మెయింటెనెన్స్ బాలేదు..!
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో చెరువుల నిర్వాహణపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుర్రం చెరువు, అప్పా చెరువులను పరిశీలన సమయంలో చెరువుల మెయింటెనెన్స్ బాగా చేయాల్సిన అవసరం ఉందని, ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెరువుల పటిష్టతపై శ్రద్ధ తీసుకోవాలని అభిప్రాయపడింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర బృందం గురువారం నగరానికి చేరుకుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నాయకత్వంలోని […]
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో చెరువుల నిర్వాహణపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుర్రం చెరువు, అప్పా చెరువులను పరిశీలన సమయంలో చెరువుల మెయింటెనెన్స్ బాగా చేయాల్సిన అవసరం ఉందని, ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెరువుల పటిష్టతపై శ్రద్ధ తీసుకోవాలని అభిప్రాయపడింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర బృందం గురువారం నగరానికి చేరుకుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల అధికారుల బృందంలోని ముగ్గురు సభ్యులు నగర పర్యటనలో ఉండగా, మిగతా ఇద్దరు ఇతర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రవీణ్ వశిష్టతో పాటు జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.రఘురాం, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.కె.కుష్వారా నగరాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. కాగా, బృందం సభ్యులు మొదట జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి తర్వాత ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు, చెరువులను పరిశీలించారు.
చాంద్రాయణగుట్ట ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్ఓబీని, ముంపుకు గురైన ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. ఆర్ఓబీకి రెండు వైపుల చేపట్టిన పునరుద్ధరణ, నాలా నుంచి తొలగిస్తున్న పూడిక తీత పనులను చూశారు. బాధితులతో సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గోడును బృందం ఎదుట వెల్లబోసుకున్నారు. పల్లెచెరువు తెగిపోవడంతో వరద అమాంతంగా ముంచిందని, తీవ్ర నష్టం జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ సభ్యులకు వివరించారు.
కందికల్ గేట్ వద్ద ఉన్న నాలా పునరుద్ధరణ పనులను బృందం పరిశీలించింది. చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లోని ప్రజలతో సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర బృందాన్ని కలిసి నష్టాన్ని వివరించారు. బాధితులకు ఆదుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. బృందం బాలాపూర్, హఫీజ్ బాబానగర్‌లో కూడా నష్టాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
గండి పడిన గుర్రం చెరువును, తాత్కాలికంగా చేపట్టిన పనులను బృందం పరిశీలించింది. కట్ట లోపల నిర్మించిన కృష్ణా వాటర్ పైప్‌లైన్ కు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకొని నీటి సరఫరాను కొనసాగిస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఎస్‌ఈ భీమ్ ప్రసాద్ కమిటీ సభ్యులు ఎం.రఘురామ్‌కు వివరించారు. సెంట్రల్ విజిలెన్స్ విభాగం ప్రతిపాదనల ప్రకారమే కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. పర్యటనలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఇతర అధికారులు పాల్గొన్నారు.