బ్లాక్ ఫంగస్‌తో జర భద్రం.. సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌లో నెలకొన్న పరిస్థితులు, ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా స్వంతంగా ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు కొరత రావద్దని అధికారులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ రాష్ట్రంలోని 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 324 టన్నుల ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లూ ఉన్నందున పేదలు కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌లో నెలకొన్న పరిస్థితులు, ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా స్వంతంగా ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు కొరత రావద్దని అధికారులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ రాష్ట్రంలోని 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 324 టన్నుల ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్‌కు అన్ని ఏర్పాట్లూ ఉన్నందున పేదలు కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఆరు వైద్య కళాశాలలను, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను నెలకొల్పాలని సూచించారు. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు పుట్టుకొచ్చినందున దానికి తగిన ట్రీట్‌మెంట్ కోసం సిద్ధం కావాలని, అవసరమైన మందులను, వైద్య ఉపకరణాలను తక్షణం సమకూర్చుకోవాలని ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సోమవారం జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా కరోనా కట్టడికి సంబంధించి పై ఆదేశాలు జారీచేసినట్లు సీఎంఓ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
పది రోజుల్లో ఆక్సిజన్ టాంకర్లు..
రాష్ట్రంలోని కరోనా పేషెంట్ల అవసరాల కోసం 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 324 టన్నుల సామర్థ్యంతో కూడిన ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వంద టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నారు. 16 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన ఆరు ఆక్సిజన్ ప్లాంట్లను, 8 టన్నుల సామర్థ్యం కలిగిన 15 ప్లాంట్లను, 4 టన్నుల సామర్థ్యం కలిగిన 27 ప్లాంట్లను హైదరాబాద్‌లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వీటికి తోడు 20 టన్నుల సామర్థ్యం కలిగిన 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను ముఖ్యమంత్రి కోరారు. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. పేదలు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులకే తొలి ప్రాధాన్యతగా ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని నొక్కిచెప్పారు.
ప్రైవేటు ఆస్పత్రులకు పోవద్దు..
కరోనా ట్రీట్‌మెంట్ కోసం ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతులు ఉన్నాయని, వైద్యంతో పాటు మందులు, భోజనం పూర్తిగా ఉచితంగా లభిస్తున్నందున ప్రైవేటు ఆస్పత్రులకు పోయి ఆర్థికంగా నష్టపోవద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం సాయంత్రానికి మొత్తం 6,926 బెడ్లు ఖాళీగానే ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్‌లు 2,253, ఐసీయూ బెడ్‌లు 533, మిగిలినవి జనరల్ బెడ్‌లు అని వివరించారు. ఆక్సిజన్, రెమిడెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నాయన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఏ ఆస్పత్రిలోనైనా వైద్యం ఒక్కటేనని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో 200 పడకల ఆసుపత్రిని తక్షణమే కోవిడ్ చికిత్సకు ఉపయోగించాలని, దీనికి తోడు సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులనూ కోవిడ్ సేవలు అందించడానికి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో మందులు తదితర మౌలిక వసతుల రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ రీజినల్ సబ్ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి అద్దె లేదా సొంత ప్రాతిపదికన వాహనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, మందులు నిల్వ చేయడానికి సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
బ్లాక్ ఫంగస్‌పై జర భద్రం..
కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్నదని, దానికి సంబంధించిన చికిత్స కోసం కోఠిలోని ఈఎన్‌టీ, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రుల్లో, జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య ఉపకరణాలను, మందులను సమకూర్చాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన పాతిక మైక్రో డీబ్రైడర్ మిషన్లు, హెచ్‌డి ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ వ్యాధితో చనిపోవడం, వందల సంఖ్యలో ఆ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ ఇటీవల ప్రకటించి.. చికిత్సపై ఫోకస్ పెట్టాల్సిందిగా ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు సూచించిన నేపథ్యంలో సీఎం దీనిపై లోతుగా చర్చించడం విశేషం.
రాష్ట్రానికి వచ్చింది 57.30 లక్షల డోసులే..
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సినేషన్ కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెప్పించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటిదాకా కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్ మాత్రమే వచ్చిందని, కొవాగ్జిన్, కొవిషీల్డ్ కలిపి ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 1,86,780 డోసులు మాత్రమే స్టాకు ఉన్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఇందులో కొవాగ్జిన్ 58,230 డోసులు, కొవిషీల్డ్ 1,28,550 డోసుల చొప్పున ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల వ్యాక్సిన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు..
సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టంచేశారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని నొక్కిచెప్పారు. ఇప్పటికే పనిచేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేనట్లయితే వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సూచించారు.
కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు లాక్‌డౌన్, ఫీవర్ సర్వే, కోవిడ్ మెడికల్ కిట్ల పంపిణీ తదితరాలతో కరోనా పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరడం గణనీయంగా తగ్గిపోయిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా నమోదవుతున్న కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న పేషెంట్ల సంఖ్యతో పోలిస్తే డిశ్చార్జీలు ఎక్కువగా ఉండడం సంతోషకరమన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్నవారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమన్నారు. ఫీవర్ సర్వేలో లక్షణాలు గుర్తించిన వారిని వైద్య బృందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుంటూ ఉండాలని సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.