర్శలకు ఎక్కుపెట్టడం పార్టీని ముందుకు.. వెనక్కు.. వెళ్లలేని సిచ్యుయేషన్‌కు దారి తీస్తున్నది. అటు పార్టీ ప్రచార సారథి విజయశాంతి సైతం బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు వస్తున్న తరుణంలో పార్టీలో కొంత గందరగోళం క్రియేట్ అవుతోంది. జాతీయ నాయకత్వంలో కూడా మార్పులు చేయాలని పలువురు అగ్రనేతలు లేఖ రాయడం, వారిపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. సమస్యల సుడిగుండంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2023 వరకు మళ్లీ బలంగా ఎదిగి మునుపటి చరిష్మాను ప్రదర్శిస్తుందా.. అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అంత సీనుందా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.