సంస్కరణల జైత్రయాత్ర
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. కరోనా కాలంలో ప్రకటించిన సంస్కరణలను కొనసాగిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకురానుంది. డెయిరీ, పౌల్ట్రీ, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇన్‌ఫ్రా ఫండ్ కింద రూ. 15వేల కోట్లను కేటాయించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే నిర్ణయాలను తీసుకున్నది. ముద్రా యోజన కింద శిశు కేటగిరీ రుణగ్రహీతలకు 2శాతం సబ్సిడీని ఇవ్వనుంది. ఓబీసీ కమిషన్ కాలపరిమితిని […]
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. కరోనా కాలంలో ప్రకటించిన సంస్కరణలను కొనసాగిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పట్టణ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకురానుంది. డెయిరీ, పౌల్ట్రీ, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇన్‌ఫ్రా ఫండ్ కింద రూ. 15వేల కోట్లను కేటాయించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే నిర్ణయాలను తీసుకున్నది. ముద్రా యోజన కింద శిశు కేటగిరీ రుణగ్రహీతలకు 2శాతం సబ్సిడీని ఇవ్వనుంది. ఓబీసీ కమిషన్ కాలపరిమితిని మరో ఆరునెలలు పొడిగించింది. మయన్మార్‌లోని బ్లాక్ ఏ1, ఏ3ల్లో అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ఓన్‌జీసీ విదేశ్‌కు అనుమతులనిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించేందుకు కేంద్రమంత్రి మండలి సమ్మతి తెలిపింది. ఈ ప్రకటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సంస్కరణల జైత్ర యాత్ర కొనసాగుతున్నదని ట్వీట్ చేశారు. భారత్ స్వావలంబన దేశంగా మారేందుకు సాంకేతికతలో మరింత ముందుకెళ్లేందుకు స్పేస్ సెక్టారకు సంబంధించి క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నదని ప్రకటించారు.
ఖాతాదారులకు దన్నుగా
పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) మల్టీ స్టేట్ బ్యాంకు స్కాం గత ఏడాది ఖాతాదారుల పాలిట పీడ కలగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మండలి ఖాతాదారులకు దన్నుగా నిర్ణయం తీసుకున్నది. కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులకు అండగా నిలుస్తూ 1,500 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షణలోకి తీసుకువచ్చే ఆర్డినెన్స్‌ను రూపొందించింది. షెడ్యూల్ బ్యాంకులపై ఆర్బీఐకి ఉన్న అధికారాలన్నీ 1,482 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు కూడా వర్తిస్తాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. ముద్రా యోజన శిశు విభాగంలో మార్చి 31లోపు రుణాలు తీసుకున్న వారందరికీ 12 నెలలపాటు 2శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కేటగిరీ కింద ఆస్తుల ష్యూరిటీ లేకున్నా రూ. 50వేల వరకు రుణాలను కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, డెయిరీ, పౌల్ట్రీ, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించేందుకు కేంద్ర క్యాబినెట్ రూ. 15వేల కోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధిని ఆమోదించింది. దీంతో పాల ఉత్పత్తి పెరుగుతుందని, ఎగుమతుల ఊపందుకుంటాయని, కనీసం 35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి జవడేకర్ తెలిపారు. కరోనా కారణంగా ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగానే ఈ నిధిని కేటాయించారని కేంద్ర పశుసంవర్ధక శాఖ గిరిరాజ్ సింగ్ తెలిపారు.
ఓబీసీ కమిషన్ గడువు పొడిగింపు
ఓబీసీ వర్గీకరణ సమస్యలపై ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్ గడువును మరో ఆరునెలలు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ కాలపరిమితిని 2021 జనవరి 31వరకు పొడిగించింది. కరోనా కారణంగా ప్రతిపాదనలు తయారు చేయడంలో కమిషన్‌కు అంతరాయం ఏర్పడిందని, అందుకే ఈ పొడిగింపు అని జవడేకర్ తెలిపారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్‌స్పేస్)ను అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎంటర్‌ప్రెన్యూర్‌లకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అయితే, దీనికోసం ప్రత్యేక సంస్థను నెలకొల్పకుండా ఇస్రో పర్యవేక్షణలోనే ఈ కార్యకలాపాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, బౌద్ధ కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు ఉన్న ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న యూపీలోని ఖుషీనగర్ విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా ఆమోదించినట్టు కేంద్ర మంత్రి జవడేకర్ తెలిపారు. ఈ నిర్ణయంతో బుద్ధిస్టుల టూరిజం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ లేదా ఎయిర్‌బస్‌లు కూడా ఈ విమానాశ్రయంలో ల్యాండ్ కావొచ్చని తెలిపారు.