కొత్త సచివాలయంపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సచివాలయం నిర్మాణపు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్న డిజైన్ ప్రకారం, అవసరానికి తగినంత వేగంగా పనులు జరుగుతున్నాయంటూ ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను అభినందించారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని సచివాలయాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించాలని, అందులో ఉన్న మంచిని, అవసరాలను స్వీకరించాలని ఇంజనీర్లకు సూచించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ సహా అనేక భవనాలకు వినియోగించినట్లుగానే తెలంగాణ సచివాలయానికి కూడా ప్రత్యేకత కలిగిన ఆగ్రా […]

Update: 2021-12-09 11:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సచివాలయం నిర్మాణపు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్న డిజైన్ ప్రకారం, అవసరానికి తగినంత వేగంగా పనులు జరుగుతున్నాయంటూ ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను అభినందించారు. అయితే ఇతర రాష్ట్రాల్లోని సచివాలయాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించాలని, అందులో ఉన్న మంచిని, అవసరాలను స్వీకరించాలని ఇంజనీర్లకు సూచించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ సహా అనేక భవనాలకు వినియోగించినట్లుగానే తెలంగాణ సచివాలయానికి కూడా ప్రత్యేకత కలిగిన ఆగ్రా రెడ్ స్టోన్, ధోల్‌పూర్ స్టోన్‌లను వాడాలని సూచించారు. కొత్త సచివాలయం గర్వించేలాగ, పలు రాష్ట్రాలకు తీసిపోని విధంగా ఉండాలని, ఆ తీరులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ముఖ్యమంత్రి అయినప్పటికీ పాత సచివాలయానికి వెళ్ళని సీఎం దాన్ని కూల్చివేసి కొత్తదాన్ని కడుతున్నారని, పనులను పరిశీలించడానికి నెలకోసారి వెళ్తున్నారని విపక్ష నేతల నుంచి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు తగిన సూచనలు చేస్తున్నారు. మొత్తం ఏడు అంతస్తులతో నిర్మాణమవుతున్న ఈ భవనంలో రెండు అంతస్తులను కలియదిరిగి మంత్రుల, కార్యదర్శుల, అధికారుల చాంబర్లు ఎలా ఉండాలి, అందులో ఎలాంటి సౌకర్యాలను కల్పించాలి, పనిచేసే సిబ్బందికి ఎలాంటి ఆఫీస్ వాతావరణాన్ని కల్పించాలి తదితరాలన్నింటిపైనా సూచనలు చేశారు. విశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నందున పార్కింగ్ సౌకర్యం మొదలు సందర్శకుల వరకు ఉండాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు.

భవనానికి బయటివైపు గోడలకు ఆగ్రా, ధోల్‌పూర్ స్టోన్‌లను వాడుతున్నట్లుగానే పై భాగంలో ఎలాంటి నాణ్యమైన రాళ్ళను వాడాలి, గదుల లోపల సీలింగ్ ఎలా ఉండాలి, ఫ్లోరింగ్‌కు ఏ రకమైన టైల్స్ వాడాలి, కిటికీలకు అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ వినియోగం ఎలా ఉండాలి తదితరాలన్నింటిపై అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రదర్శించిన నమూనాలను పరిశీలించారు. చేయాల్సిన మార్పులపై సూచనలు చేశారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రోడ్లు భవనాల శాఖ అధికారులు, మంత్రుల అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. ఇక సమావేశ మందిరాలు, సిబ్బంది విశ్రాంతి గదులు, పచ్చటి గార్డెన్, వాటర్ ఫౌంటెయిన్, స్కై లాంజ్ తదితరాలన్నింటిపైనా అధికారులు సీఎంకు వివరించారు. కొన్నిచోట్ల ఐదు అంతస్తులకు శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తిచేసి వీలైనంత తొందరగా సచివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు.

Tags:    

Similar News