ఛీటింగ్ ‘చిట్‌ఫండ్’ దందా.. లబోదిబోమంటున్న కస్టమర్లు..
దిశ ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్‌ఫండ్ కంపెనీల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడుస్తూ పొదుపుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాజమాన్యాలకు రాజకీయ అండదండలుండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు చిట్‌ఫండ్ కంపెనీల లావాదేవీలను పరిశీలిస్తూ.. పర్యవేక్షించాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాముళ్లకు కక్కుర్తిపడి కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీస్‌శాఖపైనా ఇదే రకమైన విమర్శలున్నాయి. పొదుపుదారుల నుంచి ఫిర్యాదులందినా విచారణ చేపట్టడం లేదని, కేసులు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వందలాది […]
దిశ ప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్‌ఫండ్ కంపెనీల మోసాలు నిత్యకృత్యంగా మారాయి. అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడుస్తూ పొదుపుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాజమాన్యాలకు రాజకీయ అండదండలుండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు చిట్‌ఫండ్ కంపెనీల లావాదేవీలను పరిశీలిస్తూ.. పర్యవేక్షించాల్సిన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాముళ్లకు కక్కుర్తిపడి కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీస్‌శాఖపైనా ఇదే రకమైన విమర్శలున్నాయి. పొదుపుదారుల నుంచి ఫిర్యాదులందినా విచారణ చేపట్టడం లేదని, కేసులు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
వందలాది మంది పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు తీసుకోవాలని కోరినా దాదాపుగా కేసులు నమోదు కావడం లేదని సమాచారం. పోలీస్ స్టేషన్లకు వెళ్లినా కనీస న్యాయం జరగడం లేదన్న మాట వినిపిస్తోంది. పొదుపు డబ్బులు అందజేయాలని ప్రశ్నించిన వారిపై దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. బాధితులపైనే ఉల్టా కేసులు నమోదయ్యేలా ప్రయత్నాలు జరిగిన సంఘటలు ఉండటం గమనార్హం. చిట్‌ఫండ్ కంపెనీల దౌర్జన్యాలు, దాష్టీకాలు వరంగల్‌లో షరామాములైపోయాయి. ఈ నెల 3న హన్మకొండ కుమార్‌పల్లిలోని సెల్‌షాపు నిర్వాహాకుడు రాజుకు నిప్పు పెట్టిన సంఘటన పరిస్థితిని సాక్షాత్కరిస్తోంది. వరంగల్‌లో చిట్‌ఫండ్ కంపెనీల్లో జరుగుతున్న అక్రమాలను చూస్తుంటే చిట్‌ఫండ్ కంపెనీల ఛీటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చిందా..? అన్న అనుమానం కలుగకమానదు.
ఇక్కడ వసూళ్లు.. అక్కడ పెట్టుబడి..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో గడిచిన ఐదారు సంవత్సరాల్లో వందల సంఖ్యలో చిట్‌ఫండ్ కంపెనీలు కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఇలా కొత్తగా మార్కెట్లోకి వస్తున్న చిట్‌ఫండ్ కంపెనీల లక్ష్యం స్థిరాస్థి, నిర్మాణ రంగమే అవుతోంది. కొందరయితే అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. పొదుపుదారుల నుంచి సేకరించిన మొత్తాలను సదరు సంస్థ ఆర్థిక లావాదేవీలకు వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అనుబంధ వ్యాపారాలైన స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లోకి మల్లిస్తుండటంతోనే సమస్య మొదలవుతోంది. పొదుపుదారుడికి గడువులోపు మొత్తాలను చెల్లించకుండా ఏడెనిమిది నెలల పాటు సంస్థ చుట్టు తిప్పుకుంటున్నాయి. చిన్న సంస్థ నుంచి మొదలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన అనేక సంస్థల్లోనూ ఇదే అక్రమ విధానం కొనసాగుతోంది. సంస్థపై నమ్మకంతో పొదుపుచేద్దామని వచ్చిన వారికి కంపెనీలు చుక్కలు చూపెడుతున్నాయి.
రాజకీయ దగుల్బాజీల అండ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన ఐదారు సంవత్సరాల్లోనే వందల సంఖ్యలో చిట్‌ఫండ్ కంపెనీలు వెలిశాయి. వరంగల్, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రముఖ సంస్థల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నేతలు ప్రధాన వాటాదారులుగా ఉన్న సంస్థలూ ఉన్నాయి. ఈ కంపెనీల్లో జరిగే అవినీతి అక్రమాలపై ఎలాంటి చర్యలు లేకుండా ఉండేందుకు పెద్ద నేతలు, ప్రజాప్రతినిధుల సాయంతో రెవెన్యూ, పోలీస్‌శాఖలను గుప్పిట బిగించేస్తున్నారు. ఫిర్యాదులపై స్పందించకుండా పోలీస్‌శాఖకు ఆదేశాలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అనేక మంది పొదుపుదారులు వివిధ చిట్‌ఫండ్ కంపెనీలపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కాకపోవడం వెనుక విషయం ఇదేనని తెలుస్తోంది.
తనిఖీల్లేవ్.. పరిశీలన లేదు..
వాస్తవానికి చిట్‌ఫండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాల్సి ఉంటుంది. రికార్డులను, బ్యాంకు లావాదేవీలను, జారీ చేసిన చెక్కులను తనిఖీ చేయాలి. కంపెనీ ఎన్ని చీటీల నిర్వాహణ చేపట్టిందో తెలుసుకోవాలి. ఆ చీటీల్లోని సభ్యులకు మొత్తాల చెల్లింపులు నిర్ణీత గడవులోగా జరిగాయా లేదో పరిశీలించాలి. కానీ ఇవేమీ సదరు అధికారులు పట్టించుకోవడం లేదు. చిట్ ఫండ్ కార్యాలయాల ఎదుట మందుడబ్బాలు చేబూని ధర్నా చేసినా కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తుండటం గమనార్హం. చిట్ ఫండ్ యాజమాన్యాలిచ్చే మాముళ్లకు తలొగ్గిపోయారన్న విమర్శలకు అధికారుల వ్యవహార శైలి బలం చేకూరుస్తోంది. అసలు చిట్ ఫండ్ ఆర్థిక కార్యకలాపాలపై ఏమాత్రం పర్యవేక్షణ లేకుండా ఉందనేది నిష్టూర సత్యం.