లాక్‌డౌన్‌లో సామాన్యులపై ఎక్స్ ట్రా భారం

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ కారణంగా అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు పనుల్లేక పస్తులుంటుంటే మరికొందరు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. కుటుంబ పోషణ కూడా భారమై ఆర్థికంగా చితికిపోతున్నారు పేదలు. అలాంటి వారిపై వ్యాపారులు లాక్ డౌన్ సమయంలో అదనపు భారాన్ని వేస్తూ మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి విక్రయాలు చేపడుతున్నారు. రూ.10 ఉండే వస్తువును సడలింపు సమయం దాటగానే రూ.15 నుంచి రూ.20కి పెంచి సామాన్యులను దండుకుంటున్నారు. మంచినీళ్ల నుంచి […]

Update: 2021-06-07 13:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ కారణంగా అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు పనుల్లేక పస్తులుంటుంటే మరికొందరు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. కుటుంబ పోషణ కూడా భారమై ఆర్థికంగా చితికిపోతున్నారు పేదలు. అలాంటి వారిపై వ్యాపారులు లాక్ డౌన్ సమయంలో అదనపు భారాన్ని వేస్తూ మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి విక్రయాలు చేపడుతున్నారు. రూ.10 ఉండే వస్తువును సడలింపు సమయం దాటగానే రూ.15 నుంచి రూ.20కి పెంచి సామాన్యులను దండుకుంటున్నారు. మంచినీళ్ల నుంచి వాహనాల ఇంజిన్ ఆయిల్ దాకా ప్రతి వస్తువు ధరను 5 శాతం నుంచి 30 శాతానికి పైగా పెంచేశారు. లాక్ డౌన్ సమయంలోనూ కొన్ని వ్యాపార సంస్థల బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

మంచి నీళ్ల ధరలు కూడా పెంపు

లాక్ డౌన్ సడలింపు సమయం దాటితే చాలు ధరలు రెక్కల గుర్రాలుగా మారుతున్నాయి. మంచినీళ్లపై కూడా ధరలు పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. సాధారణంగా 20 లీటర్ల మంచినీళ్ల క్యాన్ ధర ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. అయితే కొన్ని ఏరియాల్లో ఒక క్యాన్ ధర మామూలు సమయంలో రూ.20 ఉంటే లాక్ డౌన్ సడలింపు సమయం అనంతరం ఆ ధరను రూ.25 నుంచి రూ.30కి పెంచెస్తూ విక్రయాలు చేపడుతున్నారు పలువురు వ్యాపారులు. ఇవే కాకుండా నిత్యావసర వస్తువులపై కూడా ఇదే బాదుడును కొనసాగిస్తున్నారు. పాల నుంచి పప్పుల వరకు ఇదే పనిగా ధరలు వ్యాపారులు పెంచేస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ ఇదే బాదుడు కొనసాగుతోంది.

అన్నింటిపై బాదుడే..

లాక్ డౌన్ కారణంగా సరుకు రవాణా చార్జీలు, ఇతరత్రా చార్జీలు పెరిగాయంటూ నిత్యావసర సరుకులపై అనఫీషియల్ గా ధరలు పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. ఈ పెంపు విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు. ఎమ్మార్పీ కంటే అదనంగా డబ్బులు దండుకుంటున్నారు. ఇదేంటని సామాన్యులు ప్రశ్నిస్తే హోల్ సేల్ దుకాణదారులు కూడా తమకు ఎక్కువ ధరలకే సామగ్రి ఇస్తున్నట్లు వ్యాపారులు ప్రజలకు చెప్పడం గమనార్హం. ఉల్లిగడ్డలు, పప్పులు, గోధుమపిండి, సిగరెట్, టీ పొడి, వంటనూనె, షాంపులు, సబ్బులు, బేకరి సామగ్రి, వాహనాల ఇంజిన్ ఆయిల్, స్పేర్ పార్ట్స్ ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. వీటన్నింటి ధరలపై కనీసం 5 శాతం నుంచి 30 శాతానికి పైగా ధరలు పెంచేశారు. బైక్ ఇంజిన్‌ ఆయిల్‌ ధర సాధారణంగా రూ.250 దాకా ఉంటాయి. వ్యాపారులు వీటిపై అదనంగా రూ.30 వరకు పెంచి అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కిలో ఉల్లిగడ్డలు రూ.20 కి దొరుకుతుంటే ఆ ధరలను ఏకంగా రూ.25 నుంచి రూ.30 పెంచి వ్యాపారులు అమ్మకాలు చేపడుతున్నారు.

బిజినెస్ తక్కువగా జరగడమే కారణం

గతేడాది మార్చి నెలలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వ్యాపారుల బిజినెస్ అంతంత మాత్రంగానే సాగుతోంది. కొనేవారు లేక బిజినెస్ భారీగా దెబ్బతింది. సెకండ్ వేవ్ లో భాగంగా ప్రభుత్వం తిరిగి లాక్ డౌన్ విధించడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా చతికిలపడటంతో అవసరమైన సామగ్రిని కొనేందుకు మాత్రమే ముందుకు వస్తున్నారు. అందుకే కొందరు వ్యాపారులు ఈ నష్టాలను పూడ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుల నెత్తిన మరింత భారాన్ని మోపుతున్నారు.

అన్యాయంగా దోచుకుంటున్నారు

వ్యాపారులు పేద ప్రజలను అన్యాయంగా దోచుకుంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలంతా ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ వల్ల పనుల్లేక పస్తులుంటున్నారు. పూట గడిచేందుకు కూడా నానా కష్టాలు పడుతున్నారు. ఇలా ఉన్న రేటు కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు చేపట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదు. వ్యాపారులు వారి లాభాలు చూసుకుంటున్నారు. పేదవారి కష్టాలు కూడా పట్టించుకోవాలి. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వ్యాపారం కొనసాగించాలి. -మైసురా రెడ్డి, యూసుఫ్ గూడ

తక్కువకు తెచ్చి ఎక్కువకు అమ్ముతున్నారు

దాహమేస్తే తాగే మంచినీళ్లపై కూడా వ్యాపారులు దందా కొనసాగిస్తున్నారు. ఆర్ వో ప్లాంట్ల నుంచి వారు రూ.5 లేదా రూ.10కి ఒక్కో క్యాన్ ను కొనితెచ్చి రూ.25 నుంచి రూ.30 వరకు క్యాన్ ను అమ్ముతున్నారు. అప్పటికే అందులో ఎక్కువ లాభం మిగులుతుంది. అయినా లాక్ డౌన్ ప్రారంభమయ్యాక ధరలు పెంచి అమ్ముతున్నారు. నీళ్లే కాదు.. అన్ని సామాన్లపై ఇదే పరిస్థితి ఉంది. ఇష్టారాజ్యంగా దందా చేస్తూ పేదలను దోచుకుంటున్నారు. ఇలా కాకుండా చూసుకోవాలి. –మహేశ్, కృష్ణానగర్

Tags:    

Similar News