2024 Special Story: టాలీవుడ్ డైరీలో నిలిచిపోయిన 2024..

గతంలో ఎన్నడూ లేనంతగా తీపి, చేదు అనుభూతుల్ని టాలీవుడ్ సొంతం చేసుకుంది.

Update: 2024-12-31 09:26 GMT

దిశ, సినిమా: గతంలో ఎన్నడూ లేనంతగా తీపి, చేదు అనుభూతుల్ని టాలీవుడ్ సొంతం చేసుకుంది. 2024వ సంవత్సరం ఫిల్మ్ నగర్‌లో ఉగాది షడ్రుచులనే కాదు.. దీపావళి చిటపటాలు పేలాయి. ఓవైపు పాన్ ఇండియా స్టార్స్‌కు జాతీయ అవార్డులను అందిస్తూనే.. మరోవైపు వాళ్లనే జైలుకు పంపింది. కలెక్షన్లలో తారజువ్వలా ఆకాశాన్నంటి కొన్ని చిత్రాలు రికార్డులను తిరగరాయగా.. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డారు. సెలబ్రిటీ జంటల వివాహాలు-విడాకులతో సందడిగా మారిన టాలీవుడ్.. హృదయాన్ని హత్తుకునే పాటలతో సంగీత ప్రియుల్ని మెస్మరైజ్ చేసింది. థియేటర్లలో బోల్తా కొట్టిన చిత్రాలు.. ఓటీటీల్లో దుమ్మురేపాయి. అంతేనా.. సినిమాల్లోని ఉత్కంఠను మించిన ఊహించని కేసుల్లో అగ్రహీరోలు ఇరుక్కోని 2024 డైరీలో నిలిచిపోయారు. 2025 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ.. పాత డైరీని ఓసారి తిరిగేద్దామా..!

- రంభ. సుధారాణి

చిన్న సినిమాల హవా

థియేటర్లలో కలెక్షన్లు సాధించలేని కొన్ని చిత్రాలు కంటెంట్ పరంగా మాత్రం దుమ్మురేపాయి. వాటిలో ముఖ్యంగా కమిటీ కుర్రాళ్లు, 35 చిన్న కథ కాదు, పేకమేడలు, ఆయ్, మత్తు వదరలా-2 టాప్‌లో నిలిచాయి. ఇవి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ఫీల్ గుడ్ మూవీస్‌గా రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలు ఓటీటీల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని దుమ్మురేపాయి.

కలెక్షన్లలో కొత్త రికార్డులు

ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన చిత్రం ‘హనుమాన్’. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి పోరులో దిగిన ఈ మూవీ స్టార్ హీరోల మూవీస్‌ను దాటుకుని బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ చిత్రం అయితే.. పాపులర్ ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేసును దక్కించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా రాబట్టి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక సెప్టెంబర్‌లో వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ రూ.500 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది. డిసెంబర్‌‌లో వచ్చిన ‘పుష్ప-2’ ‘కల్కి’ రికార్డులు సైతం కొల్లగొడుతూ కలెక్షన్‌లలో కొత్త మార్క్‌ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.1500 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’, సిద్ధు జొన్నల గడ్డ ‘టిల్లు స్క్వేర్’ కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ స్టార్ హీరోలు

ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే పెద్ద హీరోల సినిమాలు బోల్తా పడ్డాయి. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు యావరేజ్, మిక్సిడ్ టాక్‌లకే పరిమితం అయ్యాయి. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన మహేశ్ బాబు ‘గుంటూరు కారం’కు మిక్సిడ్ టాకే వచ్చింది. వెంకటేష్ ‘సైంధవ్’ అడ్రస్ లేకుండా పోయింది. నాగార్జున ‘నా సామి రంగా’ పర్వలేదనిపించినా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫ్లాప్‌ను మూఠకట్టుకున్నాయి. ఏప్రిల్‌లో వచ్చిన విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది. ఇక 2024లోనైనా తన ప్రతాపం నిరూపించుకుందాం అనుకున్న వరుణ్ తేజ్.. ఎన్నో ఆశలతో, భారీ బడ్జెట్‌తో ‘ఆపరేషన్ వాలెంటైన్స్’, ‘మట్కా’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్కబోర్లా పడ్డాడు. రిలీజ్‌కు ముందు ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన స్టార్ హీరో సూర్య ‘కంగువ’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.

తీవ్ర డిజాస్టర్‌‌గా సీక్వెల్స్‌

రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ పె...ద్ద డిజాస్టర్‌ను ఎదుర్కొంది. 1996 లో కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘భారతీయుడు-2’పై భారీ పరాజయాన్ని చవిచూసింది. టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ప్రేక్షకులను ఆలరించలేపోయింది. 2024 సంవత్సరం సీక్వెల్ చిత్రాలకు అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు.

రికార్డులు క్రియేట్ చేసిన డబ్బింగ్ చిత్రాలు

ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలకు మక్కువ చూపారు. ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సినిమాల్లో మొదటి ప్లేస్‌లో ‘అమరన్’ నిలిచింది. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ప్రజెంట్ ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. దసరాకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయన్’ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’, కోలీవుడ్ స్టార్ హీరోలు అరవింద్ స్వామి, కార్తీ లీడ్ రోల్‌లో నటించిన ‘సత్యం సుందరం’, శివకార్తికేయన్ ‘అయాలన్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్, రాయన్’, తమిళ ‘బాక్’, మలయాళం ‘మంజుమ్మల్ బాయ్స్’, పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’తో పాటు చిన్న సినిమాగా వచ్చిన ‘ప్రేమలు’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.

టాప్‌లో దూసుకుపోతున్న సాంగ్స్..

2024వ సంవత్సరం సంగీత ప్రియుల్ని ఎంతో మంత్రముగ్ధుల్ని చేసిందనటంలో సందేహం లేదు. హృదయాలను హత్తుకుపోయిన ఎన్నో సాంగ్స్ టాప్ వ్యూస్‌తో దూసుకుపోయాయి. ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లిస్ట్‌లో చేరిపోయిన వాటిల్లో మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నుంచి ‘కుర్చీ మడత పెట్టి’ పాట ఏకంగా ఇండియా టాప్ సాంగ్స్‌లో మొదటి స్థానానికి చేరింది. ఎన్టీఆర్ దేవర నుంచి ‘చుట్టమల్లే’, ‘ఆయుధపూజ’, అల్లు అర్జున్ పుష్ప-2 నుంచి ‘కిస్సిక్’, ‘పీలింగ్స్’, తేజాసజ్జా హనుమాన్ ‘పూలమ్మే పిల్ల’, సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుంచి ‘గుమ్మా’, జనగ అయితే గనక నుంచి ‘నా ఫేవరెట్ నా పెళ్లాం’, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ నుంచి ‘శ్రీమతి గారు’ ‘తండేల్’ నుంచి ‘బుజ్జితల్లి’ సాంగ్ ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న బెస్ట్ సాంగ్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. ఇక రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ‘సంక్రాతికి వస్తున్నాం..’ మూవీలోని ‘గోదారి గట్టు, మీనూ’, గేమ్ చేంజర్ నుంచి ‘నానా హైరానా..’ సాంగ్స్ టాప్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

పెళ్లిళ్లు.. విడాకులకు పెద్ద పీట వేసిన 2024

ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా సెలబ్రిటీలు బ్యాచులర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు నాగచైతన్య, సిద్ధార్థ్, ఐశ్వర్య అర్జున్చ అమీ జాక్సన్, వరలక్ష్మి శరత్ కుమార్, కాళిదాస్ జయరామ్, అపర్ణ దాస్, రమ్య పాండియన్, ప్రేమ్ జీ, మీథా రాఘునాథ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాక్షి సిన్హా ఇలా చాలా మంది తమ బ్యాచులర్ లైఫ్‌కు బైబై చెప్పేసి.. పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక ఈ ఏడాది కొన్ని జంటలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏఆర్ రెహమాన్- సైరా భాను, ధనుష్- ఐశ్వర్య, జీవి ప్రకాష్ కుమార్- సైంధవి దంపతులు విడాకులు తీసుకోగా.. జయం రవి- ఆర్తి విడాకుల తీసుకునేందుకు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టు టాలీవుడ్‌ ప్రదక్షణలు

తెలుగు సినీఇండస్ట్రీని గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. జాతీయ ఫిలీంఫేర్ అవార్డులకు ఎంపికైన స్టార్ హీరో అల్లు అర్జున్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లు జైలు పాలవ్వడం ఈ ఏడాది సంచలనంగా మారింది. పుష్ప-2 ప్రీమియర్ షో కారణంగా హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లారు. ఈ వివాదంలో ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనపై కేసు పెట్టింది. ఈ కేసులో జానీమాస్టర్ నెల రోజులపాటు చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన వివాదాలు కుటుంబ కథ చిత్రాలను తలపించేలా వైరల్ అయ్యాయి.

మంచు మోహన్ బాబు జర్నలిస్ట్‌పై చేయి చేసుకోవడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీంతో రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారమని మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి. ఈ వివాదంలో తమకు పరువు నష్టం కలిగిందని సురేఖపై కేసు వేసిన అక్కినేని నాగార్జున తన కుటుంబంతో సహ కోర్టు చుట్టు తిరుగుతున్నారు. సేవ పేరుతో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన హర్ష సాయి కేసు కూడా ఈ ఏడాది సంచలనం సృష్టించింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను లొంగదీసుకుని నగ్న వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని, పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో హర్ష సాయితో పాటు అతడి తండ్రిపై కూడా కేసు నమోదు అయింది.

మోస్ట్ పాపులర్ నటిగా త్రిప్తి డిమ్రి..

ప్రతి ఏడాది మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రేక్షకులు ఎక్కువగా సర్చ్ చేసిన మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాలో టాప్-1లో త్రిప్తి డిమ్రి నిలిచింది. ఈ ఏడాది ‘బ్యాడ్ న్యూజ్, లైలా మజ్ను, భూల్ భులయ్యా 3’ వంటి చిత్రాలు రిలీజ్ కావడంతో త్రిప్తి గురించి ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. సెకండ్ ప్లేస్‌లో దీపికా పదుకొణె, మూడు,నాలుగు స్థానాల్లో నటుడు ఇషాన్ ఖత్తర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉండగా.. టాప్ 5లో శోభిత ధూళిపాళ, 6లో శార్వరీ, 7లో ఐశ్వర్య రాయ్ నిలిచారు. ఇక ఎనిమిదో స్థానాన్ని సమంత దక్కించుకుంది. తర్వాత స్థానంలో అలియా భట్.. టాప్ 10లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు.

Tags:    

Similar News