CMO నుండి ఆర్డర్ కాపీ… నాగర్‌కర్నూలులో వేడెక్కిన రాజకీయం
దిశ, నాగర్ కర్నూల్: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నాగర్‌కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. గతంలో జిల్లాకు ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. అప్పట్లో వసతుల్లేవనే సాకుతో గతేడాది అక్టోబర్ నెలలో రాత్రికి రాత్రే జడ్చర్ల, షాద్‌నగర్‌కు తరలించారు. ఆ సమయంలో కళాశాలల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం చూపారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో కళాశాలలను జిల్లాకు తరలించేందుకు సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్ కాపీ తేవడంతో […]
దిశ, నాగర్ కర్నూల్: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నాగర్‌కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. గతంలో జిల్లాకు ఎస్సీ గురుకుల బాలుర పాఠశాల, ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. అప్పట్లో వసతుల్లేవనే సాకుతో గతేడాది అక్టోబర్ నెలలో రాత్రికి రాత్రే జడ్చర్ల, షాద్‌నగర్‌కు తరలించారు. ఆ సమయంలో కళాశాలల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం చూపారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో కళాశాలలను జిల్లాకు తరలించేందుకు సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్ కాపీ తేవడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక ప్రజాప్రతినిధి, ఐపీఎస్ అధికారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
వసతులు లేవని సాకు చూపి నాగర్‌కర్నూలు జిల్లాకు మంజూరైన ఎస్సీ గురుకుల బాలుర బిజినపల్లి, ఎస్సీ డిగ్రీ మహిళా కళాశాలలను గతేడాది అక్టోబర్ లో అధికారులు రాత్రికి రాత్రే జడ్చర్ల, షాద్ నగర్ కు తరలించారు. కాగా, ఇప్పుడు ఆ కళాశాలలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి సీఎం కేసీఆర్ తో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనే కొనసాగించాలని గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఆదేశిస్తూ ఆర్డర్ కాపీని నాలుగు రోజుల క్రితం తీసుకొచ్చారు. అయితే 2005లో ప్రారంభమైన కళాశాలకు అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె భవనం ఏర్పాటు చేయాలని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో అరకొర వసతులు ఉన్న భవనంలో నుంచి కళాశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు షాద్ నగర్ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్న ఓ అద్దె భవనంలో ఏర్పాటు చేశారు.
అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇమేజ్ తగ్గిపోతుందనే భయంతో కళాశాలలను తిరిగి జిల్లాకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, కనీస వసతులు ఉండే భవనం కావాలని, అప్పటిదాకా ఇక్కడే ఉండాలని గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనకు వ్యతిరేకంగా సీఎం కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ తేవడంతో రాజకీయం వేడెక్కింది. దీనికి నిరసనగా ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ముకురాల శ్రీహరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. దీంతో పోలీస్ శాఖ అలర్ట్ అయి దాదాపు 7మండలాల పోలీస్ బలగాలతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని నిర్బంధించింది. ఎవరూ లోనికి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కందనూల్ జిల్లా కేంద్రంలో హంగామా నెలకొంది. సాయంత్రం వరకూ ఎవరూ రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
పట్టు నిలబెట్టుకునేందుకేనా..?
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్, ఇతర పార్టీలు ప్రచారానికి ఏ చిన్న అవకాశాన్ని దొరికినా వదులుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో ప్రజాభీష్టాన్ని స్వాగతిస్తూ ప్రజల కోరిక మేరకే కార్యక్రమాలను చేపట్టేలా ఆ పార్టీ శ్రేణులు ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇతర ప్రాంతాలకు తరలించిన గురుకుల కళాశాలాలను తిరిగి తన ప్రాంతానికి తీసుకొస్తే తన సత్తా ఏంటో నిరూపించుకోవచ్చని భావించి, ఆ ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ను ఒప్పించి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కళాశాలలను ఇక్కడే కొనసాగించేలా ఆర్డర్ తీసుకొచ్చారనే చర్చ జరుగుతోంది. కానీ, గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కాదని ముఖ్యమంత్రి ద్వారా ఆర్డర్ కాపీ తేవడంతో వారి ఇద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ బయటపడిందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
వాస్తవంగా విద్యార్థులకు మేలు చేయాలనే సంకల్పమే ప్రభుత్వానికి ఉంటే శాశ్వత భవనాల నిర్మాణం కోసం మంజూరు చేసిన రూ.808కోట్ల నిధులను ఎందుకు వెనక్కి తీసుకుందో అర్థం కాని పరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఎంతోమంది పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, అటువంటి వ్యక్తిని కించపరిచేలా తన అహంకారాన్ని చాటుకుంటున్నాడని ఎమ్మెల్యే పై తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడుతున్నారు. 2005లో మంజూరైన కళాశాలను ఈ ప్రాంతంలోనే కొనసాగించేందుకు అద్దె భవనాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సహకరించలేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న కళాశాలను సొంత ప్రాంతానికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, గురుకుల కళాశాల విషయాన్ని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీహరి ముకురాల అడ్డగించడం తాను కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండడంతోనే ఈ సమస్యను లేవనెత్తి సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని టీఆర్ఎస్ శ్రేణులు తదితర దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
విద్యార్థులకు వసతులు కల్పిస్తే అభ్యంతరం లేదు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తిరిగి ఏర్పాటు చేసే గురుకుల కళాశాలలో అన్ని వసతులు కల్పిస్తామని రాయబారం పంపారు. దానికి కొంత సమయం కోరారు. అందుకే ముట్టడికి వాయిదా వేసుకున్నాం. తీసుకొచ్చిన ఆర్డర్ కాపీతో ఎమ్మెల్యేపై వ్యక్తిగత కోపతాపాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల పక్క భవనాల కోసం విడుదల చేసిన రూ.808కోట్లను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందో చెప్పాలి.
– శ్రీహరి, తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్
అన్ని వసతులు కల్పిస్తాం
కందనూలు జిల్లా ప్రాంతానికి మంజూరైన కళాశాలలను కాపాడుకుంటాం. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులు కల్పిస్తాం. ఇందులో ఎటువంటి రాజకీయ స్వలాభం లేదు. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం.
– ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి