మే 31 దాకా లాక్‌డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేసే వ్యూహంలో భాగంగా కేంద్రం ఈసారి మరికొన్ని సడలింపులను ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్‌లలో మాత్రం కఠిన ఆంక్షలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు తెలిపింది. నాలుగో విడత లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలను […]
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేసే వ్యూహంలో భాగంగా కేంద్రం ఈసారి మరికొన్ని సడలింపులను ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్‌లలో మాత్రం కఠిన ఆంక్షలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు తెలిపింది. నాలుగో విడత లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు, అలాగే, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించింది. ఈ సడలింపుల్లో అవసరమైన మార్పులు, చేర్పులను చేసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు కల్పించింది.
ఇందులో భాగంగా విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాల్స్, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, జూ పార్కులు, షాపింగ్ మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు, జిమ్‌లు, బార్లు తదితరాలన్నీ ఈ నెల 31 వరకు మూసివేసే ఉంటాయి. రైలు, విమాన సర్వీసు, మెట్రో రైళ్లు తదితరాలన్నీ కూడా నడవవని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో మినహా మిగిలిన అన్ని జోన్లలో పైన నిషేధించినవి కాకుండా ఇతర అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుతం అమలవుతున్న రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కేంద్ర వైద్యారోగ్య మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు, చేర్పుల విషయాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చునని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్ మినహా మిగిలిన అన్ని జోన్లలో ‘ఈ-కామర్స్’ సంస్థల ద్వారా ఇకపైన నిత్యావసరాలతో పాటు అన్ని రకాల వస్తువుల లావాదేవీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇంతకాలం హెయిర్ కటింగ్ సెలూన్, బ్యూటీ పార్లర్లపై నిషేధం ఉన్నా నాల్గవ విడత లాక్‌డౌన్‌లో మాత్రం వాటిని తొలగించింది. అవి యథావిధిగా పనిచేయనున్నాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అనుగుణమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది.
దాదాపు రెండు నెలలుగా యావత్తు దేశం లాక్‌డౌన్‌లో ఉండడంతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షల్లో అనేక సడలింపులు చేసింది. లాక్‌డౌన్ అమలవుతున్నా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో కట్టడి చేయడానికి పక్కాగా వ్యూహాన్ని అమలు చేస్తోన్నది. కరోనా నుంచి సర్వైవల్, ఆర్థిక వ్యవస్థ రివైవల్ అనే రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల ఉధృతి కట్టడిని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు అమలవుతున్న భౌతిక దూరం, మాస్కుల వినియోగం లాంటి జాగ్రత్తలు ఇకపైన కూడా తప్పనిసరి అని స్పష్టం చేసింది.
అందులో భాగంగానే ప్రజలు గుమిగూడే రాజకీయ, క్రీడా, మతపరమైన వేడుకలు సహా ఇతర కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు విధించింది. మతపరమైన స్థలాలు మూసే ఉంటాయి. అయితే, కొన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు మినహాయింపులిచ్చినా ప్రేక్షకులను అనుమతించేది లేదని తెలిపింది. దీంతో క్రికెట్ లాంటి మేజర్ ఈవెంట్స్ మన దేశంలో కొనసాగే అవకాశమున్నాయి. ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మినహాయింపు ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైలు సేవలపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని కొనసాగించింది. అయితే, ఆరోగ్య నిపుణులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అంబులెన్స్‌లకు ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. నిత్యావసర సరుకులు, గూడ్స్ సరఫరాకు ఆటంకాలు కలిగించవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
కంటైన్‌మెంట్ జోన్.. స్ట్రిక్ట్ మూవ్‌మెంట్
నాలుగో దశ లాక్‌డౌన్ కంటైన్‌మెంట్ జోన్‌లలో కఠినంగా అమలు కానుంది. కేవలం అత్యవసర సేవలు మినహా ప్రజలు బయట తిరిగేందుకు అనుమతి లేదు. ఈ జోన్ నుంచి వెలుపలికి, బయటి నుంచి లోపలికి రాకపోకలపై నిషేధం విధించింది. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర సరుకులు, సేవలకు మాత్రమే అనుమతి ఉంది. అలాగే, ఈ జోన్‌లో కాంటాక్ట్ ట్రేసింగ్ బలంగా చేపడతారు. నిఘా కోసం ఇంటింటికీ మున్సిపల్, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది తిరుగుతారు.
రాష్ట్రాల అభీష్టం మేరకే.. బస్సు సేవలు
లాక్‌డౌన్ సడలింపుల్లో బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయేమోనంటూ దేశమంతా ఎదురుచూసింది. బస్సు సేవలకు అనుమతిస్తూనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి విడిచిపెట్టింది. రాష్ట్రాల్లో అంతర్గతంగానూ, ఇతర రాష్ట్రాలకూ బస్సు సేవల పునరుద్ధరణ నిర్ణయాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల అభీష్టానికే వదిలిపెట్టింది. రాష్ట్రంలో ప్రజా రవాణాపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని, అలాగే, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సదుపాయానికి ఇరు రాష్ట్రాలు పరస్పరం నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. వీటితోపాటు, రాష్ట్రాలు పలుసార్లు కేంద్రం ముందు లేవనెత్తిన జోన్‌ల కేటాయింపు నిర్ణయంపైనా కీలక ప్రకటన చేసింది. ఇది వరకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తూ వస్తున్నది. కానీ, ఇక నుంచి ఈ జోన్‌లను కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది.
ఆరోగ్య సేతు యాప్ ఆప్షనల్
కరోనా మహమ్మారి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ‘ఆరోగ్య సేతు’ మొబైల్ యాప్ ఉపకరిస్తుందని కేంద్రం ప్రచారం చేస్తూ ప్రభుత్వ సిబ్బందికి ‘తప్పనిసరి’ చేసింది. కానీ, ప్రైవేటు, కార్పొరేట్ ఆఫీసులకు మాత్రం దీన్ని ‘ఆప్షనల్’గా పెట్టింది. పని ప్రదేశాల్లో, ఆఫీసుల్లో సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యాలు ఆరోగ్య సేతు యాప్‌ను తమ ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేసుకునేలా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని సూచించింది.
నిషేధం వీటిపై యథాతధం:
-అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానయానాలు (అత్యవసర సేవలకు మినహా)
-మెట్రో రైలు సేవలు
-స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు
-హోటల్, రెస్టారెంట్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్‌లు, ఆడిటోరియంలు,
-సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, విద్యాపరమైన, మతపరమైన వేడుకలు, కార్యక్రమాలు
-ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలు, మసీదులు, చర్చీలు
అనుమతులు:
-స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియాలకు పర్మిషన్ (ప్రేక్షకులకు అనుమతి లేదు)
-ఆన్‌లైన్, డిస్టెన్స్ విద్య
-హోం డెలివరీ కోసం రెస్టారెంట్లలో కిచెన్‌లకు అనుమతి
-బస్సు సేవలు పునరుద్ధరించేందుకు అనుమతి(రాష్ట్రాల అభీష్టం మేరకే)