Nana Patekar: 'వరకట్నం ఇల్లీగల్ అయితే భరణం కూడా ఇల్లీగలే'.. నానా పటేకర్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (Nana Patekar).. సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (Nana Patekar).. సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనా ప్రతిభకు జాతీయ చలన చిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ వంటి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. వరుస సినిమాలతో కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి సరిహద్దుల్లో విశేషమైన సేవలు అందించాడు. కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత మళ్లీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక గతేడాది వన్వాస్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే, విడాకుల తర్వాత కోర్టు మంజూరు చేసే భరణంపై తాజాగా నానా పటేకర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల కాలంలో సినీ, క్రీడా రంగానికి చెందిన చాలా మంది సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమ భార్యలకు భారీ మొత్తంలో భరణం కూడా చెల్లిస్తున్నారు. శిఖర్ ధావన్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, చాహల్ వంటి అనేక మంది తమ భార్యలతో విడాకులు తీసుకున్నప్పుడు భరణంగా కోట్ల రూపాయలు చెల్లించారు. దీంతో గత కొన్ని రోజులు విడాకులు, భరణంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై నానా పటేకర్ తాజాగా స్పందించారు. పెళ్లికి ముందు ఇచ్చే వరకట్నం ఇల్లీగల్ అయితే, విడాకుల తర్వాత చెల్లించే భరణం కూడా ఇల్లీగలే అవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట మరో చర్చకు దారితీశాయి.
ఇక, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'SSMB29' చిత్రంలో నానా పటేకర్ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.