టీటీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..?

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా అనంతరం తలెత్తిన పరిణామాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటవుతాయని స్పష్టం చేశారు. రమణ రాజీనామాతో రాష్ట్ర అధ్యక్షుడి పోస్టు ఖాళీ కావడంతో ఎవరిని నియమించాలనే విషయంపై సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. వారి అభిప్రాయాలను […]

Update: 2021-07-10 20:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా అనంతరం తలెత్తిన పరిణామాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటవుతాయని స్పష్టం చేశారు. రమణ రాజీనామాతో రాష్ట్ర అధ్యక్షుడి పోస్టు ఖాళీ కావడంతో ఎవరిని నియమించాలనే విషయంపై సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతలతో సోమవారం కూడా సమావేశం నిర్వహించనున్నారు. అందరి అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారు.

సమావేశం వివరాలను ఆ పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి మీడియాకు వివరిస్తూ, త్వరలోనే తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీకి నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను సీనియర్లంతా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అప్పగించారని తెలిపారు. పార్టీ ఆవిర్భవించింది మొదలు ఎంతో మందిని నాయకులుగా తయారుచేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని, ఇప్పుడు కొన్ని పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవారంతా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి నేతలుగా ఎదిగినవారేనని గుర్తుచేశారు. పార్టీ గతంతో పోలిస్తే చాలా బలహీనపడిన మాట వాస్తవమేనని, అందువల్లనే పునఃనిర్మాణం చేసి మరింత బలోపేతం చేయాలనే అంశంపై చంద్రబాబు చర్చించారని తెలిపారు.

ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమణ రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు, కూర్పు, బాధ్యతలు, పార్టీ నిర్మాణం తదితరాలపై చర్చించినట్లు తెలిపారు. తాజాగా రాష్ట్రంలో, వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితి, పరిణామాలను చర్చించినట్లు తెలిపారు. మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాలవారీగా కమిటీలు ఏర్పాటవుతాయన్నారు.

ఐరన్ లెగ్ పోయింది

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ రాజీనామా చేయడంతో పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ భవన్లో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎట్టకేలకు ఒక ఐరన్ లెగ్ వెళ్ళిపోయిందని, ఇకపైన పార్టీకి అన్నీ మంచే జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మొదలు రమణ అధ్యక్షుడిగా ఉన్నారని, రోజురోజుకూ పార్టీ బలహీనపడిందని, ఇప్పుడు పునర్ నిర్మాణం చేసుకోవాల్సిన స్థాయికి చేరుకున్నదని టీటీడీపీ నేత జీవీజీ నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్‌గా ఉన్న రమణ ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని, ఏడేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఇప్పుడు వదిలిందన్నారు. నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుంటామన్నారు. రమణ వెళ్ళిపోవడం పార్టీకి ఒక శుభసూచకమని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News