దళిత బంధు అర్హుల ఎంపిక కోసం సర్కార్ కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో : దళిత బంధుపై సునిశిత పరిశీలన మొదలైంది. ప్రైవేట్ సంస్థలు అందించిన సర్వే రిపోర్టులతో సీఎం కేసీఆర్ యాక్షన్‌లోకి దిగుతున్నారు. ఓవైపు అర్హుల కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాల సిబ్బంది సర్వేకు సిద్ధమవుతుండగా.. ఓటర్ల నాడి కోసం నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బెంగళూరుకు చెందిన మరో ప్రైవేట్ సర్వే సంస్థ కూడా హుజురాబాద్‌లో మకాం వేసింది. దళిత బంధు లబ్ధిపొందాక ఏం చేయాలనుకుంటున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నది. ఇప్పటికే 15 […]
దిశ, తెలంగాణ బ్యూరో : దళిత బంధుపై సునిశిత పరిశీలన మొదలైంది. ప్రైవేట్ సంస్థలు అందించిన సర్వే రిపోర్టులతో సీఎం కేసీఆర్ యాక్షన్‌లోకి దిగుతున్నారు. ఓవైపు అర్హుల కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాల సిబ్బంది సర్వేకు సిద్ధమవుతుండగా.. ఓటర్ల నాడి కోసం నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బెంగళూరుకు చెందిన మరో ప్రైవేట్ సర్వే సంస్థ కూడా హుజురాబాద్‌లో మకాం వేసింది. దళిత బంధు లబ్ధిపొందాక ఏం చేయాలనుకుంటున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నది. ఇప్పటికే 15 మంది లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌కు నివేదించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరీంనగర్లో సుదీర్ఘ సమీక్ష నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. మరోవైపు హుజురాబాద్ సెగ్మెంట్లో ఈ పథకానికి రూ. 2 వేల కోట్లను విడుదల చేశారు. విడుతల వారీగా ఈ సొమ్మును కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో జమ చేశారు.
మీరేం చేస్తారు?
ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో వాసాలమర్రి, హుజురాబాద్‌లో లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. ఇతర దళిత వర్గాలకు చెందిన కుటుంబాల్లోనూ సర్వే సాగింది. ఈ పథకం అమలుపై ఆయా వర్గాలు చాలా అంశాలను ప్రస్తావించడంతోపాటు అనుమానాలనూ వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎక్కువ మంది లబ్ధిదారులు తాము వాహనాలను కొనుగోలు చేస్తామని వెల్లడించారంటున్నారు. పలు వ్యాపారాలు మొదలుపెడితే ఆర్థికాదాయం వచ్చే పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హుజురాబాద్ లబ్ధిదారులపై సర్వే సంస్థ ఫోకస్ పెట్టింది. ఇక్కడ మిశ్రమస్పందన లభించిందంటున్నారు. డ్రైవింగ్, మోటారు రంగంలో మెజార్టీగా ఉన్నారని, దళితబంధు ఇస్తే వాహనాలు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. కొన్ని వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకు వచ్చినా, మార్కెటింగ్ సౌకర్యంపై ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. నష్టాలు వస్తే ఎలా అనే సందేహాలను ముందుంచారని తెలిసింది. కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టాలని భావిస్తున్నారని, కానీ ఎలాంటి వ్యాపారాలు సాగుతాయనే అనుమానాలు కూడా వారిలో ఉన్నాయి. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నామని సర్వే బృందాల ముందు వెల్లడించారు.
ఏం చేద్దాం..!
దళిత బంధుపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటుగా సీఎస్, సీఎంఓ ఓఎస్డీ రాహుల్‌బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమీక్ష సందర్భంగా సర్వే నివేదికల ఆధారంగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం రాత్రి కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లికి చేరుకోనున్న సీఎం.. అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం అల్గునూరులోని కార్మిక విభాగం నాయకుడు రూప్సింగ్ కూతురు వివాహానికి హాజరైన అనంతరం కలెక్టరేట్లో దళిత బంధుపై సమీక్ష చేయనున్నారు. లబ్ధిదారులకు నిధులు జమ చేసే అంశంపై కీలక నిర్ణయాలను సీఎం వివరించనున్నారు. నేరుగా ఖాతాలో వేయడమా లేకుంటే కలెక్టర్ ఖాతా నుంచి వారి వ్యాపారాలకు సంబంధించిన వారికి బిల్లుల ప్రకారం జమ చేయడమా అనే అంశాన్ని కూడా తేల్చనున్నారు.
రూ. 2 వేల కోట్లు జమ
దళితబంధు పథకాన్ని ఈ నెల 16న హుజురాబాద్‌లో ప్రారంభించిన సీఎం రూ. 2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ నెల 9న రూ. 500 కోట్లు, 23న రూ. 500 కోట్లు, 24న రూ. 200కోట్లు, 25న రూ.300 కోట్లు విడుదల చేయగా, గురువారం రూ. 500 కోట్లను కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో జమ చేశారు.
అటు అర్హుల సర్వే
ఇక నియోజకవర్గంలోని దళితులందరి వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు. దీనికోసం సర్వే గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన సర్కార్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ విభాగాలకు చెందిన 400 మందిని వినియోగిస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన 48 అంశాల్లో వివరాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఓటర్ల నాడిని కనిపెట్టేందుకు నిఘా వర్గాలు సర్వే కొనసాగిస్తూనే ఉన్నాయి.