సాగర్ పోరుపై కాంగ్రెస్ సీరియస్.. రంగంలోకి రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఆఖరి ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డి ముందుగా గెలుస్తారని ప్రచారం జరిగినా పరిస్థితులు మారుతూ వస్తున్నట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రచారంతో పాటుగా పలువురు కీలక నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను అక్కడే మోహరించింది. ఈ నెల 14న సీఎం కేసీఆర్ కూడా సభను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఆఖరి ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జానారెడ్డి ముందుగా గెలుస్తారని ప్రచారం జరిగినా పరిస్థితులు మారుతూ వస్తున్నట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ప్రచారంతో పాటుగా పలువురు కీలక నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను అక్కడే మోహరించింది. ఈ నెల 14న సీఎం కేసీఆర్ కూడా సభను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు కొంతమంది నేతలతోనే సాగిస్తున్న ప్రచారానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా రావాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత మేరకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.
ఆ వారం రోజులు సీరియస్
సాగర్ ప్రచారంలో ఈ వారం రోజులు హస్తం నేతలు సాగర్‌కు వెళ్లాలని పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా పిలుపునిచ్చారు. రెండు రోజుల కిందట పార్టీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు నుంచే ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారంలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం నేటి నుంచి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ప్రచారానికి వెళ్తున్నారు. జానారెడ్డికి మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తారా… లేదా అనేది ఇప్పటి వరకు సందేహంగానే ఉండేది. కానీ ఆయన ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొవిడ్ పాజిటివ్‌తో దాదాపు 20 రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఆయన నేటి నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారు. రేవంత్ ప్రచారం చేస్తే కొంత కలిసి వస్తుందని భావిస్తున్నారు. రేవంత్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా సాగర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.