కోమటిరెడ్డి బ్రదర్స్​ మధ్య కోల్డ్​ వార్​

దిశ, తెలంగాణ బ్యూరో : కోమటి రెడ్డి బ్రదర్స్​ రాజకీయ శత్రువులుగా మారుతున్నారనే ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్​లో జోరందుకుంది. దాదాపు ఏడాది కాలంగా ఎంపీ వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి మధ్య వార్​ నడుస్తుందని మరోసారి ఖాయంగా కనిపిస్తున్నది. టీపీసీసీ చీఫ్​ అంశంపై రాష్ట్రంలోని ఒకవర్గం వెంకట్​రెడ్డికి సపోర్టుగా పావులు కదుపుతుంటే, రాజగోపాల్​రెడ్డి మాత్రం అభిప్రాయం చెప్పేందుకు గాంధీభవన్ మెట్లే ఎక్కలేదు. సంక్రాంతి తర్వాత టీపీసీసీ చీఫ్​ ప్రకటన వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలు వెంకట్​రెడ్డి […]

Update: 2021-01-03 23:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కోమటి రెడ్డి బ్రదర్స్​ రాజకీయ శత్రువులుగా మారుతున్నారనే ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్​లో జోరందుకుంది. దాదాపు ఏడాది కాలంగా ఎంపీ వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి మధ్య వార్​ నడుస్తుందని మరోసారి ఖాయంగా కనిపిస్తున్నది. టీపీసీసీ చీఫ్​ అంశంపై రాష్ట్రంలోని ఒకవర్గం వెంకట్​రెడ్డికి సపోర్టుగా పావులు కదుపుతుంటే, రాజగోపాల్​రెడ్డి మాత్రం అభిప్రాయం చెప్పేందుకు గాంధీభవన్ మెట్లే ఎక్కలేదు. సంక్రాంతి తర్వాత టీపీసీసీ చీఫ్​ ప్రకటన వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలు వెంకట్​రెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి. రాజకీయంగా వెంకట్​రెడ్డికి బ్రేక్​ వేసేందుకే రాజగోపాల్​రెడ్డి ప్లాన్​ చేస్తున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది.

గ్యాప్​ పెరిగింది..

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్​గా పేరు సంపాదించుకున్న ఎంపీ వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి కొంతకాలం కిందటి వరకు ఎక్కడైనా ఇద్దరు కనిపించేవారు. కానీ ఏడాది నుంచి పరిస్థితులు మారి అన్నదమ్ములిద్దరూ ఒకచోట కలువడం లేదు. పార్టీ కార్యక్రమాలకు రాజగోపాల్​రెడ్డి పూర్తిగా దూరం కాగా, కొన్ని నెలల కిందటి వరకు నల్గొండ రాజకీయాలకే పరిమితమైన వెంకట్​రెడ్డి కూడా ఇటీవల టీపీసీసీ చీఫ్​ అంశంలోనే మళ్లీ తెరపైకి వచ్చారు. ఉత్తమ్ రాజీనామాతో టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. 170 మంది నేతల నుంచి మాణిక్యం ఠాగూర్​ ఒపీనియన్స్​ తీసుకుని అధిష్ఠానానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆశావహుల రేసులో ఎంపీలు రేవంత్​రెడ్డి, వెంకట్​రెడ్డి, శ్రీధర్​బాబు, జీవన్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి నేతలున్నారు. వీరిలో కొంతమంది ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలిసే ప్రయత్నాలూ చేశారు. టీపీసీసీ చీఫ్​ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నా రాజగోపాల్​రెడ్డి మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాగా, అభిప్రాయ సేకరణ సమయంలో కనీసం గాంధీభవన్ వైపు వెళ్లలేదు, కొత్త ఇన్​చార్జి ఠాగూర్‌ను కలవలేదు. నిజానికి గతంలోనే రాజగోపాల్​రెడ్డి పీసీసీ చీఫ్​గా ఉత్తమ్ పనికిరాడని, ఆయనను తప్పించాలని బహిరంగానే డిమాండ్ చేశాడు. ఈ విషయమై ఉత్తమ్​పై చాలాసార్లు బహిరంగంగా విమర్శలు చేసినా, చీఫ్​ను మార్చే సమయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

ఇటీవల పలు కారణాలతో అన్నదమ్ములిద్దరి మధ్య గ్యాప్​ పెరిగిందని పార్టీ నేతల్లో కూడా స్పష్టమైంది. ఒక విధమైన రాజకీయ పోరు అని పార్టీ నేతలు చెబుతున్నా అది పార్టీ వ్యవహారం కాదని, కొన్ని వ్యాపార లావాదేవీల అంశాలు ఉన్నాయంటూ చెప్పుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంకట్​రెడ్డి ఓటమి, అదే సమయంలో పలు విషాద కారణాలతో వెంకట్​రెడ్డి కీలక రాజకీయాల నుంచి కొంత తప్పుకున్నారు. ఇదే సమయంలో పీసీసీ తనకు ఇవ్వాలని రాజగోపాల్​రెడ్డి అధిష్ఠానాన్ని కలిశారు. దీంతో వెంకట్​రెడ్డి మళ్లీ టీపీసీసీ చీఫ్​ కోసం పోటీ పడటంతో రాజగోపాల్​రెడ్డి పూర్తిగా వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. వెంకట్​రెడ్డి కూడా ఇటీవల కొంత దూకుడు పెంచారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్​ అంశంలో వెంకట్​రెడ్డి మొత్తం బాధ్యత మీదేసుకున్నారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెంకట్​రెడ్డి కూడా పొలిటికల్​ గేమ్​ స్టార్ట్​ చేశాడనే ప్రచారం పార్టీ నేతల్లో వెల్లడైంది.

తమ్ముడితో తలనొప్పి అవుతుందా..?

ఇదే సమయంలో రాజగోపాల్​రెడ్డి వ్యవహారం వెంకట్​రెడ్డికి కొంత ఇబ్బంది తెచ్చి పెడుతుందనే చర్చ జరుగుతోంది. తన తమ్ముడే పార్టీని వీడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్​ అంశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పోటీదారులు అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. రేవంత్​రెడ్డి అంశంలో ఓటుకు నోటు కేసును తెరపైకి తెస్తున్నారు. ఈ విషయంలో రేవంత్​రెడ్డికి బ్రేక్​ వేస్తామని అనుకుంటున్న సమయంలోనే వెంకట్​రెడ్డికి తమ్ముడి వ్యవహారం బెడిసికొడుతోంది.

Tags:    

Similar News