పోలవరం నిర్మాణంపై కేంద్రం మెలికలు
దిశ, ఏపీ బ్యూరో: “పోలవరం ప్రాజెక్టు పునరావాసం, పరిహారంతో మాకు సంబంధం లేదు. ప్రాజెక్టు నిర్మాణం వరకే మా బాధ్యత. ఏడేళ్ల నాటి అంచనా ప్రకారం ఇప్పటిదాకా నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.950 కోట్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి ఇంకా రూ.2,234.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటిదాకా ప్రాజెక్టు పునరావాసంతో కలిపి 41.05 పూర్తయింది” ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది. […]
దిశ, ఏపీ బ్యూరో: “పోలవరం ప్రాజెక్టు పునరావాసం, పరిహారంతో మాకు సంబంధం లేదు. ప్రాజెక్టు నిర్మాణం వరకే మా బాధ్యత. ఏడేళ్ల నాటి అంచనా ప్రకారం ఇప్పటిదాకా నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.950 కోట్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి ఇంకా రూ.2,234.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటిదాకా ప్రాజెక్టు పునరావాసంతో కలిపి 41.05 పూర్తయింది” ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది. స్వంతంత్రం వచ్చాక కేంద్ర ప్రభుత్వాలు అనేక జాతీయ ప్రాజెక్టులు నిర్మించాయి. ఎవరూ ఇలాంటి వితండ వాదనకు దిగలేదు. ఎక్కడైనా ఓ సాగు నీటి ప్రాజెక్టు చేపడితే అందుకోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం, కొంపాగోడు తోపాటు ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారంతోపాటు పునరావాస ఖర్చు ప్రాజెక్టు వ్యయంలో భాగంగానే పరిగణించాలి. ఇది చట్టం కూడా. దీనికి భిన్నంగా కేంద్రం వ్యవహరించడం పలువుర్ని విస్మయానికి గురిచేస్తోంది.
2013 – 14లో ప్రాజెక్టు అంచనా రూ.20,398. 61 కోట్లు. అప్పటికింకా 2013 భూసేకరణ చట్టం అమలులోకి రాలేదు. ఈ చట్టానికి ముందు ఎకరానికి రూ. లక్షన్నర పరిహారం చెల్లించారు. కొత్త చట్టం వచ్చాక అంతకు మూడు రెట్లు అధికంగా పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. ఎకరానికి రూ. 10.50 లక్షలు ఇవ్వాలి. అందుకోసమే అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు చేరింది. ఇదే అంశాన్ని నాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరించింది. గతేడాది జూలైలో భూ సేకరణ వ్యయాన్ని కొంత కుదించి రూ. 47,725.24 కోట్లకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది. ఇప్పుడు అది కూడా కుదరదని అడ్డం తిరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం 71.54 శాతం పూర్తయింది. భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపులకు సంబంధించి 19.85 శాతమే జరిగింది. అంటే నిధులన్నీ ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించి సుమారు నాలుగు లక్షల మంది అమాయక ప్రజల గొంతు కోస్తారా?
ఏ ప్రాజెక్టు అయినా తొలుత అంచనాలకు పూర్తయ్యే నాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఒకప్పుడు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సాగునీరు, తాగు నీటి అవసరాలకు ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు తొలి అంచనా సుమారు రూ.వెయ్యి కోట్లు. ఎన్టీఆర్ హయాంలో పునాది రాయి పడింది. తర్వాత చంద్రబాబు పునాదిరాయి వేసేనాటికి రూ.1200 కోట్లయింది. ఆ తర్వాత వైఎస్సార్హయాంలో ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టే నాటికి సుమారు రూ.3 వేల కోట్లకు పెరిగింది. ఇప్పుడు ప్రాజెక్టు తొలిదశ పూర్తయ్యే నాటికి రూ. 6,500 కోట్లకు చేరింది. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలు. దీనికి భిన్నంగా పోలవరం విషయంలో కేంద్రం పెరిగిన అంచనాలతో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం దారుణం.
ఇంకా బోలెడు ఖర్చుంది..
ఒకవేళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ఆ నీళ్లు కృష్ణా నదికి చేరతాయి. అక్కడ నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ కట్టి సోమశిల ప్రాజెక్టు దాకా తీసుకెళ్లాలి. ఈ ప్రాజెక్టుకు మరో రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ఈపాటికే పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ఆయా ప్రాంతాలకు సాగు, తాగు నీరందుతోంది. పోలవరం నుంచి వచ్చే గోదావరి జలాలను సాగర్ కుడికాలువ ద్వారా రాయలసీమ దాకా పంపాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు కట్టి తద్వారా వచ్చే నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? కృష్ణా నది నుంచి సముద్రానికి వదిలెయ్యలేరు కదా! అందువల్ల వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమొక్కటే కాదు. ఆ నీటిని కరువు ప్రాంతాలకు తరలించినప్పుడే ప్రాజెక్టుకు సార్థకత ఏర్పడుతుంది.
ఇదేదో రాష్ట్ర సర్కారును లొంగదీసుకునే మాయోపాయంలా ఉంది
పోలవరం పూర్తి చేయడానికి ఎంత ఖర్చయినా కేంద్రం భరిస్తుందని నిన్నమొన్నటిదాకా బీజేపీ నేతలు కూడా చెప్పారు. కానీ కేంద్రం ఇలా అడ్డం తిరగడం సరికాదు. ఎక్కడైనా భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం ప్రాజెక్టు వ్యయంలో భాగంగానే ఉంటుంది. దీనికి భిన్నంగా కేంద్రం మాట మారుస్తుందంటే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికేననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలకు అంకితమిచ్చే ప్రాజెక్టుల చుట్టూ రాజకీయాలు చోటు చేసుకోవడం దారుణం. –నాగబోయిన రంగారావు, రైతు సంఘం నేత