ఢిల్లీ పెద్దలకు కరోనా భయం

దిశ, సెంట్రల్ డెస్క్: ఢిల్లీ పెద్దలకు కరోనా భయం పట్టుకుంది. ఈ నగరంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రధాని మొదలు మంత్రుల వరకు ఆందోళన పట్టుకుంది. హడావిడిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తదితరులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి కోసం సీరియస్ చర్యలపై చర్చించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం పాలనా […]

Update: 2020-06-14 09:36 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: ఢిల్లీ పెద్దలకు కరోనా భయం పట్టుకుంది. ఈ నగరంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రధాని మొదలు మంత్రుల వరకు ఆందోళన పట్టుకుంది. హడావిడిగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తదితరులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి కోసం సీరియస్ చర్యలపై చర్చించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా పెద్దగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం పాలనా కేంద్రంగా, దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ విషయంలో మాత్రం వేగంగా స్పందించింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అది కేంద్ర మంత్రులకే చుట్టుకుంటుందన్న భయమే ఇందుకు కారణం కాబోలు!

కేంద్ర ప్రభుత్వ అధినేతలు కొలువై ఉండే దేశ రాజధానిలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా ఇంతకాలం మోడీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. సుప్రీంకోర్టు మందలింపులు, కరోనా కేసులు సుమారు 40 వేలు దాటడం లాంటి అంశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా సుప్తచేతనావస్థ నుంచి మేలుకుంది. హుటాహుటిన సమావేశాలు నిర్వహించి కట్టడి చర్యలకు ఉపక్రమించింది. కరోనాను కట్టడి చేయకుంటే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని భావించింది. వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీకన్నా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయి నగరంపట్ల ఈ వేగాన్ని ప్రదర్శించలేదు.

పాలనావ్యవస్థ కేంద్రీకృతమైన ఢిల్లీపై మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కరోనా పోరాటంలో ఇతర దేశాలకు సహాయపడతామని ప్రధాని హామీనిస్తున్నారు. కానీ దేశ రాజధానిలోనే పరిస్థితులు చక్కదిద్దుకోకుంటే అది నామోషీగా ఉంటుందనే భావనతో ఇప్పుడు చర్యలకు ఉపక్రమించిందన్న వార్తలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఢిల్లీలో సుమారు 40 వేలకు పైగా కేసులు నమోదైతే ముంబయి నగరంలోనే 56 వేలకుపైగా రిపోర్ట్ అయ్యాయి.

కేంద్ర మంత్రుల సమావేశాలు

కరోనా పేషెంట్‌లతో వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. తర్వాతి రెండో రోజే కేంద్ర మంత్రులు అమిత్ షా, డాక్టర్ హర్షవర్దన్‌లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌లతో భేటీ అయ్యారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులను పర్యవేక్షించారు. కరోనా పేషెంట్‌లకు పడకల కొరతను అధిగమించేందుకు అన్ని రకాల సదుపాయాలున్న 500 ట్రైన్ కోచ్‌లను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కంటైన్‌మెంట్ జోన్లలోని ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. హాట్‌స్పాట్‌లలో కరోనా బాధితుల కాంటాక్ట్‌లను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేస్తామని అమిత్ షా ప్రకటించారు.

కరోనాతో మరణించినవారి మృతదేహాల ఖననానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు అందిస్తారని, తద్వారా తక్కువ సమయంలో వాటిని డిస్పోజ్ చేయవచ్చునని తెలిపారు. పరీక్షల సంఖ్యను రెండు నుంచి ఆరు రెట్ల మేర పెంచుతారని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 శాతం బెడ్‌లను కరోనా పేషెంట్‌లకోసం రిజర్వ్ చేసి ఉంచేలా చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, ట్రీట్‌మెంట్‌లకు కచ్చితమైన ఒక ధరను ఫిక్స్ చేస్తారని వివరించారు. అలాగే, ఢిల్లీ ప్రభుత్వానికి అవసరమైన సహాయాలు, వనరులు, ఆక్సిజన్ సిలిండర్‌లు, వెంటిలేటర్లు లాంటివాటిని కేంద్రం అందిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అదికారులను అరుణాచలప్రదేశ్, అండమాన్ లాంటి చోట్ల నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారిని సైతం కరోనా కట్టడికి వినియోగించుకోవాలని నిర్ణయించారు.

బ్లేమ్ గేమ్?

కరోనా పేషెంట్‌ల మృతదేహాలు చెత్తకుండిలో కనిపించినప్పుడు, బెడ్‌లు దొరక్క పేషెంట్‌లు తిప్పలుపడుతున్నప్పుడు, కేసులు 40 వేలు దాటేవరకూ దేశరాజధానిపై దృష్టిపెట్టని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా స్పందించింది. ఢిల్లీలో కరోనా కట్టడికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రులు చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కరోనా కట్టడి చేయడంలో విఫలమైంది. ఇక కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నదన్నట్టుగా కేంద్రమంత్రి వ్యాఖ్యలుండటం గమనార్హం. వలస కార్మికుల వ్యధ, కరోనా తీవ్రతతో విలవిల్లాడుతున్న బీహార్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ చేసిన అమిత్ షా నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడంతో ఢిల్లీలో బ్లేమ్ గేమ్ మొదలైందా? అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది.

Tags:    

Similar News