కాసుల వేట@111

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 111.. ప్రతికూలతను అనుకూలం చేసుకోవడానికి.. చూసీచూడనట్టు వ్యవహరిస్తూ కోట్లకు పడగెత్తడానికి, .. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా నొక్కేయడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది.. అక్రమాలు వెలుస్తున్నా, సర్కార్​ జాగా కరిగిపోతున్నా కొందరు అధికారులు, నాయకులు తమ పనిని చక్కబెట్టుకుంటున్నారు.. సెటిల్​మెంట్​ చేసుకుంటూ జీవితంలో సెటిల్​ అవుతున్నారు.. ఒకరికొకరు సహకరించుకుంటూ పని చేసుకుంటూ పంచేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీఓ 111 మాత్రం కొందరు అక్రమార్కులకు కాసులు […]

Update: 2020-09-24 20:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 111.. ప్రతికూలతను అనుకూలం చేసుకోవడానికి.. చూసీచూడనట్టు వ్యవహరిస్తూ కోట్లకు పడగెత్తడానికి, .. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా నొక్కేయడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది.. అక్రమాలు వెలుస్తున్నా, సర్కార్​ జాగా కరిగిపోతున్నా కొందరు అధికారులు, నాయకులు తమ పనిని చక్కబెట్టుకుంటున్నారు.. సెటిల్​మెంట్​ చేసుకుంటూ జీవితంలో సెటిల్​ అవుతున్నారు.. ఒకరికొకరు సహకరించుకుంటూ పని చేసుకుంటూ పంచేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీఓ 111 మాత్రం కొందరు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పంచాయతీ, మున్సిపల్ అధికారులకు జేబులు నింపుతోంది. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లతో కాసుల పంట పండిస్తోంది. గచ్చిబౌలి చెంతనే ఉన్న భూములు, ప్రధానంగా క్యూ సిటీ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు, జయభేరి, అపర్ణ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిగిన గౌలిదొడ్డిని అనుసరించి వెలిసిన లేఅవుట్లకు రూ.కోట్లు కురుస్తున్నాయి. నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. పర్మిషన్లు లేకపోయినా నార్సింగి మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు ఇచ్చేశారు, పన్నులు వసూలు చేస్తున్నారు.

ఐటీ కారిడార్ కు పక్కనే ఉన్న వట్టినాగులపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వెలిసిన లేఅవుట్లలో ఈ ఆరేండ్ల నుంచి అక్రమ నిర్మాణాలేవీ ఆగలేదు. పంచాయతీ కార్యదర్శుల అనుమతులతోనే బహుళ అంతస్తులు వెలిశాయి. జీ ప్లస్ 2 అనుమతి పత్రాన్ని దగ్గరుంచుకుని ఇష్టమున్నట్టు నిర్మాణాలు కానిస్తున్నారు. పదుల సంఖ్యలో వెలసిన కాలనీలకు పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా కూల్చివేత చర్యకు దిగుదామంటే వెంటనే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు అధికారులు సైలెంట్​ ఉండాల్సిందే.. ఈ కాలంలోనే రూ.లక్షలు చేతులు మారుతాయి. కరోనా విపత్తులోనూ జీఓ 111తో అక్రమాల పేరిట డబ్బుల వర్షం కురిసిందనే గుసగుసలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వట్టినాగులపల్లి రెవెన్యూ జీఓ 111 పరిధిలో పద్మశ్రీ కాలనీ ఏర్పడింది. పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగాయి. అక్కడ పూర్తయిన ఇళ్లకు నంబర్లు ఇప్పించేందుకు మధ్యవర్తులంతా కలిసి సమావేశాలు నిర్వహించారు. కొందరు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు అక్రమ నిర్మాణాలను ఆమోదించేందుకు రూ.1.70 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ అమౌంట్ నుంచి మున్సిపల్ అధికారులకూ సర్దుబాటు చేస్తామని యజమానులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇలా వట్టినాగులపల్లిలో వెలిసిన అన్ని కాలనీల్లోనూ అక్రమాలకు క్లీన్ షీట్ ఇప్పించడంలో నాయకులే కీలక భూమిక పోషిస్తున్నారు.

ఎవరైనా నిర్మాణం షురూ చేయగానే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడం, వాళ్లొచ్చి ఏదో చేస్తున్నట్టు నటించి సెటిల్మెంట్ చేసుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాల వైపు వెళ్లొద్దంటూ పెద్ద నాయకులే గల్లీ లీడర్లకు చెబుతున్నరన్న ప్రచారమూ ఉంది. ఈ క్రమంలోనే గౌలిదొడ్డి పక్కనే ఉన్న ఓ చెరువు ఆనవాళ్లు పూర్తిగా పోయి ఫంక్షన్ హాళ్లు వెలిశాయి, మున్సిపల్, పంచాయతీ అధికారులు వాటికి ఇంటి నంబర్లు కూడా ఇచ్చారు. దాని వెనుక కూడా పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వట్టినాగులపల్లిలో గజం ధర రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా పలుకుతోంది. ఐటీ కారిడార్ పక్క కావడంతో భారీగా డిమాండ్​ ఉండడం, పైగా తక్కువ ధరకే ప్లాట్లు లభిస్తుండడంతో వేలాది మంది కొనుగోలు చేశారు. జీఓ 111 గురించి తెలిసి కొందరు, తెలియక కొందరు కొనుగోలు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని స్థానిక నాయకులు పాత తేదీలతో పంచాయతీ కార్యదర్శులతో ఇంటి నిర్మాణ లేఖలను ఇప్పిస్తూ ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఇళ్ల నిర్మాణం కావడం, మున్సిపల్ అధికారులు నంబర్లు కూడా ఇచ్చారు.

నిర్మాణాలకు అనుమతులే లేని జీఓ 111 పరిధిలో ఏకంగా భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం సమకూరకుండా కొందరు నేతలు, అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూన్నారు. నిర్మాణాలు చేపట్టద్దనే అధికారులే ఇంటి పన్ను వసూళ్లు చేస్తున్నారు.

ఐటీ కారిడార్ కు ఆనుకొని వందల సంఖ్యలో నిర్మాణాలు వెలుస్తున్నా పురపాలక శాఖ నుంచి కనీస స్పందన లేకుండా పోయింది. నిర్మాణాలకే అనుమతి లేని భూముల్లో కేవలం 200 గజాల విస్తీర్ణంలో 5, 6 అంతస్తుల భవనాలు వెలుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కియో మోటర్ సర్వీసెస్, అమెజాన్ డిస్పాచ్ గోడౌన్, ఫ్లిప్ కార్డ్ డిస్పాచ్ గోడౌడ్, బ్లూ డార్ట్, హ్యూండాయ్ సర్వీస్ సెంటర్ వంటి అనేక కంపెనీలు ఇక్కడి స్థలాలను లీజుకు తీసుకొని నిర్మించారు. కొందరు నాయకులు, అధికారులు జేబులు నింపుకోవడం కోసం అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

గోల్కొండ రిసార్టు పక్కనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. హిమాయత్ సాగర్ కు అత్యంత సమీపంలోనే కావడం విశేషం. కానీ ఈ నిర్మాణాలను ఏ అధికారి, ఏ నాయకుడు కూడా అడ్డుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాని వెనుక ఓ ఎమ్మెల్యే కూడా ఉండడంతో కనీసం ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నట్లు సమాచారం. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను కూడా స్థానిక మున్సిపల్ అధికారులు బేఖాతరు చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న ‘ధరణి పోర్టల్’లో వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ నమోదు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ శాఖ పోర్టల్ లోని సమాచారాన్ని యథాతథంగా ధరణి పోర్టల్ లోకి బదిలీ చేస్తే ఈ అక్రమాలకూ అనుమతులు లభించినట్లవుతుంది. అధికారికంగా ధరణిలోనూ ఆ ఆస్తుల వివరాలను గుర్తించినట్లే. దీంతో ఆ అక్రమ నిర్మాణాలన్నీ తిరిగి అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ క్రమంలో పురపాలక శాఖ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఇచ్చిన ఇంటి నంబర్లను ఏం చేయనున్నారోనన్న చర్చ స్థానికుల్లో మొదలైంది.

Tags:    

Similar News