హుజురాబాద్‌లో టీపీసీసీ వ్యూహం? ఈటలతో చేతులు కలిపారా..?

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం టీపీసీసీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రధాన చర్చకెక్కింది. అందరినీ పక్కనపెట్టి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్‌కు టికెట్​ ఇవ్వడంపై సొంత పార్టీలోని అసంతృప్తివాదులకు రేవంత్​పై సాకు ఇచ్చినట్లుగా మారింది. దీనిపై సీనియర్లు కత్తులు నూరుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కొండా సురేఖ అక్కడి టికెట్​ అడిగితే.. స్థానికేతరాలు అనే కారణాన్ని చూపిస్తూ కొట్టిపారేసిన పార్టీ.. మళ్లీ అదే తప్పు చేసింది. నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని బల్మూరి […]

Update: 2021-10-10 01:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​ ఉప ఎన్నిక కోసం టీపీసీసీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రధాన చర్చకెక్కింది. అందరినీ పక్కనపెట్టి స్థానికేతరుడైన బల్మూరి వెంకట్‌కు టికెట్​ ఇవ్వడంపై సొంత పార్టీలోని అసంతృప్తివాదులకు రేవంత్​పై సాకు ఇచ్చినట్లుగా మారింది. దీనిపై సీనియర్లు కత్తులు నూరుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కొండా సురేఖ అక్కడి టికెట్​ అడిగితే.. స్థానికేతరాలు అనే కారణాన్ని చూపిస్తూ కొట్టిపారేసిన పార్టీ.. మళ్లీ అదే తప్పు చేసింది. నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని బల్మూరి వెంకట్‌ను ఎందుకు అనూహ్యంగా తెరపైకి తీసుకువచ్చారనేది ఇప్పుడు హాట్​ టాపిక్​. అయితే ఈటల రాజేందర్‌కు లాభం చేసేందుకే వెంకట్‌ను బరిలోకి దింపారనే చర్చ కూడా సాగుతోంది. తాజాగా రేవంత్​, ఈటల మధ్య హుజురాబాద్​ కాంగ్రెస్​ టికెట్​ విషయంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కౌశిక్​రెడ్డి ఆరోపించడంతో.. కొత్త ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఈటల రాజేందర్​ కూడా తప్పు చేశారని, కాంగ్రెస్​ పార్టీ నుంచి వీక్​ అభ్యర్థిని బరిలోకి దింపడంలో ఈటలకే ప్రమాదమనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మొన్నటి వరకు హుజురాబాద్‌లో కాంగ్రెస్​ పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ అఖిలపక్షాన్ని సమావేశపరిచి, గాంధీభవన్‌కు పిలిపించి మాట్లాడిన పార్టీ నేతలు.. ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్​ అయ్యారు. అంతేకాకుండా అఖిలపక్షంలోని పలు పార్టీలు ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఉంటున్నాయి.

ఎందుకిలా మారింది..?

హుజురాబాద్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ పార్టీ ముందు నుంచీ వెనక పడింది. దీనిపై ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహా ఒక బృందంగా ముందు నుంచీ అభ్యర్థి కోసం వెతికింది. అనంతరం టీపీసీసీ చీఫ్​ రేవంత్​ ఆధ్వర్యంలోని కమిటీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మరో కమిటీని నియమించింది. ఈ రెండు కమిటీలు వేర్వేరుగానే అభ్యర్థిని వెతికారు. అయితే ఇక్కడి నుంచి పోటీ కోసం ఎవరెవరు ఉత్సాహంగా ఉన్నారంటూ ఆహ్వానించడంతో 19 మంది నేతలు దరఖాస్తులిచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి కొండా సురేఖ ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపించారు. సామాజికవర్గాల వారీగా గెలిచే అవకాశాలుంటాయని సైతం ఆశపడ్డారు. ముందుగా టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కూడా అండగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కరీంనగర్​ జిల్లాతో పాటు హుజురాబాద్​ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సురేఖ వైపే మొగ్గు చూపించారు. కానీ బై ఎలక్షన్స్​కు నోటిఫికేషన్​ విడుదలైన నేపథ్యంలో అనూహ్యంగా పరిస్థితి మొత్తం మారిపోయింది. అప్పటి వరకు కనీసం టికెట్​ కూడా ఆశించినట్లుగా పేరు లేని ఎన్​ఎస్​యూఐ, పెద్దపల్లి జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్​ పేరు తెరపైకి వచ్చింది. తెరపైకి వచ్చిన ఒక్క రోజులోనే ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఉన్నఫళంగా వెంకట్​ పేరును ఎందుకు తెచ్చినట్లు అనే అంశం ఇప్పటికీ పార్టీ నేతలకు అంతుచిక్కని విషయమే. అయితే అప్పటి వరకు స్థానిక నేతలు కావాలంటూ నివేదికల మీద నివేదికలు సమర్పించిన దామోదర బృందం, సీఎల్పీ భట్టి కమిటీ కూడా ఒక్కసారిగా నోటికి తాళం వేసుకున్నాయి.

రేవంత్​ వ్యూహమేనా..?

ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. టీపీసీసీ అంశంలో అడపాదడపా అగ్గి మండుతున్న సీనియర్లు.. దీన్ని మంచి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు. రేవంత్​రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా ఒక వర్గంతో వ్యూహాత్మక ప్రచారం చేపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బల్మూరి వెంకట్‌ను రేవంత్​రెడ్డి తెరపైకి తీసుకువచ్చారంటున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీ పెద్దలతో వెంకట్​ పెద్దపల్లి టికెట్​ కోసం విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇంచార్జీగా ఉన్నారు. టీడీపీ నుంచి విజయరమణారావు.. రేవంత్​ వెంట ఉండగా.. ఆయనతో పాటుగానే కాంగ్రెస్‌లో చేరారు. అయితే బల్మూరి వెంకట్​ పెద్దపల్లి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్న దరిమిలా.. అక్కడ విజయరమణారావుకు పోటీ లేకుండా చేసేందుకు వెంకట్‌ను హుజురాబాద్‌కు పంపించారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ముందు నుంచి కూడా ఈటల రాజేందర్​పై రేవంత్​రెడ్డి సానుకూలంగా ఉన్నారు. భూ ఆరోపణల్లో ఒక విధంగా ఈటలకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఆయనకు ఎంతో కొంత అనుకూలంగా ఉండేందుకు ఎన్నికల్లో బలహీనమైన వెంకట్‌ను రంగంలోకి దింపారని గాంధీభవన్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అటు పెద్దపల్లి స్థానాన్ని విజయరమణారావుకు క్లియర్​ చేయడంతో పాటుగా ఇక్కడ ఈటలకు కూడా మద్దతుగా ఉంటుందని రేవంత్​ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆ పార్టీ నేతలే చెప్పుతున్నారు.

అఖిలపక్షం మౌనమెందుకో..?

ఇలాంటి ప్రచారాలకు తోడుగా వారం పది రోజుల కిందట వరకు కాంగ్రెస్‌కు హుజురాబాద్‌లో మద్దతు ఉంటామనే తీరుతో వ్యవహరించి అఖిలపక్ష పార్టీలు ఒక్కసారిగా ఎవరిదారి వారిదే అన్నట్టుగా మారాయి. నిరుద్యోగుల జంగ్​ సైరన్, పోడు భూములపై నిరసన కోసం సమావేశం అంటూ గాంధీభవన్‌కు పిలిపించి హుజురాబాద్‌లో మద్దతు ఇవ్వాలని చర్చించిన విషయం తెలిసిందే. దీనిపై సీపీఐ నేత చాడా వెంకట్​రెడ్డి కూడా ప్రకటించారు. మద్దతుపై పార్టీలో చర్చిస్తామన్నారు. కానీ అనూహ్యంగా అఖిలపక్షం మౌనంగా ఉంటోంది. అఖిలపక్షంలోని టీజేఎస్​, ఇంటిపార్టీతో పాటు పలు పార్టీలు ఈటల రాజేందర్‌కు మద్దతుగా తమ వర్గాలను హుజురాబాద్‌కు తరలించాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా మద్దతు కావాలంటూ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్​ కూడా మళ్లీ ఆ మాటే ఎత్తడం లేదు.

Tags:    

Similar News