కారుణ్య నియామకాలపై అధికారుల కాఠిన్యం!
పంచాయతీరాజ్ శాఖలోని ఓ ఉద్యోగి మూడేండ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. ఆయన కొడుకు ఉద్యోగం కోసం ఏడాదిన్నర కిందట దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి మరణానంతరం తల్లి కూడా మంచం పట్టింది. వైద్యం కోసమే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కారుణ్య నియామకాల కింద చేసుకున్న దరఖాస్తుకు మోక్షం లభించడం లేదు. స్టాండింగ్ కమిటీ సమావేశం కాలేదంటూ సమాధానమిస్తున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఏడాదిన్నర నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికే దాదాపు లక్షన్నర ఖర్చు పెట్టుకున్నాడు. ఉద్యోగం మాత్రం […]
పంచాయతీరాజ్ శాఖలోని ఓ ఉద్యోగి మూడేండ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. ఆయన కొడుకు ఉద్యోగం కోసం ఏడాదిన్నర కిందట దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి మరణానంతరం తల్లి కూడా మంచం పట్టింది. వైద్యం కోసమే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కారుణ్య నియామకాల కింద చేసుకున్న దరఖాస్తుకు మోక్షం లభించడం లేదు. స్టాండింగ్ కమిటీ సమావేశం కాలేదంటూ సమాధానమిస్తున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఏడాదిన్నర నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికే దాదాపు లక్షన్నర ఖర్చు పెట్టుకున్నాడు. ఉద్యోగం మాత్రం రాలేదు.
నల్గొండ జిల్లాకు చెందిన ఒకరు వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తూ ఇంకా 20 ఏండ్ల సర్వీసు ఉండగానే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ముగ్గురూ కూతుళ్లే కావడంతో చిన్న కూతురు ఉద్యోగం కోసం ఏడాది కిందట దరఖాస్తు పెట్టుకుంది. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆర్థిక కష్టాల్లో బతుకులీడుస్తున్నారు. సదరు దరఖాస్తుదారు కూడా ఓ అధికారి చేతిలో దాదాపు లక్ష వరకు పెట్టింది. నియామకపత్రం మాత్రం రావడం లేదు.
“ఇప్పటి వరకు ఏదో జరిగింది. ఇక నుంచి అలా జరుగడానికి వీలు లేదు. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం దురదృష్టకరం. వాళ్ల ఉద్యోగం వాళ్లకు ఇచ్చేందుకు ఎందుకు తిప్పుకోవాలి. అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలి. దరఖాస్తు చేసుకున్న పది రోజులలోగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నాం. ఇక నుంచి కేవలం పది రోజుల్లోనే వారసులకు ఉద్యోగం వస్తుంది” -డిసెంబర్ 26, 2016న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన.
దిశ, తెలంగాణ బ్యూరో: వాస్తవానికి కారుణ్య నియామకాలకు సంబంధించి 1977 అక్టోబరు 3వ తేదీనే సమైక్య రాష్ట్రంలో స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సరైన స్ఫూర్తితో అమలు కావడంలేదు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు తమలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ ఏళ్ల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగిన సందర్భాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కారుణ్య నియామకాలలో అధికారుల కాఠిన్యం బయటపడుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఖాళీల సంఖ్య తేలలేదు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. కారుణ్య నియామకాల ప్రక్రియ కూడా ఆగిపోయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించారు. వారి కుటుంబాలలో అర్హులైన వారసులు ఉద్యోగాలు పొందేందుకు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులు, ఖాళీల సంఖ్య తేలకపోవడం, సంబంధిత కమిటీ ఏర్పాటు జరగకపోవడంతో కారుణ్య నియామకాల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఫిబ్రవరి 10న కారుణ్య నియామకాలపై కమిటీని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయినా ఫైళ్లు ముందుకు కదల్లేదు. 2016లో మరోసారి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులకు అధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర స్థాయిలో స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్‌పర్సన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రెటరీ, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీఏడీ సెక్రెటరీ, న్యాయశాఖ సెక్రెటరీ సభ్యులుగా, జీఏడీ డిప్యూటీ సెక్రెటరీ కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు.
నెలకు రెండుసార్లు సమావేశం కావాల్సిందే
కారుణ్య నియామకాల అంశంతో పాటు ఉద్యోగుల వైద్య అవసరాలకు అయిన ఖర్చు రీయింబర్స్మెంట్, కొన్ని నిబంధనల సడలింపు లాంటి అంశాల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆ జీవో స్పష్టం చేసింది. ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటివరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన సిఫారసులు చేసి సంబంధిత విభాగాలకు, శాఖలకు ఈ కమిటీ పంపిస్తుంది. ఏవైనా సవరణలు చేయాల్సి ఉంటే తదుపరి సమావేశం నాటికి నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందించడం ఆనవాయితీ. కానీ స్టాండింగ్ కమిటీ ఆ జీవో స్ఫూర్తి మేరకు సమావేశాలు నిర్వహించడం లేదు.
ఏడు నెలలుగా స్టాండింగ్ కమిటీ లేదు
ఎన్ని ఉత్తర్వులు జారీచేసినా కారుణ్య నియామకాల్లో పాత కథే పునరావృతమైంది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా జీఏడీ నియమించింది. అప్పటికే వేలాది ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది జూన్‌లో అజయ్‌మిశ్రా రిటైరయ్యారు. అప్పటి నుంచి స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరగనే లేదు. కమిటీ ఉనికిలో ఉందా లేదా అనేది అనుమానమూ తలెత్తుతున్నాయి. చివరిసారిగా గతేడాది జూన్ 26న కమిటీ సమావేశమైంది. అప్పటికి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు క్లియర్ కాలేదు. మరోవైపు జీఏడీలోని సర్వీసెస్ సెక్రెటరీ పోస్టు 2014 నుంచి ఖాళీగానే ఉంది. ఇన్చార్జి అధికారులే అదనపు బాధ్యతలుగా పర్యవేక్షిస్తున్నారు.
ఎందుకింత కాఠిన్యం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో సాధారణ నియామకాలపై నిషేధం ఉన్నా కారుణ్య నియామకాలకు మాత్రం మినహాయింపు ఉంది. ఒకవేళ కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు సాధ్యంకాని పక్షంలో నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షలు, నాన్ గెజిటెడ్ స్థాయికి రూ.8 లక్షలు, గెజిటెడ్ స్థాయికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాల్సి ఉంటోంది. కానీ కారణాలేమైనా రాష్ట్రంలో ఏదీ అమలు కావడం లేదు.
బాధితుల ఆవేదన ఇది
కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి నుంచి కూడా సిబ్బంది, అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫైల్ మూవ్మెంట్ చెప్పుతామని, ఎప్పుడు సార్లను కలువాలో సమాచారమిస్తామంటూ వసూలు చేస్తున్నారు. ఉద్యోగం కోసం కార్యాలయాలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని, అంతో ఇంతో చేతుల్లో పెడితేనే సమాచారమిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులకు కూడా ముట్టజెప్పుకోవాల్సి వస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి.