కుడా పీవో అక్రమాలపై విచారణ జరిపించాలి.. బక్క జడ్సన్ డిమాండ్
దిశ ప్రతినిధి, వరంగల్: కుడా పీవో అజిత్‌రెడ్డి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘకాలంగా కుడా పీవోగా అజిత్‌రెడ్డిని కొనసాగిస్తుండటంపై వివరణ ఇవ్వాలని, మంత్రి కేటీఆర్ ప్రోద్భలంతోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుంటూ పీవో పోస్టును కాపాడుకుంటున్న అజిత్‌రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా.. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. కుడా పీవో అజిత్‌రెడ్డిపై చేసిన నిర్దిష్ట ఆరోపణలకు […]
దిశ ప్రతినిధి, వరంగల్: కుడా పీవో అజిత్‌రెడ్డి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘకాలంగా కుడా పీవోగా అజిత్‌రెడ్డిని కొనసాగిస్తుండటంపై వివరణ ఇవ్వాలని, మంత్రి కేటీఆర్ ప్రోద్భలంతోనే ఇది జరుగుతోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుంటూ పీవో పోస్టును కాపాడుకుంటున్న అజిత్‌రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా.. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. కుడా పీవో అజిత్‌రెడ్డిపై చేసిన నిర్దిష్ట ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని, దీనిపై కుడా కార్యాలయం ఎదుట ఈనెల 1న అధికారులు, ప్రజాప్రతినిధులు దమ్ముంటే చర్చకు రావాలని మంగళవారం జడ్సన్ పిలుపునిచ్చారు. అయితే జడ్సన్ సవాల్‌కు అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించలేదు. కాంగ్రెస్ శ్రేణులతో కలసి బుధవారం జడ్సన్ కుడా కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జడ్సన్ మీడియాతో మాట్లాడారు. కుడా అవినీతి అధికారిపై ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు, డైరెక్టర్ మరియు కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ కె.విద్యాధర్ రావుకు కూడా వినతిపత్రం అందజేసినట్లుగా తెలిపారు. కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పీవో అజిత్ రెడ్డిలు టీఆర్ఎస్ నేతలకు, వారి బినామీలకు అక్రమంగా లే అవుట్ అనుమతులు జారీ చేసినట్లు ఆరోపించారు. కూడ కాంప్లెక్స్ వేలం పాటలో, నగరంలో జరిగిన సుందరీకరణ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, అన్నింట్లోనూ పీవో, చైర్మన్ మర్రియాదవరెడ్డికి, మంత్రి కేటీఆర్‌కు భాగస్వామ్యం ఉందనిఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పీవో అజిత్‌రెడ్డిని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశమిస్తోందని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారిని కాపాడేందుకు వరంగల్ నుంచి ప్రగతి భవన్ వరకు యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని ఆరోపించారు. కుడా పీవోను వెంటనే విధులను తప్పించాలని డిమాండ్ చేశారు. కుడాలో జరిగిన అవినీతి, అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలని, అంత వరకు కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. కుడా కార్యాలయం ఎదుట దాదాపు అర్ధగంటసేపు ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి హన్మకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.