మోడీని చూసి గర్విస్తున్నా.. కాంగ్రెస్ కీలక నేత ప్రశంసలు
జమ్ము: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన తన మూలాలను మరిచిపోలేదని అన్నారు. తనను తాను గర్వంగా ‘చాయ్‌వాలా’ అని సంబోధించుకుంటారని తెలిపారు. తన వాస్తవ జీవితాన్ని ఎప్పుడూ దాచుకోరని అన్నారు. ప్రజలు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీతో తనకు రాజకీయపరమైన తేడాలున్నప్పటికీ వ్యక్తిగా ఆయనను గౌరవిస్తానని జమ్ములో నిర్వహించిన ఓ […]
జమ్ము: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన తన మూలాలను మరిచిపోలేదని అన్నారు. తనను తాను గర్వంగా ‘చాయ్‌వాలా’ అని సంబోధించుకుంటారని తెలిపారు. తన వాస్తవ జీవితాన్ని ఎప్పుడూ దాచుకోరని అన్నారు. ప్రజలు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీతో తనకు రాజకీయపరమైన తేడాలున్నప్పటికీ వ్యక్తిగా ఆయనను గౌరవిస్తానని జమ్ములో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆజాద్ మాట్లాడుతూ.. పేర్కొన్నారు. మోడీ నేల విడిచి సాము చేసే రకం కాదని వివరించారు. రాజకీయ నేతలూ పరిధి విధించుకుని అందులోనే ఉండపోరాదని హెచ్చరించారు.
అంతేకాదు, తనకు, నరేంద్ర మోడీకి మధ్యగల సారూప్యతను ప్రస్తావించారు. తాను ఒక మారుమూల గ్రామం నుంచి రాజకీయ నేతగా ఎదిగారని, 5స్టార్, 7 స్టార్ హోటళ్లలో బసచేశారని అన్నారు. కానీ, తన మూలాలను ఎప్పుడూ మరిచిపోలేదని, తన గ్రామస్తుల పక్కన కూర్చున్నప్పుడు ఉండే పరిమళాన్ని ఆస్వాదిస్తారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఒక గ్రామం నుంచే వచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు ఒక రోజు ముందే జీ-23 నేతలు జమ్ము కశ్మీర్‌లో సమావేశమై కాంగ్రెస్ దుస్థితిపై ఆందోళనపడ్డ సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతున్నదని, తామంత పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ రిటైర్‌మెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కన్నీరుపెట్టుకున్న విషయం విదితమే. వీడ్కోలు ప్రసంగంలో ఆజాద్‌పై ప్రశంసలు కురిపించారు. సెల్యూట్ కూడా చేశారు. తాజాగా నరేంద్రమోడీని ఆజాద్ పొగడటం గమనార్హం.