కలిసివస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ అంశాలతో సర్కారుపై పోరు
దిశ, న్యూస్ బ్యూరో : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. సర్కారుపై వస్తున్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణతో రూపొందించుకుంటున్నారు. కొన్ని నెలల కిందట వరకు ప్రజా సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉన్న పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం అంటూ ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంటోంది. మొన్నటి వరకు ఒక నేత పిలుపునిస్తే మరో నేత తప్పించుకుని తిరిగే కాంగ్రెస్ పార్టీలో అంతా కలిసి […]
దిశ, న్యూస్ బ్యూరో : ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. సర్కారుపై వస్తున్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణతో రూపొందించుకుంటున్నారు. కొన్ని నెలల కిందట వరకు ప్రజా సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉన్న పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం అంటూ ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంటోంది. మొన్నటి వరకు ఒక నేత పిలుపునిస్తే మరో నేత తప్పించుకుని తిరిగే కాంగ్రెస్ పార్టీలో అంతా కలిసి వస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్న ప్రతిపక్ష నేతలు ఇదే సమయంగా అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కలిసి వస్తున్న అంశాలన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకుని అధికార పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రుల టార్గెట్‌గా విమర్శలకు దిగుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాల్సిన సమస్యలే లేవని, ఆ పార్టీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే అవకాశమే లేదంటూ సీఎం కేసీఆర్ పదేపదే తిట్టిపోస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న ప్రాజెక్టుల అంశం, పార్టీ నేతల కబ్జాలు, దాడులు, ప్రాజెక్టుల పనులు, పడకేసిన పాలన వంటి అంశాలు ప్రభుత్వంపై పోరుకు ఉసిగొల్పుతున్నాయి.
ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది
టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లు చెప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిపై క్షేత్రస్థాయి నుంచి ఒక అంతర్గత సర్వే చేసినట్లు నేతలు వెల్లడించారు. ఈ సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందని, ఈ సమయంలో పార్టీ నేతలు వేర్వేరు కుంపట్లు మాని ప్రజల్లోకి వెళ్లాలని చర్చించుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్‌ను మారుస్తారని ప్రచారం జరిగుతుండటంతో… పార్టీ నేతలు తమ బల నిరూపణ, ప్రభుత్వంపై వ్యతిరేకతను వెల్లడించే కార్యక్రమాలు వరుసగా చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా రాష్ట్రాల వారీగా పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై వివరాలు సేకరిస్తుందని, ఈ నేపథ్యంలో నేతలంతా కలిసికట్టుగా పని చేస్తేనే వచ్చే రోజుల్లో పార్టీకి బలం పెరుగుతుందని, తద్వారా తమకు కూడా కలిసి వస్తుందని జోరు పెంచినట్లు చెప్పుకుంటున్నారు.
అధికార పార్టీ భూ కబ్జాలపై నజర్
ఇటీవల గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు అధికార పార్టీ నేతల భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఎదురుదాడులు పెరిగిపోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని పోలీసు చర్యలతో అడ్డుకోవడం, పోలీసులతో చావగొట్టించడం, కేసులు పెట్టించడం వంటి వాటిపై కాంగ్రెస్ నేతలు ప్రధానాస్త్రాలుగా తీసుకుంటోంది. టీఆర్స్ నేతల భూకబ్జాలు పెరిగినట్లు విమర్శలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఏకంగా దాడులకు దిగుతున్నారు. భూకబ్జాదారులకు పార్టీ అండగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. మరోవైపు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార విభాగాలు పని చేయకపోవడం, కరోనా పరిస్థితుల్లో 50 శాతం మేరకు ఉద్యోగులు పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఉండకపోవడం, మొత్తంగా పాలన పడకేసిన అంశాలను కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మల్చుకునేందుకు తాపత్రయం పడుతోంది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రగతి భవన్ కాదంటూ ఫాంహౌస్‌కు ఎక్కువ రోజులు పరిమితం కావడం, ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన పనులేమీ కాకుండా ప్రతి పని పెండింగ్ పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని నేతలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొండపోచమ్మ సాగర్ కాల్వలు తెగడం, కరోనా నియంత్రణలో సర్కారు విఫలం, ప్రాజెక్టులపై పోరుబాట, ధరల నియంత్రణతో పాటు రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సచివాలయం కూల్చివేత అంశాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా స్పీకప్ తెలంగాణ పేరిట స్పెషల్ ప్రోగ్రాంకు రూపకల్పన చేసుకున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుని టీఆర్ఎస్ పాలనపై పోరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రాజెక్టులపై పట్టుకున్నారు
తెలంగాణలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశంగా భావిస్తోంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నాయి. జల వివాదాల్లో భాగంగా కృష్ణా, గోదావరి బోర్డులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. ఇదే సమయంలో ఇవన్నీ పాత ప్రాజెక్టులేనని, వాటిని రీ డిజైనింగ్ చేసినట్లు ప్రభుత్వమే ఒప్పుకుంది. లిఖితపూర్వకంగా బోర్డులకు వివరించింది. ఓ వైపు బాహుబలి వంటి ప్రాజెక్టును దేశంలో ఎక్కడా నిర్మించలేదని, కేవలం మూడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ ఓ ఇంజనీర్‌లా మారి దీన్ని పూర్తి చేశాడని, గోదావరి జలాలను వినియోగించుకుంటున్నామని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలైనా, పార్టీ మీటింగైనా… సభ ఏదైనా ఎక్కడైనా కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చటే ప్రధానం. ఇలా తామే నిర్మించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం డీపీఆర్‌లు ఇచ్చే సమయానికి మాత్రం ఇది పాత ప్రాజెక్టేనని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామంటూ చెప్పుతున్నది. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పాతవేనని టీఆర్ఎస్ నేతలు బోర్డులు, కేంద్రానికి నివేదికలిచ్చారు. ఏపీ ప్రభుత్వం కనీసం మూడు ప్రాజెక్టులైనా కొత్తవని చెప్పుతున్నా… తెలంగాణ మాత్రం అన్ని పాతవేనని వెల్లడించింది. ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశంగా మారింది. ఇప్పుడు వాటిని తమ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తి చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రచారం చేస్తోంది. అదేవిధంగా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ కాల్వలు తెగిపోవడంపై పార్టీ నేతలు ఒక్కతాటిపైకి వచ్చి ఎదురుదాడి చేశారు. మరోవైపు ప్రాజెక్టుల బాట పట్టారు. పార్టీలోని ప్రధాన నేతలందరూ తలా ఓ ప్రాజెక్టు దగ్గర నిరసనకు దిగారు. ఆర్టీఎస్ నుంచి గోదావరిపై దేవాదుల దాకా కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంపై కాగ్రెస్ పార్టీ జలదీక్ష కార్యక్రమాలను తీసుకుంది. దీనికి ఒక్కో నేత ప్రాతినిద్యం వహించారు. దీనిపై ప్రభుత్వం జులుం ప్రదర్శించినా ప్రాజెక్టుల దగ్గర దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు చేశాయి.
సచివాలయంపై కూడా
రాష్ట్ర సచివాలయాన్ని కూల్చి వేసే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకుంటోంది. పార్టీ నేతలు రోజుకో కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 133 ఏండ్ల చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చివేయడంపై నిరసనలు చేసింది. ఇక కరోనా పరిస్థితులు కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చినట్లే అయ్యాయి. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం, టెస్టులు సరిగా చేయించకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన చికిత్స లేకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ లేకపోవడం వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీ ఆందోళనలకు దిగుతోంది. పార్టీ నేతలు కలిసికట్టుగా దీనిపై నిరసనలు, ప్రజల తరుపున ఉంటున్నారు. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో 13 రోజులుగా సీఎం కేసీఆర్ అందుబాటులో లేని వైనంపై కాంగ్రెస్ పార్టీ అవకాశంగా తీసుకుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఒకింత సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు. రెండు నెలల కిందట వరకు వేర్వేరుగా ఉండే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ భట్టీ, ఎంపీలు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు వంటి నేతలంతా ప్రభుత్వంపై పోరుకు కలిసి వస్తున్నారు. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి కూడా పోరుకు దిగుతున్నారు. కరోనాపై మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో కమిటీని కూడా వేసుకున్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులే చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని పార్టీ నేతలు ఏకతాటిపైకి వస్తున్నారని సీనియర్లు చెప్పుతున్నారు.