వ్యవసాయం సంక్షోభంలో పడింది: చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రైతులకు సీఎం వైఎస్ జగన్ వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఏపీ రైతుల సగటు రుణభారం దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఈనెల 14 నుంచి 18 వరకు జోనల్ వారీగా రైతు కోసం తెలుగుదేశం పేరుతో పోరుబాట కార్యక్రమం చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రైతులకు సీఎం వైఎస్ జగన్ వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఏపీ రైతుల సగటు రుణభారం దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ఈనెల 14 నుంచి 18 వరకు జోనల్ వారీగా రైతు కోసం తెలుగుదేశం పేరుతో పోరుబాట కార్యక్రమం చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి వ్యయం రెట్టింపు అయిందని.. రైతులకు ఇచ్చే సబ్సీడీలు నిలిచిపోయాయని విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వ్యవసాయ శాఖ మూతపడిందన్నారు. మరోవైపు అక్బర్ బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అంటే సీఎం జగన్ మైనార్టీలకు ద్రోహం చేసినట్లవుతుందని చెప్పుకొచ్చారు. మైనార్టీల భూమి కబ్జాకు ప్రయత్నించిన తిరుపాల్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
ప్రజల నడ్డివిరుస్తున్న జగన్ సర్కార్
కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి సమయాల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం చెత్తపన్ను, ఆస్తిపన్నులతో భారం మోపిందని గుర్తు చేశారు. తాజాగా కరెంట్ ఛార్జీల పెంపుతో జగన్ పెనుభారం మోపారని విమర్శించారు. ఇప్పటికే 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.9 వేలకోట్ల భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. ఆరోసారి మరో రూ.2,542 కోట్లు పెంచి మొత్తం 11,500 కోట్లు భారాలు మోపినట్లు చెప్పుకొచ్చారు. కమిషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్‌ను కొని..ఆ భారాలు ప్రజలపై మోపడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. విద్యుత్ ఉత్పత్తిని చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వమే మటన్ షాపులు నిర్వహిస్తుందన్న నిర్ణయం రాష్ట్రమంతటా హాస్యాస్పదంగా మారిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మైనార్టీ, క్రిష్టియన్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎయిడెడ్ కాలేజీల భూములు కాజేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని విరుచుకుపడ్డారు. రేషన్, పెన్షన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం పేదల కడుపులు కొడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువ అన్నారు. పంచాయతీల్లో కూడా ఆస్తిపన్ను పెంచేందుకు నిర్ణయించడం జగన్ చేతగానితనానికి నిదర్శనమని చంద్రబాబు ఎద్దేవా చేశారు.