సారొచ్చిండు.. రోగం కుదిరింది..
(సుజిత రాచపల్లి) ఒకటి.. రెండు.. మూడు.. లెక్కపెడతనే ఉన్నా.. ఏడేండ్లయింది.. ముఖ్యమంత్రి సారూ.. ఇప్పటికి కనికరించినవ్. పరాయిపాలనలో ఆ నాయకులు ఎలాగూ పట్టించుకోలే.. మన రాష్ట్రం మనకు వచ్చిందిగా.. ఇక ఢోకా ఉండదనుకున్నా.. నా ఉద్యమ నాయకుడు.. నా కేసీఆర్.. వచ్చి నన్ను చూసిపోతడనుకున్న.. కానీ నువ్వా భాగ్యం కలిగించకపోతివి. పోయినేడాది జనాలు కరోనాతో తండ్లాడుతాంటే నువ్వు కచ్చితంగా వస్తావనకుంటి. నా అంచనాలు తప్పయ్యే. ప్రతిపక్షాల విమర్శల ప్రభావమో, ఈటెలన్నను మైమరపించే కథనో తెల్వదు గానీ కనీసం […]
(సుజిత రాచపల్లి)
ఒకటి.. రెండు.. మూడు.. లెక్కపెడతనే ఉన్నా.. ఏడేండ్లయింది.. ముఖ్యమంత్రి సారూ.. ఇప్పటికి కనికరించినవ్. పరాయిపాలనలో ఆ నాయకులు ఎలాగూ పట్టించుకోలే.. మన రాష్ట్రం మనకు వచ్చిందిగా.. ఇక ఢోకా ఉండదనుకున్నా.. నా ఉద్యమ నాయకుడు.. నా కేసీఆర్.. వచ్చి నన్ను చూసిపోతడనుకున్న.. కానీ నువ్వా భాగ్యం కలిగించకపోతివి. పోయినేడాది జనాలు కరోనాతో తండ్లాడుతాంటే నువ్వు కచ్చితంగా వస్తావనకుంటి. నా అంచనాలు తప్పయ్యే.
ప్రతిపక్షాల విమర్శల ప్రభావమో, ఈటెలన్నను మైమరపించే కథనో తెల్వదు గానీ కనీసం ఇప్పటికైనా నన్ను చూడడానికి వచ్చినవ్. ఏండ్లకేండ్లుగా నాకు పట్టిన మురికిని హైపోక్లోరైడ్‌తో కడిగిపారేసినవ్. ఇప్పటి వరకు ఏ నాయకుడొచ్చినా నాకీ అదృష్టం కలగలే. సీఎం స్థాయిలో వచ్చినవ్ గదా.. అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు అందరూ ఉరుకులు పరుగులు పెట్టిండ్రు.. నన్ను ఇట్లా గంధీ గంధీగా చూస్తే కసురుతవ్ అనుకున్నరో? లేక ఆ కంపు వాసన నువ్వు తట్టుకోలేవు అనుకున్నరో? గానీ నాలోని అణువణువు శుద్ధి జేసిండ్రు. గొడ్డొచ్చిన వేళ.. బిడ్డొచ్చిన వేళ అంటరు.. కానీ నువ్వొచ్చిన వేళే నాకు మంచి ఘడియలు వచ్చినట్టున్నయ్. బాత్రూమ్ దగ్గరి నుంచి కారిడార్ వరకు.. జనరల్ వార్డ్ నుంచి ఐసీయూ వరకు.. ఇన్నాళ్లూ ఎలుకలు, బొద్దింకలతో సావాసం జేసిన నన్ను అద్దంలా మెరిసిపోయేలా జేసిండ్రు.. కొత్త బెడ్‌షీట్లు.. పేషెంట్లకు తీరొక్క సౌలత్‌తో నా పరిసరాలన్నీ క్లీన్ అండ్ గ్రీన్ అయిపాయే..
గిట్ల నెలకోసారన్న వచ్చిపోరాదే చంద్రన్న.. నీకు పొలిటికల్ మైలేజ్ వస్తది.. మంచి సర్వీస్ చేస్తున్నదని పబ్లిక్‌ల నేను భీ ఫేమస్ అయిత.. ఏమంటవ్? తొందర్లనే మళ్ల కలుస్తవ్ గదా.. నా మాట ఆలకిస్తవ్ గదా.. ఇగ ఉంటన్న..!
హమేశా నిన్ను యాది చేసుకునే..
– నీ గాంధీ దవాఖానా