సెల్ బానిసలు.. వదిలేస్తే ప్రమాదమే
దిశ ప్రతినిధి, మేడ్చల్/ పరిగి : నేటి సాంకేతిక యుగంలో చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకూ సెల్ వలయంలో చిక్కుకుపోయారు. ఫోన్ అందరినీ కట్టుబానిసలుగా మార్చుకుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తనపై ఆధారపడేలా మలుచుకుంది. యువతీయువకులు, విద్యార్థులైతే అరచేతిలో స్మార్ట్‌ఫోన్లను పెట్టుకొని పొద్దస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల కొద్దీ చాటింగ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలైపోతున్నారు. ప్రత్యక్ష ఫ్రెండ్స్ కంటే ఆన్ లైన్ మిత్రులే ఎక్కువగా ఉంటున్నారు. […]
దిశ ప్రతినిధి, మేడ్చల్/ పరిగి : నేటి సాంకేతిక యుగంలో చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకూ సెల్ వలయంలో చిక్కుకుపోయారు. ఫోన్ అందరినీ కట్టుబానిసలుగా మార్చుకుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తనపై ఆధారపడేలా మలుచుకుంది. యువతీయువకులు, విద్యార్థులైతే అరచేతిలో స్మార్ట్‌ఫోన్లను పెట్టుకొని పొద్దస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల కొద్దీ చాటింగ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలైపోతున్నారు.
ప్రత్యక్ష ఫ్రెండ్స్ కంటే ఆన్ లైన్ మిత్రులే ఎక్కువగా ఉంటున్నారు. మానవ సంబంధాలు తక్కువై కేవలం హాయి.. బాయ్ పలకరింపులతోనే సరిపెడుతున్నారు. అతిగా ఫోన్ వాడడం, మాట్లాడడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కంటి చూపు మందగించడమే కాకుండా జ్ఞాపక శక్తి మందగిస్తున్నది. ఇక చిన్న పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతున్నది. రోజులో ఫోన్ ఎంత తక్కువ వాడితే అంతమంచిదని, 8 ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలు, పెద్దలు, ముదుసలి ఇలా అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ హల్ చల్ చేస్తున్నది. సెల్ ముట్టుకోకుండా గడియ కుండా ఉండని మనుషులు ఉన్నారు. పనులు తగ్గించి, దూరాన్ని దగ్గరే చేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోష పడాలో.. దాని వల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. ఎనిమిదేళ్ల లోపు చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల చిన్నారులకు సైతం ఫోన్ ఇస్తున్నారని…ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఎనిమిదేళ్లు దాటిన పిల్లలకే..
ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్‌లను వినియోగించేందుకు అనుమతించాలని ఐ.టీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండేళ్లు కూడా నిండని వారికి సెల్ ఫోన్లు ఇచ్చి వారిని ఫోన్ వ్యసన పరులను చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా ‘సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసనపరులవుతున్నారా’ అనే అంశంపై వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సైబర్ నిపుణులు.. కొవిడ్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తదనంతర పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఆన్ లైన్ క్లాసులు అనివార్యమయ్యాయన్నారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువ సేపు ఈ ఆన్ లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్లకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాకు బానిసలుగా..
ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలయ్యారు. అధిక సమయం ప్రధానంగా అర్ధరాత్రి వరకూ మొబైల్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయేలా పేరెంట్స్ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని తెలిపారు. అనవసర యాప్ లను తొలగించడంతో పాటు కేవలం విద్యా పరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రతి రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలన్నారు.
క్లాసులు పోయి.. గేములొచ్చే..
ఆన్ లైన్ క్లాసులతో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు మరింత చేరువయ్యాయి. టెక్నాలజీతో ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం రోజులు అటు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగా పిల్లలు క్లాసులు విన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రానురాను సెల్ఫోన్ కాస్త వీడియో గేమ్ సెంటర్ గా మారిపోయింది. ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు వీడియో కాల్ చేయడం దగ్గరిండి మరీ నేర్పించారు. ఇక పిల్లల చేతుల్లోనే ఫోన్లు ఉంటుండడంతో ఎంచక్క దోస్తులకు ఫోన్లు చేయడం ఆన్లైన్ ఫ్రీ ఫైర్ గేములు మొదలు పెట్టారు. దీనికి తోడు టిక్ టాక్ మహమ్మారీ ఇంకా వదలండం లేదు. వీడియోలు చేయడం రోపొసో, ఇతర యాప్లలో అప్లోడ్ చేయడం లైక్లు, షేర్ చెక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇవీ చాలవన్నట్లు స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.
అపరిచిత పరిచయాల.. ఆపై అనర్థాలు
స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి కనిపించే స్నేహితులు కన్నా ఆన్ లైన్ మిత్రులు వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మరీ ఎక్కవవుతున్నారు. అమ్మాయిలను టార్గెట్ చేసే అబ్బాయిలు,. అబ్బాయిలను టార్గెట్ చేసే అమ్మాయిలు ఇందులోనే ఎక్కువే. మోస పోవడం, హత్యలు చేయడం, ఆత్మహత్యలకు దారితీస్తుండటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సెల్ ఫోన్కు పూర్తిగా అడిక్ట్ అయ్యాక కాస్త మందలిస్తే తెలిసీతెలియని వయస్సులో వారిపై ప్రభావం చూపుతుంది. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలను బలవుతున్నారు. ఊరికే సెల్ చూడకంటూ తండ్రి మందలించడంతో ఇటీవలే పరిగి మండలం కుల్కచర్లలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.