ప్రభుత్వం మోసం చేసింది.. గాంధీలో నర్సుల ఆందోళన
దిశ, తెలంగాణ బ్యూరో : ఏడాది కాలంగా కరోనా చికిత్సలకు వినియోగించుకుని ఇప్పుడు తమను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రి నర్సులు ఆందోళన చేపట్టారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసుకొని.. ముందస్తు సమాచారం లేకుండా తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇటీవల రెగ్యులర్ ప్రాతిపదికన ప్రభుత్వం 1,640 మంది నర్సులను విధుల్లోకి తీసుకున్నది. వీరి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఏడాది కాలంగా కరోనా చికిత్సలకు వినియోగించుకుని ఇప్పుడు తమను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించారని గాంధీ ఆసుపత్రి నర్సులు ఆందోళన చేపట్టారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసుకొని.. ముందస్తు సమాచారం లేకుండా తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఇటీవల రెగ్యులర్ ప్రాతిపదికన ప్రభుత్వం 1,640 మంది నర్సులను విధుల్లోకి తీసుకున్నది. వీరి స్థానంలో ఇది వరకే ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న వారందరినీ తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపుగా 1,700 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అధికారులు విధులకు అనుమతించలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల్లో నుంచి తొలగించడంపై నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు చేసిన తమను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఆందోళనకు దిగిన నర్సులను అరెస్టు చేశారు. వారిని పలు పోలీస్ స్టేషన్లకు తరలించడం ఉద్రిక్తతకు దారి తీసింది. WE Want Justice, డీఎంఈ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. అరెస్ట్ చేస్తున్న క్రమంలో కొందరు నర్సులు కిందపడిపోవడంతో వారికి గాయాలయ్యాయి.