జగన్ పథకాల పాపులారిటీపై కేసీఆర్ ఆరా

వినూత్న పథకాలను ప్రకటించి మొదలుపెడుతున్న ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ దృష్టి సారించింది. అక్కడ ప్రవేశపెట్టిన అనేక పథకాలు తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్నా ఏ మేరకు తేడా ఉంది? ప్రజాదరణలో అక్కడికీ ఇక్కడికి వ్యత్యాసమేమిటి? ఆర్థిక భారం ఎంత? అలాంటివి తెలంగాణకు అవసరమవుతాయా? ఇలా అనేక కోణాల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. ఆరున్నరేళ్లుగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నా ఇటీవల ఏపీ తీసుకొచ్చిన పథకాలకు విశేష ప్రజాదరణ రావడానికి కారణమేంటనే విషయమై లోతుగా అధ్యయనం […]

Update: 2020-12-25 20:23 GMT

వినూత్న పథకాలను ప్రకటించి మొదలుపెడుతున్న ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ దృష్టి సారించింది. అక్కడ ప్రవేశపెట్టిన అనేక పథకాలు తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్నా ఏ మేరకు తేడా ఉంది? ప్రజాదరణలో అక్కడికీ ఇక్కడికి వ్యత్యాసమేమిటి? ఆర్థిక భారం ఎంత? అలాంటివి తెలంగాణకు అవసరమవుతాయా? ఇలా అనేక కోణాల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. ఆరున్నరేళ్లుగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నా ఇటీవల ఏపీ తీసుకొచ్చిన పథకాలకు విశేష ప్రజాదరణ రావడానికి కారణమేంటనే విషయమై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నా లబ్ధిదారులు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎందుకు దూరమయ్యారనే కోణం నుంచి అధికార పార్టీ కసరత్తు మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ పథకాలతో ఆరున్నరేళ్లుగా ఆదరణ లభించినా, ఇటీవలి కాలంలో బెడిసికొట్టడం వెనక కారణాలేమిటో ఆరా తీస్తోంది. ఎలాంటి పథకాలను తీసుకొస్తే ప్రజలకు దగ్గర కావచ్చో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలకు లభిస్తున్న ఆదరణ, ప్రజలలోకి ఆ పథకాలు చొచ్చుకుపోవడం, ప్రభుత్వ ఖజానాపై పడే భారం, క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు ఇలాంటి అనేక అంశాలపై తెలంగాణ సీఎంఓ అధికారులు ఫోకస్ పెట్టారు.

జమిలి ఎన్నికల నేపథ్యంలో

జమిలి ఎన్నికలు ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్నందున వీలైనంత తొందరగా భవిష్యత్తులో తీసుకురావాల్సిన పథకాలకు రూపకల్పన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు మాత్రమే కాక ఇకపైన ఎన్నికల వాతావరణమే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రజాకర్షక పథకాలను రూపొంచి అమలు చేయాలనుకుంటున్నది. ఎన్నో పథకాలు తెలంగాణలో అమలవుతున్నా ఏపీలో ‘నవరత్నాలు’ పథకాలకు వచ్చిన ఆదరణ ఇక్కడ ఎందుకు రావడంలేదన్నది అధికారుల అనుమానం. అందుకోసమే ఆ పథకాలను విశ్లేషించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటివి అవసరం అనే కోణం నుంచి కసరత్తు మొదలైంది.

ప్రజలలో ఎలాంటి మార్పు వచ్చింది.?

గ్రామీణస్థాయిలో ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పులు, ఇప్పుడు అమలవుతున్న పథకాలతో సంతృప్తి చెందక ఇంకా వారు ఏం కోరుకుంటున్నారో ఇప్పటికే ఫీడ్‌బ్యాక్‌ తీసుకునే ప్రక్రియ మొదలైంది. ఏపీలో ప్రజాదరణ పొందిన తరహా పథకాలను తీసుకురావాల్సిన అవసరం ఏ మేరకు ఉందనే కోణం నుంచి అధ్యయనం మొదలైంది. నిర్దిష్టంగా ఒక్కో పథకం స్వరూపం, స్వభావం ఎలాంటిది.. దాని ద్వారా ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది.. ఏ సెక్షన్ ప్రజలకు ప్రయోజనం ఉంటోంది.. ప్రభుత్వ ఖజానాపై ఏ మేరకు భారం పడుతుంది.. ప్రజలలో ఎలాంటి అభిప్రాయం నెలకొంది; సెంటిమెంటల్‌గా అది వారిని ఎలా టచ్ అవుతోంది.. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టారు.

అక్కడికీ ఇక్కడికీ తేడా ఏంటి.?

2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నిరుద్యోగ భృతి, ఆసరా పింఛను లబ్ధిదారుల అర్హతా వయసును తగ్గించడం, స్వంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం లాంటి కొన్ని హామీలు అమలుకు నోచుకోలేదు. డబుల్ బెడ్‌రూమ్ పథకం ఐదేళ్లు కొనసాగుతూనే ఉంది. లబ్ధిదారులకు ఇంకా అప్పగించలేదు. ఈ అసంతృప్తి ఇటీవలి ఎన్నికలలో ప్రభావం చూపినట్లు టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యానించారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరధ లాంటి ఎన్నో పథకాలు అమలవుతున్నా, ప్రజలు వాటిని అనుభవిస్తున్నా ఇంకా అసంతృప్తి ఉండడానికి కారణాలపై పార్టీపరంగా చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఏపీ తరహా పథకాలు ఇక్కడ వర్కవుట్ అవుతాయా అనేది అధికారులు శోధిస్తున్నారు.

దిద్దుబాటు చర్యలు

ఏపీలో, ఇక్కడా సారూప్యం కలిగిన పథకాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ పింఛను, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా – వైఎస్సార్ చేయూత, పేదలందరికీ ఇళ్లు.. ఈ పథకాలన్నింటి గురించి ఆరా తీస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థలలో కార్పొరేట్ తరహా సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఏపీలోని ‘జగనన్న విద్యా దీవెన’కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించడం అధికారుల దృష్టికి వెళ్ళింది. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం ఉన్నా ఏపీలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్న అంశంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రజలలో పార్టీ పట్టు కోల్పోతున్నదనే అభిప్రాయం నెలకొన్న సమయంలో ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు మొదలుకావాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

Tags:    

Similar News