మల్లన్న క్షేత్రంలో ఓదెల 2 ఫైనల్ షెడ్యూల్.. నాగ సాధు లుక్‌లో మిల్క్ బ్యూటీ
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’.
దిశ, సినిమా: తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉంది తమన్నా. తన కెరీర్‌లో తొలిసారిగా ఈ సినిమాలో శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది మిల్క్ బ్యూటీ. దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్, బీహైండ్ ది స్క్రీన్ కంటెంట్‌తో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం.
‘ఓదెల2’ చివరి షెడ్యూల్ ఓదెల విలేజ్‌లో జరుగుతోన్నట్లు తెలిపారు. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోంది. ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో తమన్నాతో పాటు మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించనున్నారు.