ఆ జాబితాలో సీఎం జగన్ చేరిపోతారనే ఆందోళన.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముస్సోలిని, హిట్లర్, జార్ చక్రవర్తి తరహాలోనే దుర్మార్గుడి జాబితాలో చేరిపోతారని బాధేస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…వైసీపీలోని కొందరు నేతలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని… దాన్ని తాను ఖండిస్తే తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఎప్పుడైనా విలన్, హీరోలందరికీ గుర్తింపు ఉంటుందని…చరిత్రలో జగన్ కూడా గుర్తుండిపోతారంటూ […]

Update: 2021-12-07 07:22 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముస్సోలిని, హిట్లర్, జార్ చక్రవర్తి తరహాలోనే దుర్మార్గుడి జాబితాలో చేరిపోతారని బాధేస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…వైసీపీలోని కొందరు నేతలు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని… దాన్ని తాను ఖండిస్తే తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

సమాజంలో ఎప్పుడైనా విలన్, హీరోలందరికీ గుర్తింపు ఉంటుందని…చరిత్రలో జగన్ కూడా గుర్తుండిపోతారంటూ చమత్కరించారు. రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు.. అంతా గుర్తున్నా వారి వారి చర్యలకు తగ్గట్టు ఎవరికి వారు గుర్తుండిపోయారని అలాగే సీఎం జగన్ దుర్మార్గుడి జాబితాలో గుర్తుండిపోతారేమోన్న ఆందోళన కలుగుతుందన్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైసీపీ ఎంపీలు, నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వైసీపీ ఎంపీలు ఆరోపించడం దురదృష్టకరమన్నారు.

బీజేపీతో అంటకాగిందే వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అనలేదా అని నిలదీశారు. ప్రభుత్వ దాష్టీకాలమీద పోరాటం చేస్తున్నందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. రాజధాని కోసం అమరావతి రైతులు భూములిస్తే.. విశాఖపట్నంలో రాజధానిని తరలిస్తామని వైసీపీ చెప్పడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే అమరావతి నుంచి ఒక్కొక్క కార్యాలయాన్ని తరలిస్తున్నారని రఘురామ ఆరోపించారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతియే ఉండాలని… శాంతియుతంగా అమరావతి, రైతులు ఉద్యమం చేస్తుంటే వారిని అడ్డుకోవడంపై దుర్మార్గమన్నారు.

న్యాయస్థానాలు సైతం పాదయాత్ర చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు చేస్తున్న పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ ఎంపీ రఘురామ నిలదీశారు. మరోవైపు దౌర్జన్యపు సైన్యంలా వాలంటీర్ వ్యవస్థ ఉందంటూ విరుచుకుపడ్డారు. ఈ వైసీపీ ప్రభుత్వం తనపై కక్షసాధింపునకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపులు మెుదలు పెట్టారన్నారు. తాజాగా తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందంటూ ఎంపీ రఘురామ ఆరోపించారు.

Tags:    

Similar News