మరిపెడలో 73 సీసీ కెమెరాలు.. ఒక్కటీ పనిచేయడం లేదు

దిశ, మరిపెడ: నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో పట్టణాలు, పల్లెల్లో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఒక్కో కెమెరా వందమంది పోలీసులతో సమానమని పోలీసులే చెబుతున్నారు. గతంతో పోలిస్తే నేటి సాంకేతిక యుగంలో నేరస్తులను పట్టించటంలో, కేసుల సత్వర దర్యాప్తులో సీసీలు ఎంతో కీలకంగా మారాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీస్ బాసులు ప్రతీ పట్టణం, పల్లెల్లో ప్రధాన కూడళ్ల వద్ద సీసీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా మరిపెడ […]

Update: 2021-10-28 01:40 GMT

దిశ, మరిపెడ: నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో పట్టణాలు, పల్లెల్లో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఒక్కో కెమెరా వందమంది పోలీసులతో సమానమని పోలీసులే చెబుతున్నారు. గతంతో పోలిస్తే నేటి సాంకేతిక యుగంలో నేరస్తులను పట్టించటంలో, కేసుల సత్వర దర్యాప్తులో సీసీలు ఎంతో కీలకంగా మారాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీస్ బాసులు ప్రతీ పట్టణం, పల్లెల్లో ప్రధాన కూడళ్ల వద్ద సీసీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలో 73 సీసీలు, 4 అధునాతన నెంబర్ ట్రేసింగ్ కెమెరాలను, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. అయితే, ఇదంతా మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రస్తుతం 77 కెమెరాల్లో పట్టుమని పది కూడా పని చేయడంలేదు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమే అని పలువురు చర్చించుకుంటున్నారు.

దొంగలను గుర్తించేదెలా..

సరిగ్గా నాలుగు నెలల క్రితం వరంగల్ రోడ్‌లోని ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లోకి రాత్రి వేళ ఓ నిందితుడు చోరీకి యత్నించాడు. ఇంట్లో వారు మేల్కొనటంతో దొంగ పరారయ్యాడు. ఇది జరిగిన పక్షం రోజుల్లోనే అదే ఇంటికి ఎదురుగా ఉన్న నిర్మాణంలో మరో రెండు ఇళ్ళల్లో గుర్తుతెలియని దుండగులు బోరు మోటార్లను ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించారు. కానీ, అక్కడ ఉన్న సీసీలు పనిచేయటంలేదు. దీంతో చేసేదేంలేక దర్యాప్తు చేస్తామని బాధితులను పంపించేశారు. ఇది జరిగి ఐదునెలలు గడుస్తున్నా.. నేటికీ ఆ దొంగలను పోలీసులు గుర్తించలేకపోయారు. అదే విధంగా పట్టణంలోని బ్యాంకు వీధిలో నెల రోజుల క్రితం ఇంటి ముందు నిలిపిన ట్రాలీని, బ్యాటరీని దొంగిలించారు. ప్రధాన రహదారి పై ఉన్న ఓ దుకాణంలో 3 బ్యాటరీలు కూడా అపహరించారు. ఇక సద్దుల బతుకమ్మ రోజు ఏకంగా బస్టాండ్ ఎదురుగా 6 నిఘా నేత్రాలు ఉన్నా.. ఓ బైకు, సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఈ చోరీలకు సంబంధించి సీసీల్లో ఎలాంటి సమాచారం లేదు. కారణం అవి పని చేయకపోవడం. ఇన్ని జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం విడ్డురంగా ఉందని పట్టణ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే అదునుగా ఇసుక, బెల్లం వ్యాపారులు తమ కార్యకలాపాలను ప్రధాన రహదారి గుండా నిర్భయంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత వ్యాపారాలు అధికంగా జరుగుతున్నా.. సీసీల పనితీరు సరిగా లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మరిపెడలో గుట్కాలు, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వయా మరిపెడ..

మరిపెడ మీదుగా అనేక అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని, వాటి అదుపుచేయడానికి గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా వెల్లడించారు. ఇదే క్రమంలో బెల్లం, గంజాయి, రేషన్ అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు నిలువరిస్తున్నా.. అక్రమ వ్యాపారాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మరిపెడ పరిసర ప్రాంతాల్లో బెల్లం, గుట్కా, గంజాయి అధికంగా సరఫరా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మరిపెడ గ్యామతాండలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న 2 కిలోల గంజాయి, గడచిన నెల రోజుల్లో మండల పరిధిలో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికైనా పోలీసులు సీసీలు బాగుచేయాలని, అక్రమ వ్యాపారులకు అడ్డుకట్ట వేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

బ్యాటరీ ఎత్తుకెళ్లారు

నెలరోజుల క్రితం నా ట్రాలీని ఇంటి ముందు నిలిపి ఉంచాను. అర్ధరాత్రి ఎవరో స్టెఫిని టైరు, బండి బ్యాటరీని ఎత్తుకెళ్లారు. రెండింటి విలువ సుమారు పదివేలు ఉంటుంది. పోలీసులను సంప్రదించగా సీసీ పనిచేయటం లేదు అని సమాధానం ఇచ్చారు. దీంతో చేసేదేంలేక వెనుదిరిగి వచ్చాను. – రమేష్, మరిపెడ

Tags:    

Similar News