వడ్ల కొనుగోలుపై పార్టీల పొలిటికల్ డ్రామా.. ధర్నాల పేరుతో టైమ్ పాస్.?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు సరికొత్త రూపం తీసుకున్నది. రైతుల చుట్టూ రాజకీయం నడుస్తున్నది. వరి సాగు చేయవద్దని టీఆర్ఎస్ చెబుతుంటే.. వరి మాత్రమే సాగు చేయాలని బీజేపీ అంటున్నది. ఐదేళ్ళకు సరిపోయే ధాన్యపు నిల్వలు ఉన్నందున ఇకపైన యాసంగిలో వరి ధాన్యం కొనబోమని ఎఫ్‌సీఐ తెలిపింది. వరిని సాగుచేయడమా? లేక విరమించుకోవడమా అని రైతులు తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. చేతిలో రెడీగా […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు సరికొత్త రూపం తీసుకున్నది. రైతుల చుట్టూ రాజకీయం నడుస్తున్నది. వరి సాగు చేయవద్దని టీఆర్ఎస్ చెబుతుంటే.. వరి మాత్రమే సాగు చేయాలని బీజేపీ అంటున్నది. ఐదేళ్ళకు సరిపోయే ధాన్యపు నిల్వలు ఉన్నందున ఇకపైన యాసంగిలో వరి ధాన్యం కొనబోమని ఎఫ్‌సీఐ తెలిపింది. వరిని సాగుచేయడమా? లేక విరమించుకోవడమా అని రైతులు తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు.
చేతిలో రెడీగా ఉన్న పంటను అమ్ముకోలేక, వచ్చే సీజన్‌కు నాట్లు వేసుకోవాలో లేదో తెలియక అన్నదాతలు సతమతమవుతున్నారు. ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు అసమర్ధమైనవేనని, తోడుదొంగలుగా వ్యవహరిస్తూ రైతుల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. గత పది రోజులుగా రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్ళ సంక్షోభం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పుడు చేతికొచ్చిన పంటతో సహా రానున్న యాసంగిలో వచ్చే వడ్లను కొంటుందో కొనదో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ధర్నా చౌక్ దగ్గర గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీక్ష చేపట్టనున్నారు. దీనికి పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీసు వరకు కాంగ్రెస్ పిలుపుతో భారీ ర్యాలీ జరగనున్నది. మరోవైపు బీజేపీ నేతలు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ మాత్రం వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వడంలేదు. వచ్చే యాసంగిలో ఏ పంట వేయాలో చెప్పడంలేదు. ఈ సంక్షోభానికి కారకులెవరు? కేంద్రమా? లేక రాష్ట్రమా?.. ఇదీ రైతుల్ని వేధిస్తున్న ప్రశ్న.
కేంద్రానికి కేసీఆర్ డెడ్‌లైన్..
వచ్చే ఏడాది నుంచి ఏ యాసంగి సీజన్‌కూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ కేంద్రం, ఎఫ్‌సీఐ లిఖితపూర్వకంగా రాష్ట్రానికి తెలియజేశాయి. ఆ ప్రకారం వచ్చే యాసంగి సీజన్‌లో వరి పండించవద్దంటూ రైతులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. వరికి బదులుగా పత్తి, పెసలు, మినుములు, కుసుమ, ఆముదాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఒకవేళ రైసు మిల్లులతో, విత్తన ఉత్పత్తి సంస్థలతో ఒప్పందం ఉన్నట్లయితే ఆ మేరకు రైతులు వరి సాగుచేసుకోవచ్చని, కానీ, విక్రయాల కోసం మాత్రం పండించవద్దని స్పష్టం చేశారు. వచ్చే యాసంగి సీజన్‌కు ఏ పంట పండించాలో చెప్పాలని, వరి పండిస్తే కొంటుందో కొనదో కేంద్రం క్లారిటీ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖ కూడా రాశారు. ఈ నెల 20వ తేదీకల్లా స్పష్టం చేయాలని కోరారు. అప్పటికల్లా సమాధానం రాకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు వచ్చే యాసంగికి వరి మాత్రమే పండించాలంటూ రైతులకు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతుల్ని తప్పుదారి పట్టించే విధంగా పిలుపునిచ్చిన సంజయ్.. రైతులు పండించిన వరి పంటను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేస్తుందనే రాతపూర్వక ఆర్డర్‌ను తీసుకురావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై బండి సంజయ్ ఇంకా బదులివ్వలేదు. ఇంకోవైపు జిల్లాల పర్యటన చేస్తున్న ఆయనను రైతులు వరిసాగుపై నిలదీస్తున్నారు. వరి పండిస్తే కేంద్రమే కొంటుందనే హామీ ఇవ్వాలని అడుగుతున్నారు. బాయిల్డ్ రైస్‌ను కొనేది లేదని, మామూలు బియ్యమైతే కొంటామని ఆయన బదులిచ్చారు. కానీ, రైతులు మాత్రం తాము వరిని పండిస్తారని, బాయిల్డ్ రైస్‌గా మార్చే ప్రక్రియతో తమకు సంబంధంలేదని, సాగు విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రణాళిక లేని సాగు..
ఇకపైన ప్రతీ యాసంగి సీజన్‌కు వరి ధాన్యాన్ని కొనేది లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు ప్రణాళికను ఇప్పటికీ రూపొందించలేదు. వానాకాలం కొనుగోళ్ళు ఒకవైపు జరుగుతుండగానే యాసంగి సీజన్‌కు నాట్లు మొదలయ్యాయి. కానీ, రైతులకు మాత్రం ఏం సాగుచేయాలో తేలియడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం అంటున్నదిగానీ ఏ పంటను ఎన్ని ఎకరాల్లో పండించాలో చెప్పడంలేదు. వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు సైతం రైతులకు అవగాహన కలిగించడంలేదు. కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయడంలేదు. రెండు ప్రభుత్వాలూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో రైతుల సందేహాలకు సమాధానం దొరకడంలేదు. అక్కడా ఇక్కడా ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ నిర్ణయాత్మక పాత్ర పోషించలేకపోతున్నది.