చిత్తూరులో 74మంది వాలంటీర్లు రాజీనామా.. ఎందుకంటే ?

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో ఒకేసారి 74 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అధికారులు, వైసీపీ నేతలు తమను వేధిస్తున్నారని అది తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పాకాల ఎంపీడీవో కార్యాలయం వద్ద వాలంటీర్లు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే చంద్రగిరి నియోజకవర్గం పాకాల పంచాయతీ కార్యదర్శిగా కుసుమ కుమారి పనిచేస్తున్నారు. అయితే జగనన్న కాలనీల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అలాగే […]

Update: 2021-09-03 07:35 GMT

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో ఒకేసారి 74 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అధికారులు, వైసీపీ నేతలు తమను వేధిస్తున్నారని అది తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పాకాల ఎంపీడీవో కార్యాలయం వద్ద వాలంటీర్లు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళ్తే చంద్రగిరి నియోజకవర్గం పాకాల పంచాయతీ కార్యదర్శిగా కుసుమ కుమారి పనిచేస్తున్నారు. అయితే జగనన్న కాలనీల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అలాగే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆరోపించారు.

అలాగే కొందరు వైసీపీ నేతలు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని, తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు పాకాల పంచాయతీలోని రెండు గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో తహసీల్దారు భాగ్యలక్ష్మిని కలిశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి కుసుమ కుమారి తీవ్ర ఒత్తిళ్లు..రాజకీయ నాయకుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆరోపిస్తూ.. మూకుమ్మడిగా రాజీనామా పత్రాల్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వాలంటీర్లకు తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. అయినప్పటికీ వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

బయోమెట్రిక్ నమోదు చేయాల్సి వస్తుందనే ఆరోపణలు..
వాలంటీర్ల ఆందోళనపై పంచాయతీ కార్యదర్శి కుసుమ కుమారి స్పందించారు. వాలంటీర్లు విధిగా ప్రతీరోజు బయోమెట్రిక్ నమోదు చేయాలని ఆదేశించడం వల్లే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతవారం పంటపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారని, వాలంటీర్లు విధిగా ప్రతిరోజూ బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ఆదేశించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో అన్ని పంచాయతీ కార్యాలయాలకూ నోటీసులు పంపినట్లు చెప్పారు. బయోమెట్రిక్‌ నమోదు చేయాల్సి వస్తుందనే కారణంతోనే వాలంటీర్లు రాజీనామా చేస్తామంటున్నారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

Tags:    

Similar News