ఇక కరువుండదు.. అన్నీ వరదలే : సీఎం కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని, వరదలను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇకపైన రాష్ట్రవ్యాప్తంగా శాశ్వతంగా ఉండేలా ఒక ఫ్లడ్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను ఏడెనిమిది మందితో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏటా సంభవించే వరదల రికార్డులను పాటిస్తూనే వాటిని అనుసరించి ఇకపైన అలాంటిది రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురస్తున్న […]

Update: 2021-07-22 09:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని, వరదలను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇకపైన రాష్ట్రవ్యాప్తంగా శాశ్వతంగా ఉండేలా ఒక ఫ్లడ్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను ఏడెనిమిది మందితో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఏటా సంభవించే వరదల రికార్డులను పాటిస్తూనే వాటిని అనుసరించి ఇకపైన అలాంటిది రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురస్తున్న వర్షాలు, వరదలు, ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీరు, దిగువ ప్రాంతాలకు గేట్లను ఎత్తి విడుదల చేస్తున్న మోతాదు తదితరాలపై ప్రగతి భవన్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించిన సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు.

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురుస్తున్నాయని, మహాబలేశ్వరంలో దాదాపు 70 సెం.మీ. వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ కారణంగా తెలంగాణలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద నీరు భారీ స్థాయిలో ప్రవహించే అవకాశం ఉందని, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇరిగేషన్, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే, పునరావాసం కల్పించే చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

నిర్మల్ వరదలపై సీఎం ఆరా

ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల వ‌ల్ల నిర్మల్, భైంసా ప‌ట్టణాల్లోని తాజా ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. మ‌రో 24 గంట‌ల పాటు అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని నొక్కిచెప్పారు. సహాయ‌క చ‌ర్యలు చేప‌ట్టడానికి నిర్మల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి స్పష్టం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లోనే ఉండాలి

కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతూ ఉన్నందున ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, రోడ్లు-భవనాల శాఖ అధికారులు వెంటవెంటనే తగిన సహాయక చర్యలను చేపట్టాలని, ప్రభుత్వం కూడా విపత్తు నిర్వహణ బృందాలను పంపుతున్నదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు. ప్రజలకు ఆటంకాలు కలగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు.

మూసీ నది వరదపై ఆరా

మూసీ నదిలో వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంటే వెంటనే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను రక్షించడానికి ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హైదరాబాద్ నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని నివారించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం, తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

పార్టీ కార్యకర్తలు రంగంలోకి దూకాలి

వరదలు సంభవిస్తున్నందున ఆయా ప్రాంతాల్లోని అన్ని స్థాయిల టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దూకాలని, ప్రజలను ఆదుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలని సీనియర్ నేతలను ఆదేశించారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు.

రిటైర్డ్ అధికారులకు సీఎం పిలుపు

వరదల నుంచి ప్రజలను రక్షించడానికి మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను రప్పించాలని, హెలికాప్టర్‌లను కూడా అదనంగా సమకూర్చుకోవాలని సీఎం సూచన మేరకు ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. గతంలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కున్న సీనియర్, రిటైర్డ్ అధికారులను పిలిపించుకుని ఆపత్కాలంలో వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. రేపు ఎల్లుండి కొనసాగే వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ మున్సిపల్ శాఖలు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటవెంటనే తరలించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు గంట గంటకూ వరద పరిస్థితిని అంచనావేసి ప్రాజెక్టుల నుంచి నీటిని నియంత్రణ పద్ధతిలో వదలాలని ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

ఆగస్టు 10 దాకా అప్రమత్తం

అగస్టు 10వ తేదీ దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉన్నదంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేస్తూ బ్రిడ్జీలు, రోడ్ల పరిస్థితులను పరిశీలించాలని, ప్రజా రవాణా వ్యవస్థను నియంత్రించాలన్నారు.

Tags:    

Similar News